USA: ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’.. నిక్కీ హేలీని అడిగిన ట్రంప్‌ మద్దతుదారు

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఇండో అమెరికన్‌ నిక్కీ హేలీకి ఎన్నికల ర్యాలీలో అనూహ్య పరిణామం ఎదురైంది. 

Updated : 24 Jan 2024 06:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా(USA) అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ (Republican Party) తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ (Nikki Haley)కి అనుకోని పరిణామం ఎదురైంది. న్యూ హాంప్‌షైర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెకు ట్రంప్ మద్దతుదారు పెళ్లి ప్రతిపాదన చేశాడు. తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతుండగా ‘‘నన్ను పెళ్లి చేసుకుంటారా’’ అని గుంపులోంచి బిగ్గరగా అరిచాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న ఆమె అనంతరం హాస్యాస్పదంగా స్పందించారు. తనకు మద్దతుగా ఓటు వేస్తావా? అని అడిగారు. నేను ట్రంప్‌నకు ఓటు వేయబోతున్నాను అంటూ కాసేపటి తర్వాత హేళనగా అతడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో అసహనానికి గురైన నిక్కీ వెంటనే ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అరిచారు. ఈ ఘటనతో హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. ఈ సంఘటన అనంతరం నిక్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో ఉన్న 52 ఏళ్ల నిక్కీ హేలీ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు గట్టిపోటీదారుగా ఉన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఇటీవల జరిగిన అయోవా రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ హేలీకి 19 శాతం ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ 51 శాతం ఓట్లు దక్కించుకోగా, డిశాంటిస్‌కు 21 శాతం, మరో భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామికి 7.7 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో తొలుత వివేక్‌, తర్వాత డిశాంటిస్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొని ట్రంప్‌నకు మద్దతు పలికారు. దీంతో ట్రంప్‌, నిక్కీ మధ్యే హోరాహోరీ పోరు జరగనుంది. భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్‌ అజిత్‌ సింగ్‌, రాజ్‌ కౌర్‌ రణధావా దంపతులకు 1960లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. 1972లో నిక్కీ జన్మించారు. 1996లో విలియం మైఖేల్‌ హేలీని వివాహమాడగా, వారికి ఇద్దరు పిల్లలు రెనా, నలిన్‌ జన్మించారు. సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా గతంలో నిక్కీ రెండుసార్లు పనిచేశారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో ఆమె అమెరికా రాయబారిగా వ్యవహరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని