నిరంకుశ భాజపాను గద్దె దింపుదాం
close

ప్రధానాంశాలు

నిరంకుశ భాజపాను గద్దె దింపుదాం

దేశాన్ని ఆ పార్టీ అంధకారంలోకి నెట్టేసింది
మళ్లీ వెలుగులు నింపేందుకు ఏకమవుదాం
విపక్షాలకు మమత పిలుపు
‘పెగాసస్‌’పై సుప్రీంకోర్టు దర్యాప్తు జరపాలని వినతి

దిల్లీ, కోల్‌కతా: ప్రజాస్వామ్య దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నిరంకుశ భాజపా సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలదళాన్ని గద్దె దింపే దిశగా కృషిచేయాలన్నారు. ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిఘా పెట్టడంతో తాను సహచర సీఎంలతో కూడా మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్‌కు ప్లాస్టర్‌ వేసుకొని.. పెగాసస్‌ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేశారు. తాజా హ్యాకింగ్‌ కలకలంపై దర్యాప్తు జరిపించాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోల్‌కతాలో బుధవారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి మమత ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. భాజపాకు వ్యతిరేకంగా ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, డీఎంకే, అకాలీదళ్‌, ఎన్సీపీ, తెరాస సహా ఇతర పార్టీలకు ఆమె పిలుపునిచ్చారు.

పెగాసస్‌ ఆరోపణల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై దీదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘భారత్‌ను సంక్షేమ రాజ్యంగా తయారుచేయాలని భాజపా కోరుకోవడం లేదు. నిఘా రాజ్యంగా మార్చాలని భావిస్తోంది. మన ఫోన్లన్నీ హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ప్రతిపక్ష నేతలందరికీ ఈ విషయం తెలుసు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం వంటి విపక్ష నాయకులతోగానీ, సహచర ముఖ్యమంత్రులతోగానీ నేను మాట్లాడలేకపోతున్నాను. కేంద్రం మాపై నిఘా పెట్టడమే అందుకు కారణం. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో సర్కారును ఈ నిఘా రక్షించలేదు’’ అని పేర్కొన్నారు.

భాజపాకు ప్లాస్టర్‌ చుట్టేయాలి
‘‘పెగాసస్‌ చాలా ప్రమాదకరమైనది. అభిషేక్‌ బెనర్జీ (మమత మేనల్లుడు), ప్రశాంత్‌ కిషోర్‌ (ఎన్నికల వ్యూహకర్త)లపై కేంద్రం నిఘా పెట్టింది. అందుకే నా ఫోన్‌కు ప్లాస్టర్‌ వేసుకున్నా. ఇదే తరహాలో భాజపా ప్రభుత్వానికీ ప్లాస్టర్‌ చుట్టేయాలి. లేదంటే దేశం నాశనమవుతుంది. సమాఖ్య నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది’’ అని మమత అన్నారు. కెమెరాకు ప్లాస్టర్‌ వేసి ఉన్న తన ఫోన్‌ను చూపించారు. పెగాసస్‌ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా దర్యాప్తు జరిపించాలని దీదీ కోరారు. ‘‘ప్రజాస్వామ్యంలో మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌ చాలా ముఖ్యమైనవి. ఈ మూడింటినీ పెగాసస్‌ ఆక్రమించేసింది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని రక్షించాలని సుప్రీంకోర్టుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. హ్యాకింగ్‌ వ్యవహారాన్ని న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించాలి. దానిపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటుచేయాలి’’ అని అన్నారు. 

పవార్‌ చొరవ తీసుకోవాలి
దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో తాజా ర్యాలీలో పాల్గొన్నందుకు కాంగ్రెస్‌, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, ఆర్జేడీ సహా పలు పార్టీలకు దీదీ కృతజ్ఞతలు తెలిపారు. శరద్‌ పవార్‌ వంటి నేతలు చొరవ తీసుకొని విపక్షాల ఐక్యత కోసం సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. ‘‘భాజపా వ్యతిరేకులంతా ఏకమవ్వాలి. ఆ పార్టీ దేశాన్ని అంధకారంలోకి నెట్టేసింది. మళ్లీ వెలుగులు నింపడానికి మనమంతా ముందుకు రావాలి. నేను వచ్చే వారం దిల్లీలో ఉంటాను. 27, 28, 29 తేదీల్లో ఏదో ఒకరోజు ప్రతిపక్షాల సమావేశాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుంది. మనం సమయాన్ని వృథా చేయకూడదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకో 2.5-3 ఏళ్లే ఉన్నాయి. అధికారంలోకి వస్తే మనం దేశ ప్రజలకు ఉచిత రేషన్‌ అందించవచ్చు’’ అని దీదీ వ్యాఖ్యానించారు.

మళ్లీ ‘ఆట మొదలైంది’
బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉపయోగించిన ‘ఖేలా హోబె (ఆట మొదలైంది)’ అన్న నినాదాన్ని తాజాగా మమత మరోసారి ఉపయోగించారు. భాజపా గద్దె దిగేంతవరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. బెంగాల్‌లో 1993లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. వారికి నివాళిగా తృణమూల్‌ ఏటా జులై 21ని అమరవీరుల దినోత్సవంగా పాటిస్తుంటుంది.

28న అధికారులను ప్రశ్నించనున్న స్థాయీసంఘం!
దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్‌ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ సహా పలు విభాగాలకు చెందిన అధికారులను పార్లమెంటరీ స్థాయీసంఘం త్వరలో ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ వ్యవహారాలకు సంబంధించిన స్థాయీసంఘం ఈ నెల 28న భేటీ అవుతుందని లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో బుధవారం వెల్లడించింది. ‘పౌరుల డేటా భద్రత, గోప్యత’ను సమావేశపు ఎజెండాగా పేర్కొంది. శశిథరూర్‌ నేతృత్వంలోని ఈ కమిటీ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులకు సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. పెగాసస్‌ వ్యవహారంపై అధికారులను ఈ సమావేశంలో స్థాయీసంఘం తప్పకుండా ప్రశ్నించే అవకాశముంది. హ్యాకింగ్‌ కలకలంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని శశిథరూర్‌ ఇటీవల డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ వ్యవహారాలకు సంబంధించిన స్థాయీసంఘంలో మొత్తం 32 మంది సభ్యులు ఉన్నారు. వారిలో అత్యధికులు అధికార భాజపాకు చెందినవారే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని