Ukraine Crisis: బలహీనపడుతున్న పుతిన్‌ సైన్యం!.. రష్యా సరిహద్దుకు ఉక్రెయిన్‌ సేనలు

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన పోరులో క్రెమ్లిన్‌ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది......

Published : 17 May 2022 02:08 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన పోరులో క్రెమ్లిన్‌ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. సైనిక చర్య మొదలైనప్పటి నుంచి రష్యా దళాలు బలహీనపడుతున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు పుతిన్‌ సైన్యం మూడింతల్లో ఒకింత నష్టాన్ని చవిచూసినట్లు తెలిపింది. తూర్పు ఉక్రెయిన్‌లో ఆ దేశం పట్టుకోల్పోయిందని, వారి పాచికలు పారడంలేదని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

‘రష్యా బలగాల శక్తిసామర్థ్యాలు క్షీణిస్తున్నాయి. సైన్యాన్ని వెనువెంటనే భర్తీ చేయలేకపోతుండటంతో వారి కార్యకలాపాలు ప్రణాళిక ప్రకారం కొనసాగడంలేదు. దీంతో పోరాట సామర్థ్యం తగ్గిపోయి సైనికులు లొంగిపోతున్నారు’ అని యూకే రక్షణ శాఖ పేర్కొంది. రానున్న 30 రోజుల్లోనూ ఆక్రమణ చర్యను వేగవంతం చేయలేని పరిస్థితుల్లో క్రెమ్లిన్‌ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని తెలిపింది.

అంతకుముందు ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు వాదిమ్‌ డెనిసెంకో ఓ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ ఖార్కివ్ ప్రాంతంలోని తమ దేశ సైన్యం రష్యా సరిహద్దుల వరకు వెళ్లాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ 127వ బ్రిగేడ్ బెటాలియన్ రష్యా సరిహద్దుకు చేరుకుందని పేర్కొంటూ.. ‘విజయానికి చేరువలో ఉన్నాం’ అని తెలిపింది. జెలెన్‌స్కీ సైన్యం రష్యా సరిహద్దుకు చేరుకున్న ఓ వీడియోను ఉక్రెయిన్‌లోని ఆస్ట్రియా మాజీ రాయబారి అలెగ్జాండర్‌ చెర్బా తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘అధ్యక్షుడా.. శత్రు దేశ సరిహద్దులకు చేరుకున్నాం’ అంటూ సైనికులు అందులో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని