Donald Trump: అప్పుడలా.. ఇప్పుడిలా.. టిక్‌టాక్‌పై మారిన ట్రంప్ స్వరం

టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తే.. ఫేస్‌బుక్‌ లాభం పొందుతుందని అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.

Published : 12 Mar 2024 16:21 IST

వాషింగ్టన్‌: యూజర్ల సమాచారం సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్‌ సహా పలు దేశాలు టిక్‌ టాక్‌ (TikTok)పై నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా కూడా దీనిపై చర్యలకు సిద్ధమైంది. కానీ, న్యాయపరమైన సమస్యల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి దీనిపై చర్చ మొదలైంది. బుధవారం టిక్‌టాక్‌పై నిషేధం విధించే బిల్లును రిపబ్లికన్లు యూఎస్‌ హౌస్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు మద్దతుగా ట్రంప్‌ వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. దానిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్‌ లాభపడుతుందని ఆయన చెబుతున్నారు.

‘‘టిక్‌టాక్‌తో మంచీ, చెడు రెండూ ఉన్నాయి. దేశంలో యువత సహా ఎంతోమంది ఆ యాప్‌ను ఇష్టపడుతున్నారు. దానిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుంది. ఆ సంస్థ వ్యాపారం రెండితలవుతుంది. వాస్తవానికి అమెరికన్లకు నిజమైన శత్రువు ఫేస్‌బుక్‌. ఎన్నికల్లో అది జోక్యం చేసుకోవడం మంచిది కాదు. టిక్‌టాక్‌ ద్వారా అమెరికన్ల డేటా చైనా సేకరించడం దేశ భద్రతకు ముప్పే. కానీ, దానిపై నిషేధం విధించి ఫేస్‌బుక్‌ను పెద్దదాన్ని చేయడం మంచిది కాదు’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

టిక్‌టాక్‌కు అమెరికాలో 150 మిలియన్ల యూజర్లు ఉన్నారు. దీన్ని చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ యాప్‌ వద్ద ఉన్న అమెరికన్ల సమాచారం చైనా చేజిక్కించుకునే అవకాశం ఉందని కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో బైట్ డ్యాన్స్‌ సంస్థ టిక్‌టాక్‌ను అమ్మేయాలని అమెరికా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. లేదంటే దానిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. బుధవారం దీనిపై ఓటింగ్‌ జరగనుంది. అయితే, టిక్‌టాక్‌కు యువతలో ఉన్న ఆదరణ, గత అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ జోక్యం చేసుకుందనే ఆరోపణల నేపథ్యంలో సొంత పార్టీ నేతలు ప్రవేశపెట్టబోయే బిల్లును ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని