Ukraine Crisis: పుతిన్‌ను నిలదీయడానికి భారత్‌కు భయం: బైడెన్‌

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాను నిలదీసే విషయంలో భారత్‌ ఎందుకో కొంత భయపడుతున్నట్లు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, మిత్రపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

Updated : 23 Mar 2022 05:52 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాను నిలదీసే విషయంలో భారత్‌ ఎందుకో కొంత భయపడుతున్నట్లు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, మిత్రపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సోమవారం అమెరికా వాణిజ్య సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవోల) రౌండ్‌ టేబుల్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘పుతిన్‌ గురించి నాకు బాగా తెలుసు. నాటోలో చీలిక తీసుకురావొచ్చని ఆయన అనుకున్నారు. నాటో ఇంతలా కృత నిశ్చయంతో ఒకే మాటపై ఉంటుందని రష్యా అధ్యక్షుడు ఎన్నడూ ఆలోచించలేదు. ఈ కూటమి చరిత్రను పరిశీలిస్తే.. ఇప్పుడున్నంత బలంగా, ఇంతటి ఐకమత్యంతో ఇంతకుముందు ఎన్నడూ లేదని నేను కచ్చితంగా చెప్పగలను. దానికి చాలావరకు కారణం పుతిన్‌..! క్వాడ్‌ కూటమిలో భారత్‌ మాత్రమే రష్యాపై కఠినంగా లేదు. జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా నిలిచే విషయంలో భారత్‌ అస్థిరంగా ఉంది’’ అని బైడెన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రభావంలో తాజా పరిణామాలను వివరించడానికి నిర్వహించిన సదస్సులో వివిధ ప్రధాన పరిశ్రమలకు చెందిన 16 మంది సీఈవోలు పాల్గొన్నారు. పుతిన్‌ నిర్ణయాల కారణంగా ప్రపంచ మార్కెట్లు, సరఫరా వ్యవస్థలకు వాటిల్లుతున్న అంతరాయాల మీద దీనిలో చర్చించినట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని