ఏపీ పోలీసులది అత్యుత్సాహం

ప్రధానాంశాలు

ఏపీ పోలీసులది అత్యుత్సాహం

జడ్జీలను దూషించినా స్పందించరు

కానీ సీఎం విషయంలో మాత్రం అంత ఉత్సాహం ఎందుకు?

పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం..

పట్టాభికి బెయిలు మంజూరు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు శనివారం నిప్పులు చెరిగింది.‘హైకోర్టు జడ్జిలను దూషించినవారిపై చర్యలు తీసుకునే విషయంలో స్పందించని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే కారణంతో తెదేపా నేత పట్టాభి అరెస్టు విషయంలో అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముంది? గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్నీ కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పట్టాభిరామ్‌ అరెస్టులో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అరెస్టు చేయడానికి పట్టాభి ఇంటికి వెళ్లామని చెబుతూ..మరోవైపు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసిచ్చాం, సహకరించలేదు, అందుకే అరెస్టు చేశామంటూ పరస్పర విరుద్ధంగా దర్యాప్తు అధికారి రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యాసదృశం కాదా?అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా పోలీసుల తీరు ఉంది’ అని హైకోర్టు తప్పుబట్టింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించారా.. లేదా... అనే అంశంపై పోలీసులు, రిమాండుకు పంపిన విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ నివేదికలు దాఖలు చేయాలని ఆదేశించింది. విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన తెదేపా నేత పట్టాభిరామ్‌కు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని