USA: అమెరికా క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లో కలకలం.. అగంతకుడి కోసం పోలీసులు తీవ్ర గాలింపు

వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లోకి ఓ అంగతకుడు దూరినట్లు సమాచారం రావడం కలకలం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకొని తీవ్ర గాలింపు చేపట్టారు.  

Updated : 03 Aug 2023 05:43 IST

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లోకి ఆయుధాలు కలిగి ఉన్న ఓ అగంతకుడు ప్రవేశించినట్లు సమాచారం రావడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ సెనేట్‌ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొని ముమ్మరంగా గాలింపు చేపట్టారు. రస్సెల్‌ సెనేట్‌ భవనం, ఇతర సెనెట్‌ భవనాల్లో జల్లెడ పట్టిన తర్వాత సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారణకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటల సమయంలో ఆయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లో సంచరిస్తున్నట్లు 911కి ఫోన్‌ చేసి ఎవరో సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే అక్కడున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరిని బయటకు తీసుకొచ్చారు. ‘‘క్యాపిటల్‌ సెనేట్‌ కార్యాలయాల భవనాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ ప్రాంతం సమీపంలోకి ఎవరూ రావద్దు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీతో సమాచారం పంచుకుంటాం’’ అని క్యాపిటల్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. అనంతరం ముమ్మర గాలింపుల తర్వాత ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని, సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని, భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. భయభ్రాంతులు సృష్టించేందుకు బెదిరింపు ఫోన్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని