స్మార్ట్‌ తెలంగాణ!

ప్రధానాంశాలు

స్మార్ట్‌ తెలంగాణ!

సుమారు 40 చోట్ల ఆకర్షణీయ సౌకర్యాలు, పౌరసేవలు 

ఉపాధి, పెట్టుబడుల సమీకరణ

త్వరలో పట్టాల పైకి ప్రాజెక్టు

రాష్ట్ర సర్కారు సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో నలభైకి పైగా నగరాలు, ప్రధాన పట్టణాలను ఆధునిక సాంకేతికతతో ఆకర్షణీయం(స్మార్ట్‌)గా తీర్చిదిద్దాలని, ప్రజలకు డిజిటల్‌ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐటీ, పరిశ్రమల శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అంతర్జాల, ఐటీ ఆధారిత(ఐవోటీ) సేవలు, బ్లాక్‌చైన్‌, రోబోటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమమేధ తదితర వినూత్న సాంకేతికత పరిజ్ఞానంతో ప్రజలకు రక్షితనీరు, విద్యుత్‌, విద్య, వైద్య, గృహనిర్మాణ, పార్కింగు, వ్యర్థాల శుద్ధి తదితర సేవలందించేందుకు వీలుగా ఆయా నగరాల్లో కొత్త ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనుంది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు దీనిని రూపొందించింది. నవీన పరిజ్ఞానంతో నగరాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచి, సేవల ద్వారా నగరాలు, పట్టణాల ర్యాంకులను పెంచి, తద్వారా పెట్టుబడుల సమీకరణ, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టును ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖతో కలిసి ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తుంది. 

పౌరసేవలు

ఎంపిక చేసే నగరాలు, పట్టణాల్లో ఎలక్ట్రానిక్‌ పాలన, పౌరసేవలను పూర్తిగా డిజిటలీకరిస్తారు. మీసేవా కేంద్రాలను పెంచుతారు. ఆధునిక సాంకేతిక విస్తరణకు మౌలిక వసతులను కల్పిస్తారు. టీఫైబర్‌ అందుబాటులోకి వచ్చాక సేవలను విస్తరిస్తారు. విపత్తులు, వ్యాధుల తీవ్రత తదితరాలను పసిగట్టి విపత్తుల నివారణ, పురపాలక, వైద్యఆరోగ్య, పోలీసు తదితర శాఖల పరంగా అప్రమత్తత చర్యలు చేపడతారు. 

ఐటీ ఆధారిత సాంకేతికతతో నగరాలు, ముఖ్యపట్టణాల్లో విద్యుద్దీపాలు, వాటి నియంత్రణ ద్వారా అయ్యే విద్యుత్‌ ఆదాతో మెరుగైన సేవలందుతాయి. ట్రాఫిక్‌ సిగ్నళ్లను అనుసంధానిస్తారు. రద్దీపై సత్వర సమాచారం, టికెట్ల జారీ, బస్సులకు జీపీఎస్‌ పరిజ్ఞానం కల్పిస్తారు. వాయు, శబ్దకాలుష్యాలపై కన్నేసి..నివారణ చర్యలు చేపడతారు. రాష్ట్రానికి వచ్చే దేశవిదేశీ పర్యాటకులకు సందర్శనీయ స్థలాల సమాచారం అందజేస్తారు.

రక్షిత నీరు.. విద్య.. ఆరోగ్య సంరక్షణ

నగరాలు, పట్టణాల్లో నీటిపారుదల, తాగునీటి సరఫరా విధానాల అమలుకు సాంకేతికతను ఉపయోగిస్తారు. నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి, స్థానిక సంస్థలకు సమాచారమిస్తారు. హైదరాబాద్‌లో మాదిరి ఐవోటీ ఆధారిత వ్యర్థాల నిర్వహణను అందుబాటులోకి తెస్తారు. డిజిటల్‌ విద్యావిధానాలను ఉపయోగించి ఐటీ, పరిశ్రమలు, విద్యాశాఖల ద్వారా నవీన బోధన పద్ధతులను చేరువ చేస్తారు. డిజిటల్‌ కన్సల్టింగు, ఆరోగ్య సమాచార నమోదు, పర్యవేక్షణ, ఇంటికే ఔషధాల చేరవేత వంటి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచుతారు.

దశలవారీగా విస్తరణ: జయేశ్‌రంజన్‌, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి

ఆధునికత సామాన్యులకు చేరాలన్నదే సర్కారు సంకల్పం. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే అధునాతన సేవలు అందుతున్నాయి. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు దీనిని విస్తరించాలన్నదే ఆకర్షణీయ నగరాలు, పట్టణాల ప్రాజెక్టు లక్ష్యం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని