Taiwan: తైవాన్‌ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలు రెండోరోజుకు చేరాయి. భారీ ఎత్తున నౌకలు, విమానాలను డ్రాగన్‌ మోహరించింది. 

Published : 09 Apr 2023 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌(Taiwan) సమీపంలో చైనా(China) సైనిక దళాలు ‘జాయింట్‌ సోర్డ్‌’ పేరిట చేపట్టిన యుద్ధవిన్యాసాలు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, నౌకలను చైనా మోహరించింది. తైవాన్‌ అధ్యక్షురాలి అమెరికా పర్యటనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ చైనా ఈ విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ విన్యాసాల్లో తైవాన్‌ను చుట్టుముట్టడంపై చైనా సైనికులు సాధన చేస్తున్నారు. ఇవి సోమవారం కూడా కొనసాగనున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తూర్పు కమాండ్‌ వీటిని నిర్వహిస్తోంది. ఈ యుద్ధ విన్యాసాల్లో భాగంగా చైనా తమ దళాలు, విమానాలు, నౌకలను తైవాన్‌ వైపు జలాల్లోకి పంపుతోంది. దీనిపై చైనాకు చెందిన సీసీటీలో వచ్చిన ఓ కథనంలో ‘‘టాస్క్‌ఫోర్స్‌ ఒకదాని తర్వాత మరొకటి గస్తీలు నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు తైవాన్‌ను ముట్టడిస్తున్నాయి. లాంగ్‌ రేంజ్‌ రాకెట్‌ ఆర్టిలరీ, నేవల్‌ డెస్ట్రాయర్‌, మిసైల్‌ బోట్స్‌, ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్స్‌, బాంబర్స్‌, జామర్స్‌, రిఫ్యూయెలర్స్‌ వంటి ఆయుధాలను మోహరించారు’’ అని పేర్కొంది.

సోమవారం జరిగే విన్యాసాల్లో భాగంగా ఫుజియాన్‌లో లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ చేపట్టనున్నారు. తైవాన్‌కు చెందిన మత్సు ద్వీపానికి ఇవి 80 కిలోమీటర్ల దూరంలో జరగనున్నాయి. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని కోరుకొనే వేర్పాటువాద శక్తులు కలిసి చేపట్టే కవ్వింపు చర్యలకు ఓ హెచ్చరిక వలే ఈ యుద్ధవిన్యాసాలు పనిచేస్తాయని పీఎల్‌ఏ ప్రతినిధి వెల్లడించారు. చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు ఈ ఆపరేషన్‌ అవసరమని పేర్కొన్నారు.

మరోవైపు చైనా యుద్ధ విన్యాసాలను తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ యింగ్‌వెన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికాతో కలిసి పనిచేస్తామని తేల్చి చెప్పారు. నియంతృత్వ విస్తరణ వాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా సహా భావసారూప్యత ఉన్న దేశాలతో కలిసి నడుస్తామని పునరుద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని