Germany vs Russia: అది ‘సమాచార యుద్ధమే’.. రష్యాలో ఆడియో లీక్‌పై మండిపడిన జర్మనీ

సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసి తమ దేశాన్ని అస్థిర పరచేందుకు రష్యా (Russia) యత్నిస్తోందని ఇది సమాచార యుద్ధంలో భాగమేనని జర్మనీ ఆరోపించింది.

Published : 04 Mar 2024 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసి తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు రష్యా (Russia) యత్నిస్తోందని జర్మనీ ఆరోపించింది. ఇది సమాచార యుద్ధంలో (Information war) భాగమేనని.. ఇందులో మాస్కో విజయం సాధించబోదని పేర్కొంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి (Ukraine Crisis) సంబంధించి తమ సైన్యం జరిపిన రహస్య చర్చల ఆడియో రికార్డింగ్‌ రష్యాలో వైరల్‌ కావడంపై జర్మనీ ఈవిధంగా స్పందించింది.

ఉక్రెయిన్‌ యుద్ధానికి మద్దతుగా నిలుస్తోన్న పాశ్చాత్య దేశాలు.. సైనికపరంగా, ఆర్థికంగా సాయం చేస్తున్నాయి. ఇందులోభాగంగా సుదూర లక్ష్యాలను ఛేదించే టారస్‌ క్షిపణులను సమకూర్చే విషయంలో సాధ్యాసాధ్యాలతోపాటు ఇతర అంశాలపై జర్మనీ సైన్యం ఇటీవల రహస్య సంప్రదింపులు జరిపింది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల సహకారంపైనా చర్చ జరిగింది. వీటికి సంబంధించిన 38 నిమిషాల ఓ ఆడియో రికార్డింగ్‌.. రష్యా సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అయింది.

ఆ చర్యలతో ‘అణు యుద్ధం’ ముప్పు.. పశ్చిమ దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

ఈ పరిణామాలపై జర్మనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్ని అస్థిరపరచడంతోపాటు కలవరపెట్టేందుకే పుతిన్‌ ప్రయత్నిస్తున్నారని జర్మనీ రక్షణశాఖ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ మండిపడ్డారు. ఇది సమాచార యుద్ధంలో భాగమేనన్న ఆయన.. ఈ విషయంలో పుతిన్‌ (Vladimir Putin) విజయం సాధించలేడన్నారు. ఇదిలాఉంటే, దాదాపు 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలనూ ఛేదించే టారస్‌ క్షిపణులను అందించాలని జర్మనీని ఉక్రెయిన్‌ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. అయితే.. యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే భావనతో బెర్లిన్‌ అందుకు నిరాకరిస్తోందని తెలుస్తోంది.

ఈ వ్యవహరంపై తాజాగా రష్యా కూడా స్పందించింది. ఆడియో లీక్‌ కలకలం, జర్మనీ రక్షణ మంత్రి చేసిన ఆరోపణల నేపథ్యంలో రష్యాలోని జర్మనీ రాయబారికి మాస్కో సమన్లు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని