Updated : 06/06/2022 14:18 IST

నాజూకైన నడుము కోసం..!

నడుం నాజూగ్గా ఉండాలనే కోరిక సాధారణంగా అమ్మాయిలందరికీ ఉంటుంది. ఓ రకంగా అమ్మాయిలందరూ జపించే ఫిట్‌నెస్ మంత్రమే ఇది! మరీ 'జీరో సైజు' అయినా కాకపోయినా నడుం సన్నగా ఉంటే ఎలాంటి డ్రస్సులైనా సూటవుతాయని చాలామంది భావిస్తారు. దీనికోసమే చాలామంది అమ్మాయిలు ఫిట్‌నెస్ సెంటర్లను ఆశ్రయించడం, ఇంట్లోనే రకరకాల వ్యాయామాలు చేయడం, తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం.. ఇలా ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం...

రెండుమూడు గంటల ముందే..

రాత్రుళ్లు పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే తినడం ముగించుకోవాలి. అలాకాకుండా పడుకునే ముందు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి నాజూగ్గా అవడానికి బదులు లావుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకేమైనా ఇతర పనులుంటే రాత్రి భోజనం తర్వాత చేసుకుంటే మంచిది. దీనివల్ల అటు మీకు టైంపాస్ అయినట్లూ ఉంటుంది.. ఇటు లావుగా కాకుండానూ జాగ్రత్తపడచ్చు.

ఎలాంటి ఆహారం?

నాజూకైన నడుము కావాలంటే మనం రోజూ తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే. దీనికోసం తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లు, చాక్లెట్లు.. మొదలైన వాటికి స్వస్తి చెప్పి.. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు.. మొదలైనవి తినడం అలవాటు చేసుకోవాలి.

కొవ్వుల్లో కొన్ని మన శరీరానికి అవసరమైనవి కూడా ఉంటాయి. మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా లభించే గింజలు, అవకాడో.. వంటివి తినడం వల్ల శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందడంతో పాటు, బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

తృణధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచడంతో పాటు బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. అలాగే ప్రొటీన్లు ఎక్కువగా లభించే బీన్స్, నట్స్.. వంటివి కూడా తీసుకోవచ్చు.

అతిగా వద్దు!

తక్కువ క్యాలరీలుండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమన్నాం కదా అని, మరింత నాజూగ్గా ఉండాలని.. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల బరువు పెరగడం మాత్రమే కాదు, ఆయాసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీసుకున్న ఆహారం మీకు సరిపోయిందనిపిస్తే ఇక తినడం ఆపేయాలి.

మీరు తినేటప్పుడు చిన్నగా ఉండే ప్లేట్లను ఉపయోగించడం మంచిది.

ఆహారం వేగంగా తినకుండా.. నెమ్మదిగా నములుతూ తినాలి. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి.

తీసుకునే ఆహారం ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది.

వ్యాయామం తప్పనిసరి..

నడుము నాజూగ్గా ఉంచుకోవడంలో వ్యాయామం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా వారానికి ఐదు రోజులు ప్రతిరోజూ అరగంట పాటు కార్డియో ఎక్సర్‌సైజులు చేయడం అలవాటు చేసుకోవాలి.

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం.. ఇలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాయామం చేయడం మాత్రం మరచిపోవద్దు. లేదంటే ఒక్కో సందర్భంలో మీరు ఎన్ని ఆహార నియమాలు పాటించినా వృథానే అవుతుంది.

ఉదయం నిద్ర లేచిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి. దీనివల్ల అటు శరీరానికి.. ఇటు మనసుకు ప్రశాంతంగా అనిపించడంతో పాటు నిద్ర మత్తు కూడా వదిలిపోతుంది. తర్వాత వ్యాయామం చేసుకోవడానికి శరీరం సహకరిస్తుంది.

డ్యాన్స్ చేయడం, ఈత కొట్టడం, సైక్లింగ్.. వంటివి కూడా నడుముకు చక్కటి ఆకృతిని తెచ్చిపెడతాయి.

నడుము చుట్టుకొలతను తగ్గించుకోవాలనుకునే వారు కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరించడమే ఉత్తమం. దీనివల్ల బరువు పెరిగినా, తగ్గినా సులభంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇవి అసౌకర్యంగా అనిపిస్తే మీకు సౌకర్యవంతంగా ఉండే వాటినే ఎంపిక చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని