Updated : 03/10/2022 23:35 IST

మహిళలకు మేలు చేసే ప్రొబయోటిక్స్..!

ప్రొబయోటిక్స్.. వీటివల్ల కేవలం జీర్ణవ్యవస్థకే కాకుండా ఇతరత్రా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.

యూరిన్‌ ఇన్ఫెక్షన్లకు దూరంగా...

సాధారణంగా పురుషుల కంటే మహిళల్లో మూత్ర నాళ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. 50 నుంచి 60 శాతం మహిళలు తమ జీవితకాలంలో ఈ సమస్యను ఒక్కసారైనా ఎదుర్కొంటారని పరిశోధనలు చెబుతున్నాయి. కొంతమంది మహిళల్లో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారు ప్రొబయోటిక్స్‌ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. వీటిలోని మేలు చేసే బ్యాక్టీరియా జననేంద్రియాల దగ్గర ఉండే చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి. తద్వారా యూరిన్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఈ సమస్యల నుంచి..

వెజైనాలో హానికారకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే సమస్య వస్తుంటుంది. ఇది మహిళల రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంటుంది. గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలకూ దారి తీయచ్చు. ప్రొబయోటిక్స్‌ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి పరిష్కారం పొందచ్చంటున్నారు నిపుణులు. ఇవి పెరుగులో అధికంగా ఉంటాయి.

మూడ్‌ స్వింగ్స్...

గర్భధారణ, నెలసరి, మెనోపాజ్‌ సమయాల్లో.. హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల మూడ్‌ స్వింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది మహిళలు. ప్రొబయోటిక్స్‌ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఈ పదార్థాల్లో అధికంగా...

పులియబెట్టిన ఆహారపదార్థాల్లో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పెరుగు మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే ప్రతి రోజూ పెరుగుని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పెరుగు తినని వారు మజ్జిగ తీసుకోవచ్చు. పెరుగు తర్వాత ఇడ్లీ, దోశలలో ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇడ్లీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు ప్రొబయోటిక్స్ కోసం ఇడ్లీలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటితో పాటు అరటిపళ్లు, యాపిల్‌, ఉల్లి, వెల్లుల్లి.. మొదలైన వాటిలోనూ ఇవి లభిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని