‘దళిత బంధు’పై హైకోర్టు నిర్ణయం వాయిదా

ప్రధానాంశాలు

‘దళిత బంధు’పై హైకోర్టు నిర్ణయం వాయిదా

వేర్వేరు పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకం అమలును కొనసాగించాలంటూ, నిలిపివేయాలంటూ హైకోర్టులో దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్‌లపై సోమవారం వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి నిర్ణయాన్ని వాయిదా వేసింది. దళిత బంధు అమలును నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మల్లేపల్లి లక్ష్మయ్య, బి.జడ్సన్‌లు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీరి తరఫు న్యాయవాదులు వి.రఘునాథ్‌, ఎస్‌.శరత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ దళితుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పథకం అమలును ఉన్నట్టుండి నిలిపివేయడం వెనుక కొన్ని స్వార్థ కారణాలున్నాయని, వీటివెనుక కొందరు వ్యక్తులున్నారని చెప్పారు. ఈసీ నిర్ణయం వల్ల ప్రభుత్వం నుంచి దళితులకు అందాల్సిన రూ.10 లక్షల సాయం ఆగిపోయిందన్నారు. మరోవైపు ప్రతిపక్షాల కారణంగా ఈ పథకం నిలిచిపోయిందని అధికార తెరాస ఆరోపణలు చేస్తోందన్నారు. దళిత యువకులు నిరుద్యోగంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి చేయూతకు ప్రభుత్వం చేపట్టిన పథకం అమలును నిలిపివేయడం సరికాదని చెప్పారు.
అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. ఇందులో భాగంగా దళిత బంధును పైలట్‌ ప్రాజెక్టు కింద యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి ముందే ఇది అమల్లో ఉందని, నిలిపివేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ ఈ పథకాన్ని కేవలం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే నిలిపివేశామని, ఇతర జిల్లాల్లో కొనసాగించవచ్చని విన్నవించారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితం కాకుండా ఉపఎన్నిక పూర్తయ్యేదాకా దళిత బంధు అమలును నిలిపివేయాలంటూ వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ ద పీపుల్‌ సంస్థ తరఫు న్యాయవాది శశికిరణ్‌ కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం దళితుల పురోగతికి ఈ పథకం తోడ్పడుతుందనడంలో సందేహం లేదని, అయితే ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఉందా? లేదా అన్న అంశాన్ని తేల్చాల్సి ఉందని పేర్కొంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని