Ukraine Crisis: ప్రపంచాన్ని ఏమార్చి.. పుతిన్‌ ‘ప్లాన్‌-బి’..!

ఉక్రెయిన్‌పై దాడి విషయంలో ఎదురుదెబ్బలు తగిలేకొద్దీ రష్యా వ్యూహాలు, లక్ష్యాలు వేగంగా మారుతున్నాయి. మేరియుపోల్‌పై రష్యా నిర్దాక్షిణ్యంగా చేస్తున్న దాడులు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. శరవేగంగా కీవ్‌ను స్వాధీనం చేసుకొని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠాంచాలనే

Updated : 23 Mar 2022 11:25 IST

 మేరియుపోల్‌ అందుకే లక్ష్యం..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌పై దాడి విషయంలో ఎదురుదెబ్బలు తగిలేకొద్దీ రష్యా వ్యూహాలు, లక్ష్యాలు వేగంగా మారుతున్నాయి. మేరియుపోల్‌పై రష్యా నిర్దాక్షిణ్యంగా చేస్తున్న దాడులు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. శరవేగంగా కీవ్‌ను స్వాధీనం చేసుకొని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాలనే మాస్కో వ్యూహం ఫలించలేదు. కీవ్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన రావడం.. భారీగా సైనికులను కోల్పోవడంతో ఇప్పుడు క్రెమ్లిన్‌ మెల్లగా వ్యూహాన్ని మార్చుకొంటోంది. ‘ప్లాన్‌-బి’ను మందుకు తెచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను సుస్థిరం చేసుకోవడంతోపాటు.. అనుసంధానత పెంచుకోవడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల మేరియుపోల్‌ను లొంగిపొమ్మని భారీగా దాడులు మొదలుపెట్టింది.

భారీ ఎదురుదెబ్బలతో వ్యూహాత్మక మార్పులు..

వాస్తవానికి బెలారస్‌ నుంచి కీవ్‌ పదుల కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రష్యా యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకొని ప్రభుత్వాన్ని మార్చేస్తుందని భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు మూడు వారాలుగా భీకర గెరిల్లా యద్ధం  కొనసాగుతోంది. ఇప్పటికే 14,000 మందికి పైగా రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. మరోపక్క తాజాగా రష్యాలోని ప్రభుత్వ అనుకూల వార్తసంస్థ ‘కొమ్సోమోల్క్సాయ ప్రావ్డా’ తన కథనంలో దాదాపు 10వేల మంది మృతి చెందారని పేర్కొని ఆ తర్వాత సమాచారం తొలగించినట్లు ఫోర్బ్స్‌ కథనంలో పేర్కొంది. అమెరికా అంచనాల కంటే రష్యా వార్తా సంస్థ అంచనాలు చాలా ఎక్కువ.  మరోపక్క రష్యా దళాలు ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాలు వాడుకోకుండా అడ్డుకొంటున్నారు. వంతెనలు, విమానాశ్రయాల్లో లెక్కలేనన్ని ల్యాండ్‌మైన్లు పాతిపెట్టారు. రష్యా దళాలు వీటిని వాడుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. యుద్ధం ముగిశాక కూడా వీటిని తొలగించాలంటే కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా. మరోపక్క ఆంక్షలు తీవ్రం కావడంతో మిత్రదేశాలు రష్యాకు దూరంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పుతిన్‌ ప్లాన్‌-బిపై దృష్టిపెట్టినట్లు బైడెన్‌ కార్యకవర్గంలో కీలక అధికారులు వెల్లడించారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.  

ఏమిటీ రెండో వ్యూహం..

ఉక్రెయిన్ల ప్రతిఘటనతో రష్యా వ్యూహంపై పునరాలోచనలో పడింది. తొలుత ఉక్రెయిన్‌ నాటో, యూరోపియన్‌ యూనియన్‌లో చేరకూడదని డిమాండ్‌ చేసిన రష్యా.. తాజాగా వేరే అంశాలపై స్వరం పెంచుతోంది. 2014లో ఆక్రమించుకొన్న  క్రిమియా, డాన్‌బాస్‌లోని ప్రాంతాలపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని కీవ్‌ను డిమాండ్‌ చేస్తోంది. కీవ్‌ దీనికి అంగీకరిస్తే క్రిమియా-డాన్‌బాస్‌ ప్రాంతానికి-రష్యాకు భూ అనుసంధానత లభిస్తుంది. అప్పుడు రష్యా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతమై డాన్‌బాస్‌పై ఆధిపత్యం చేయగలదు.

మరోవైపు ఇతర నగరాలపై సైనిక దాడుల తీవ్రతను వ్యూహాత్మకంగా పెంచుతూ పశ్చిమ దేశాల కూటమిలో చేరే ఆలోచన ఉక్రెయిన్‌ విడిచిపెట్టేలా జెలెన్‌స్కీను ఒప్పించాలన్నది లక్ష్యం. దీంతోపాటు దానిని తటస్థ దేశంగా ఉంచడంతోపాటు రష్యా డిమాండ్లను సాధించవచ్చు. అంటే భూభాగాలను సాధించడంతోపాటు.. భద్రతా పరమైన ఒప్పందాలు కూడా అంగీకరింపజేయడమన్నమాట. 

ఒక వేళ ఉక్రెయిన్‌ ఈ డిమాండ్లకు అంగీకరించకపోతే ఇప్పటికే దళాలు ఆక్రమించుకొన్న భూభాగాలను రష్యా వదిలిపెట్టకుండా నగరాలను ముట్టడించే అవకాశం ఉంది. తరచూ క్షిపణి దాడులు కూడా కొనసాగించవచ్చు. ఒక వేళ రష్యా బలగాలు వేగంగా విజయాలు సాధిస్తుంటే మాత్రం పుతిన్‌ లక్ష్యాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ విషయాలు బైడెన్‌ కార్యవర్గంలోకి కీలక వ్యక్తులకు లభించిన ఇంటెలిజెన్స్‌ అంశాలు వెల్లడిస్తున్నాయి. 

మేరియుపోల్‌పై పాశవిక దాడులు అందుకే..

క్రిమియా నుంచి డాన్‌బాస్‌ ప్రాంతం మీదుగా పశ్చిమ రష్యాను కలిపే భూమార్గంలో మేరియుపోల్‌ పోర్టు సిటీ కీలక మార్గంలో ఉంది. దీనిని ఆధీనంలోకి తీసుకోకుండా వ్యూహాత్మక లక్ష్యాలను సాధించే అవకాశం రష్యాకు లభించదు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకొంటూ రణరంగంలో రష్యా అతిపెద్ద విజయం సాధించినట్లవుతుంది. రష్యా దాడుల తీవ్రతకు మేరియుపోల్‌ నగరం పలు చోట్ల శిథిలాలతో నిండిపోయినట్లు  మాక్సర్‌ టెక్నాలజీస్‌ సంస్థ విడుదల చేసిన పలు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మేరియుపోల్‌పై రష్యా పట్టు సాధిస్తే ఇక అజోవ్‌ సముద్రంతో ఉక్రెయిన్‌కు సంబంధాలు తెగిపోతాయి. దీంతో ఓ  సముద్ర మార్గం పూర్తిగా మూసుకుపోతుంది. అంతేకాదు గతంలో రష్యా మద్దుతుదారులపై దాడులు చేసిన అజోవ్‌ బెటాలియన్‌కు మేరియుపోల్‌ ఓ కీలక స్థావరం.  

అందుకే ఇప్పటి వరకు ఉక్రెయిన్‌తో జరిగిన చర్చలకు తక్కువస్థాయి బృందాలను మాత్రమే రష్యా పంపింది. బేరసారాలకు అవసరమైన భూభాగాలను చేజిక్కించుకొన్నాక.. ఉక్రెయిన్‌ను బలవంతంగా చర్చల వేదికపైకి తెచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పశ్చిమ దేశాల నుంచి మినహాయింపులు పొందడానికి కూడా ఇవి ఉపయగపడతాయన్నది  పుతిన్‌ వ్యూహం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని