Kate Middleton: ‘క్షమించండి.. అది ఎడిటెడ్ ఫొటో’: కేట్‌ మిడిల్టన్‌ ప్రకటన

ఒక ‘ఎడిటెడ్’ ఫ్యామిలీ ఫొటో సృష్టించిన గందరగోళంపై ప్రిన్స్‌ అండ్ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్ కార్యాలయం వివరణ ఇచ్చింది. 

Published : 11 Mar 2024 18:41 IST

లండన్‌: బ్రిటన్‌ (Britain) యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) అనారోగ్యానికి గురైన దగ్గరి నుంచి పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈక్రమంలో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో గందరగోళానికి దారితీసింది. దాంతో ప్రిన్స్‌ అండ్ ప్రిన్సెస్‌ ఆప్‌ వేల్స్ ఎక్స్‌(గతంలో ట్విటర్‌) వేదికగా ఆమె స్పష్టత ఇచ్చారు. ‘‘ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ల వల్ల నేను కూడా ఎడిటింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటాను. నిన్న మేం షేర్ చేసిన ఫొటో వల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని పోస్టు పెట్టారు.

అనారోగ్యం వల్ల కేట్‌ శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. ఆ తర్వాత నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి కన్పించకపోవడంతో అనేక వదంతులు మొదలయ్యాయి. ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ ఆదివారం ఓ ఫొటో విడుదల చేసింది.

సర్జరీ అనంతరం యువరాణి కేట్‌ తొలిపోస్టు.. వదంతులకు చెక్‌

అందులో కేట్‌ తన ముగ్గురు పిల్లలతో కలిసి కన్పించారు. గత రెండు నెలలుగా మద్దతుగా నిలిచినవారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆ ఫొటోను తన భర్త, ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ విలియం తీసినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే రాజ కుటుంబం విడుదల చేసిన ఫొటో ‘ఎడిటెడ్‌’ ఫొటో అయి ఉంటుందని కొన్ని అంతర్జాతీయ మీడియా ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేశాయి. ఫొటోలో కేట్‌ కుమార్తె ఎడమ చేయి సరైన అలైన్‌మెంట్‌లో లేకపోవడంతో అది నిజమైనది కాకపోవచ్చని ఆరోపించాయి. ఆ చిత్రాన్ని తమ వేదికల నుంచి తొలగించాయి. ఇక, కేట్‌ చేతికి ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ లేకపోవడం కూడా ఈ అనుమానాలను మరింత బలపరించింది. ఈ క్రమంలోనే స్పష్టత వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని