Ukraine: ఇక మేము ఆయుధాలివ్వం.. ఉక్రెయిన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పోలాండ్‌..!

ఉక్రెయిన్‌కు మిత్రపక్షాలతో విభేధాలొచ్చాయి. పొరుగు దేశమైన పోలాండ్‌ ఇకపై తాము ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని తేల్చిచెప్పింది. దీనంతటికీ ధాన్యం ఎగుమతులే కారణంగా నిలిచాయి. నల్లసముద్రంలోకి పెద్దగా ఉక్రెయిన్‌ ధాన్యాన్ని రష్యా రానీయకపోవడం పరోక్షంగా ఈ విభేదాలకు కారణమైంది.

Published : 21 Sep 2023 10:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine)కు పొరుగు దేశం పోలాండ్‌ (Poland) దిమ్మతిరిగే షాకిచ్చింది. ధాన్యం వివాదం ముదిరితే.. తాము భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయలేమని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని పోలాండ్‌ ప్రధాని మతౌజ్‌ మోరవియోకి సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఉక్రెయిన్‌ ఓ పక్క రష్యాపై ఎదురుదాడులను మెల్లగా పెంచుతున్న సమయంలో పోలాండ్‌ ప్రకటన దానికి భారీ షాక్‌గా మారింది. 

రష్యా యుద్ధం ప్రకటించిన నాటి నుంచి చాలా దేశాలు భయపడుతున్న సమయంలో కూడా ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా పోలాండ్‌ నిలిచింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడానికి మిగిలున్న అతి తక్కువ మార్గాల్లో పోలాండ్‌ ఒకటి. నాటో నుంచి ఇక్కడికి తరలించిన ఆయుధాలను రైలు, రోడ్డు మార్గాల్లో ఉక్రెయిన్‌కు చేరుస్తున్నారు. దీంతోపాటు పోలాండ్‌ కూడా సొంతంగా కొన్ని ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం దిగుమతులపై ఐరోపా సమాఖ్య నిషేధాన్ని విధించింది. ఎందుకంటే చౌకగా లభించే ఉక్రెయిన్‌ ధాన్యం స్థానిక మార్కెట్లలోకి వస్తే స్థానిక రైతుల ఉపాధి దెబ్బతింటుందనే భయాలు ఈయూ దేశాల్లో ఉన్నాయి. కానీ, గత వారం ఐరోపా సమాఖ్య ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. దీనిని పోలాండ్‌, హంగేరీ, స్లోవేకియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ ధాన్యాన్ని తమ దేశంలోకి రానీయబోమని చెప్పాయి. మరోవైపు ఈ మూడు దేశాలపై ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. అంతేకాదు.. ఈ మూడు దేశాలపై దావాలు కూడా దాఖలయ్యాయి. 

ఆజ్యం పోసిన జెలెన్‌స్కీ వ్యాఖ్యలు..

ధాన్యం వివాదంపై ఐరాసలో జెలెన్‌స్కీ బుధవారం మాట్లాడుతూ ఈ దేశాలను పరుషపదాలతో విమర్శించారు. ఓ దశలో రష్యాకు సాయం చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘రాజకీయంగా సాయం చేస్తున్నట్లు కనిపించినా.. ధాన్యం నుంచి లబ్ధిపొందాలని చూస్తున్నారు. వారు సొంతంగానే తమ పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తున్నా.. మాస్కోలోని వారి కోసం అసలు వేదికను సిద్ధం చేస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

భీకర దాడులకు తెర

జెలెన్‌స్కీ పరుషంగా మాట్లాడటంపై పోలాండ్‌ తక్షణమే స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అంతేకాదు.. ఉక్రెయిన్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. మరోవైపు పొలాండ్‌ ప్రధాని మతౌజ్‌ మోరవియోకి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ‘‘ఉక్రెయిన్‌ ధాన్యం దిగుమతుల కోసం స్థానిక మార్కెట్‌ను అస్థిర పర్చలేను. కానీ, మా రవాణా మార్గాలను ఉపయోగించుకొని ఆ దేశం ఎగుమతులు చేసుకోవడానికి అడ్డం చెప్పం. అలాగని ఆ ఖర్చును మేము భరించబోం. అవసరమైతే వాటి ద్వారా ఆదాయం సంపాదిస్తాం. అంతేకాదు.. మేము ఉక్రెయిన్‌కు ఇక ఆయుధాలు ఇవ్వబోం.. మమ్మల్ని మేము అత్యాధునిక ఆయుధాలతో బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెడతాము’’ అని వివరించారు. దీంతోపాటు ఉక్రెయిన్‌ ఒలిగార్క్‌లు అక్కడి ధాన్యాన్ని పోలిష్‌ మార్కెట్‌, స్థానిక రైతుల పరిస్థితులను పట్టించుకోకుండా తమ దేశంలోకి డంప్‌ చేస్తున్నారని ఆరోపించారు. 

పారిన పుతిన్‌ పాచిక..

నల్లసముద్రం ధాన్యం డీల్‌ను రద్దు చేసుకొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విసిరిన పాచిక పారింది. ఇది ఉక్రెయిన్‌ మిత్రపక్షాల మధ్య బంధం బీటలు వారేట్లు చేసింది. వాస్తవానికి పుతిన్‌కు ఒకప్పటి సోవియట్‌లోని భాగమైన తూర్పు ఐరోపా దేశాల మార్కెట్లపై మంచి అవగాహన ఉంది. దీంతో ఉక్రెయిన్‌ ధాన్యాన్ని నల్లసముద్రం వైపు ఎక్కువగా రానీయకపోతే.. అది భూమార్గంలో పోలాండ్‌ సహా ఇతర దేశాల వైపు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా దేశాల స్థానిక రైతులు గగ్గోలు పెట్టడం మొదలైతే.. అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందన్నది పుతిన్‌ వ్యూహం. తాజా పరిణామాలు మాస్కోకు మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని