Ukraine Crisis: రష్యాపై పోరు.. ఖైదీలను విడుదల చేసిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌, రష్యా మధ్య సైనిక పోరు భీకరంగా కొనసాగుతోంది. ఐదో రోజూ రష్యా దూసుకొస్తుండగా..ఉక్రెయిన్‌ ఎదురొడ్డి నిలుస్తోంది.

Updated : 28 Feb 2022 12:09 IST

ఇప్పటివరకు 16 మంది చిన్నారుల మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌, రష్యా మధ్య సైనిక పోరు భీకరంగా కొనసాగుతోంది. ఐదో రోజూ రష్యా దూసుకొస్తుండగా..ఉక్రెయిన్‌ ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాజధాని నగరం కీవ్‌, ప్రధాన నగరమైన ఖర్కీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్ స్టేట్ సర్వీస్ ఆఫ్ స్పెషల్ కమ్యూనికేషన్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని వెల్లడించిందని ఓ వార్త సంస్థ తెలిపింది. కీవ్‌లో వైమానిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ అయ్యాయని పేర్కొంది. అక్కడి ప్రజలు సమీపంలోని షెల్టర్‌లో ఆశ్రయం పొందాలని సూచనలు వచ్చినట్లు చెప్పింది. అలాగే చెర్నిహివ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. దాంతో రెండు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. క్షతగాత్రుల వివరాలు మాత్రం తెలియరాలేదు. 

16 మంది చిన్నారుల మృతి:

ఫిబ్రవరి 24న రష్యా మొదలు పెట్టిన సైనిక చర్య కారణంగా ఇప్పటివరకు 16 మంది చిన్నారులు చనిపోయారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ మంత్రి విక్టర్ లియష్కో వెల్లడించారు. ఈ ఉద్రిక్తతల కారణంగా 3.5 లక్షల మంది చిన్నారులకు చదువు అందడం లేదని ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి ఆందోళన వ్యక్తం చేశారు.  

రష్యాపై పోరాటానికి ఖైదీల విడుదల:

దూసుకొస్తోన్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులను విడుదల చేస్తోంది. దాంతో వారు దేశం తరఫున రష్యాపై పోరాటంలో చేరనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాజిక్యూటర్ జనరల్‌ కార్యాలయం ధ్రువీకరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని