Published : 11/12/2022 10:58 IST

కనుబొమ్మల్లో చుండ్రు.. సహజ చిట్కాలతో..!

చుండ్రు.. జుట్టు రాలిపోవడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి. అయితే కొంతమందిలో ఇది కేవలం కురులకు మాత్రమే పరిమితం కాదు.. ప్రత్యేకించి చలికాలంలో కొంతమంది కనుబొమ్మల్లో కూడా చుండ్రు సమస్యతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతోనే ఈ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.

బాదంనూనెతో..

పొడిచర్మతత్వం కారణంగా కనుబొమ్మల వద్ద ఇలాంటి సమస్యతో సతమతమవుతున్నవారు బాదం నూనెతో కాస్త ఉపశమనం పొందచ్చు. కొద్దిగా బాదంనూనె తీసుకొని గోరువెచ్చగా చేసి దాంతో కనుబొమ్మలకు రోజూ మృదువుగా మర్దన చేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. మర్నాడు ఉదయాన్నే చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరి! అయితే ఈ చిట్కాను రోజూ రాత్రి నిద్రపోయే ముందు పాటించడం ద్వారా సత్వర ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

వేపనూనెతో..

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల చర్మ సమస్యలను నివారిస్తాయి.  కొద్దిగా వేపనూనెను చుండ్రు ఉన్న ప్రదేశాల్లో అప్లై చేయడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.

నిమ్మరసంతో..

నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు కలపాలి. ఆ తర్వాత చుండ్రు ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్స్‌తో కళ్లలో పడకుండా జాగ్రత్తగా అప్త్లె చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నిమ్మలో ఉండే యాంటీఫంగల్ గుణాల కారణంగా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా..

⚛ రాత్రంతా నానబెట్టిన మెంతులను మెత్తని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని కనుబొమ్మలకు అప్త్లె చేయాలి. కాసేపు ఆరనిచ్చి తర్వాత వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

⚛ కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని కనుబొమ్మలపై అప్త్లె చేసి మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ జాగ్రత్తలు..

⚛ కనుబొమ్మలకు ఏం అప్త్లె చేసినా అవి కళ్లలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

⚛ కనుబొమ్మల్లో చుండ్రు సమస్య ఉన్నప్పుడు మేకప్‌కి వీలైనంత దూరంగా ఉండడమే శ్రేయస్కరం.

⚛ విటమిన్ సి అధికంగా ఉన్న పదార్థాలను డైట్‌లో భాగంగా చేసుకోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

⚛ రోజూ వీలైనంత ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సహజసిద్ధమైన చిట్కాలు పాటించినప్పటికీ సమస్యలో ఎలాంటి మార్పు కనిపించకపోయినా లేదా సమస్య మరింత తీవ్రమైనట్లు అనిపించినా వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని