రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ పరువునష్టం దావా

ప్రధానాంశాలు

రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ పరువునష్టం దావా

ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి
అసత్య ఆరోపణలను నియంత్రించాలని కోర్టుకు విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిపై ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్‌) సోమవారం సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన ఆయన.. సామాజిక మాధ్యమాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లోనూ, బహిరంగంగానూ బేషరతు క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు. మాదక ద్రవ్యాల కేసు విచారణను తప్పుదోవ పట్టించేలా, అందులో తన పాత్ర ఉందంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలన్నీ పరువు నష్ట చర్యలుగా ప్రకటించాలని కోరారు. ఆ కేసులోని వ్యక్తులను తనకు ముడిపెడుతూ రేవంత్‌రెడ్డితోపాటు అనుచరులు, ఏజెంట్లు, ఆయన తరఫు వ్యక్తులెవరూ అసత్య ఆరోపణలు చేయకుండా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వీడియోలు, ఆడియోలు పెట్టకుండా, టీవీలతోపాటు ఇతర చోట్ల ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్‌ విన్నవించారు. దీనికి సంబంధించి ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలో ఉన్న అసత్య ఆరోపణలను తొలగించేలా ఆదేశించాలన్నారు.

ఈ నెల 16, 17 తేదీల్లో సామాజిక మాధ్యమాలతోపాటు మీడియాలో రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్‌ వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న మాదక ద్రవ్యాల కేసులోని నిందితులతో తనకెలాంటి సంబంధం లేకపోయినా.. అందులోకి లాగాలని దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారన్నారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నానని.. ప్రస్తుతం ఐటీ, పురపాలక శాఖల మంత్రిగా కొనసాగుతున్నానని, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా తనకు పేరు ప్రతిష్ఠలున్నాయని పేర్కొన్నారు. యువతతోపాటు అన్ని వర్గాలవారిలో గుర్తింపు ఉందని చెప్పారు. ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారని, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారన్నారు. ఆ వేదికను దుర్వినియోగం చేస్తూ తప్పుడు ప్రకటనలు, ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కేసు గురించి కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా తన ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో నిందితులు కాని వ్యక్తులకూ దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తోందని.. అయితే, రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో ఈ దర్యాప్తుతో తనకు ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏ దర్యాప్తు సంస్థ నుంచీ తాను నోటీసులు అందుకోలేదన్నారు. క్రిమినల్‌ కేసుల్లో వాస్తవాలు దర్యాప్తులో వెల్లడవుతాయని, దీన్ని రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్ఠను, పరువును దెబ్బతీయడానికి ఉపయోగించుకోరాదని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాదక ద్రవ్యాల వినియోగదారుగా ఆరోపించారని.. గోవా ప్రయాణానికీ ముడిపెట్టారని వివరించారు. తప్పుడు ఆరోపణలతో తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని.. తక్షణం ఇలాంటి వాటిని నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. పరిహారం కోరడానికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని.. దీనిపై కోర్టుకు విజ్ఞప్తి చేస్తామన్నారు. కేటీఆర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిశీలనలో ఉంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని