Canada Army: ‘అది రాజకీయ సమస్య.. సైనిక సంబంధాలపై ప్రభావం చూపదు!’

భారత్‌- కెనడాల మధ్య ప్రస్తుత వివాదం.. ఇరు దేశాల సైనిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపదని కెనడా ఆర్మీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ అన్నారు.

Updated : 26 Sep 2023 15:15 IST

దిల్లీ: ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య కేసుతో భారత్‌- కెనడాల మధ్య దౌత్యపర సంబంధాలు (India- Canada Relations) దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదం ప్రస్తుతానికి ఇరుదేశాల సైనిక సంబంధాల (Military Ties)పై ఎటువంటి ప్రభావం చూపదని కెనడా ఆర్మీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ అన్నారు. భారత్‌ వేదికగా నిర్వహిస్తోన్న ‘ఇండో పసిఫిక్‌ ఆర్మీ చీఫ్స్‌ కాన్ఫరెన్స్‌ (IPACC)’లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్న ఆయన.. ప్రస్తుత వివాదాన్ని రాజకీయ స్థాయిలో పరిష్కారానికి వదిలేసినట్లు చెప్పారు.

‘ఇప్పటివరకు నాకు తెలిసినంత మేరకు ప్రస్తుత ఉద్రిక్తతలు ద్వైపాక్షిక సైనిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోవు. ఇది రెండు దేశాల మధ్య రాజకీయ స్థాయి సమస్య. మా రెండు సైన్యాల మధ్య ఇది ప్రభావం చూపడం లేదు. సోమవారం రాత్రే భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో మాట్లాడాను. ఇది రాజకీయ సమస్య అని, సైనికపరంగా ఎటువంటి సంబంధం లేదని ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చాం’ అని పీటర్‌ స్కాట్‌ చెప్పారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం స్థాపనే లక్ష్యంగా అందరం ఎలా పనిచేయగలమో చర్చిస్తున్నట్లు తెలిపారు.

నిజ్జర్‌ హత్యకు సంబంధించి 90 సెకన్ల సీసీటీవీ పుటేజీ.. అమెరికా పత్రిక వెల్లడి

ఇదిలా ఉండగా.. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధరించేందుకుగానూ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు భారత సైన్యం రెండు రోజుల ‘ఇండో- పసిఫిక్ ఆర్మీ చీఫ్‌ల సమావేశాని’కి ఆతిథ్యం ఇస్తోంది. 30కిపైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలంటూ భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ మనోజ్‌ పాండే తన ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని