పెళ్లిలో ఫొటోషూట్ అందంగా ఇలా..! - couple photoshoot ideas in telugu
close
Published : 18/08/2021 19:57 IST

పెళ్లిలో ఫొటోషూట్ అందంగా ఇలా..!

'మేడమ్, కొంచెం నవ్వండి ప్లీజ్..'

'మీరిద్దరూ ఇంకాస్త దగ్గరగా జరగండి.. సర్.. మీరు మేడమ్ భుజాలపై చేతులు తీయకండి..'

'మీరు కదలకండి మేడమ్.. ఫొటో సరిగ్గా రావట్లేదు..'

అబ్బబ్బా.. ఈ గోలంతా ఏంటని అనుకుంటున్నారు కదూ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది కదా.. పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలు ఫొటోల మీద ఫొటోలు దిగడానికి సిద్ధమైపోతుంటారు. ఎందుకంటే పెళ్లిలో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా!! పెళ్లి తంతును కవర్ చేయడం.. వధూవరులిద్దరినీ వేర్వేరు యాంగిల్స్‌లో ఫొటోల్లో బంధించడం.. ఇవన్నీ ఇప్పుడు ఫొటోషూట్ ప్యాకేజీలో భాగమే. ఈ క్రమంలో పెళ్లిలో వధూవరుల ఫొటోలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?

అనువైన ప్రదేశంలోనే..

ఎలాగో పెళ్లి ఆల్బమ్‌లో ఫొటోషాప్ ద్వారా రకరకాల బ్యాక్‌గ్రౌండ్స్ పెడతాం కదా అని పెళ్లిలో ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు క్లిక్‌మనిపించేస్తారు కొందరు ఫొటోగ్రాఫర్లు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీస్తే ఆ ఫొటోకున్న అందం దెబ్బతింటుంది. అలాంటి వాటికి ఫొటోషాప్‌లో ఎంత అందమైన బ్యాక్‌గ్రౌండ్ పెట్టినా ఏదో లోపం కనిపిస్తుంటుంది. కాబట్టి ఫొటోగ్రాఫర్లు ఫొటోషూట్ కోసం ఎంచుకునే ప్రదేశం అటు వాళ్లకు.. ఇటు కొత్త జంటకు నచ్చేలా, సౌకర్యవంతంగా, అనువుగా ఉండేలా చూసుకుంటే ఫొటోలు సహజసిద్ధంగానే అందంగా రావడం ఖాయం. అలాగే మరో ముఖ్యమైన విషయమేంటంటే.. మీరు ఫొటోషూట్ కోసం ఎంచుకునే ప్రదేశంలో మంచి వెలుతురు, గాలి వచ్చేలా జాగ్రత్తపడాలి. లేదంటే చెమటలు పట్టి ఫొటోల్లో అంత బాగా పడకపోవచ్చు.

అతిగా మేకప్ వద్దు!

అసలే మ్యారేజ్ ఫొటోషూట్.. ఫొటోల్లో తెల్లగా కనిపించాలి.. అని ఎక్కువ మేకప్ వేసుకుంటే ఫొటోల్లో ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. అలాగని మరీ సాదాసీదాగా వేసుకోమని కాదు. మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కాకుండా అవసరమైన మేరకే మేకప్ ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఐ-మేకప్‌ను మాత్రం మరువద్దు.. ఎందుకంటే ముఖంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి కళ్లు. కాబట్టి వాటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం చాలా ముఖ్యం.

కంగారు వద్దు..!

కొంతమంది ఫొటోలు దిగేటప్పుడు బాగా వస్తుందో, రాదోనని తెగ కంగారు పడిపోతారు. ఈ కంగారే కొంప ముంచుతుంది. దీనివల్ల మీరు టెన్షన్ పడుతున్నట్లుగా ఫొటోలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే ఫొటోలకు ఇచ్చే పోజులు కూడా సహజంగా అనిపించవు. దీంతో మీరు ఎంత బాగా రడీ అయి ఫొటోకు పోజిచ్చినా వృథానే అవుతుంది. కాబట్టి ఫొటోలకు పోజిచ్చేటప్పుడు చాలా కూల్‌గా ఉండాలి. అలాగే వేడుక ఆద్యంతం నవ్వుతూ ఉండడం వల్ల ఫొటోలు మరింత సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది.

అనుభవం చాలా ముఖ్యం..

అందరు ఫొటోగ్రాఫర్లకూ పెళ్లికి సంబంధించిన ఫొటోషూట్‌లో అనుభవం ఉంటుందనుకుంటే పొరపాటే. అందుకే పెళ్లి ఫొటోలు తీయడానికి బంధువులు లేదా స్నేహితులకు తెలిసిన మంచి అనుభవం ఉన్న ఫొటోగ్రాఫర్లను ఎంచుకోవాలి. వీలుంటే అంతకుముందు వారు తీసిన ఫొటోలను కూడా ఒకసారి పరిశీలించి.. అవి మీకు బాగా నచ్చితేనే ఫొటోషూట్ కోసం వాళ్లను ఎంపిక చేసుకోండి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అదే ఫొటోగ్రాఫర్స్ కొత్తవాళ్లయితే.. మంచి గిరాకీ వచ్చిందని వాళ్ల అనుభవం గురించి తప్పుగా చెప్పి మనల్ని మోసగించే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మసలుకోవడం మంచిది.

నమ్మకం ఉంచాలి..

మీరు ఫొటోషూట్ కోసం ఎంచుకున్న ఫొటోగ్రాఫర్‌పై పూర్తి విశ్వాసం ఉంచాలి. అలాకాకుండా 'ఫొటోగ్రాఫర్ అనుభవం చూసిన తర్వాత కూడా బాగా తీస్తారో? తీయరో? ఫొటోలు బాగా వస్తాయో? రావో?' ఇలాంటి సందేహాలు చాలామందిలో తలెత్తుతుంటాయి. అలా ఏదో ఆలోచిస్తూ, సందేహిస్తూ ఫొటోలకు పోజులిస్తే ఎంత అనుభవజ్ఞులైన ఫొటోగ్రాఫర్స్ ఫొటో తీసినా అందులో లుక్ ఉండదు. కాబట్టి ఫొటోగ్రాఫర్‌పై పూర్తి నమ్మకంతో, తను ఫొటోలు బాగా తీయగలడనే విశ్వాసంతో ఉంటేనే ఫొటోషూట్ అనుకున్నట్లుగా జరుగుతుంది. మంచి స్టిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది.

వాళ్లకే తెలుసు..!

పెళ్లిలో జరిగే ఫొటోషూట్‌లో భార్యాభర్తలిద్దరూ ఏయే యాంగిల్స్‌లో ఫొటోలు దిగితే బాగా వస్తాయో.. మీకంటే ఫొటోగ్రాఫర్లకే ఎక్కువగా తెలిసుంటుంది. ఎందుకంటే చాలా పెళ్లిళ్లలో ఫొటోలు తీసిన అనుభవం వాళ్లకుంటుంది. దీంతోపాటు మీ ముఖంలో ఉండే లోపాలను సవరించి ఫొటో వంద శాతం బాగా వచ్చేందుకే వాళ్లు ప్రయత్నిస్తారు. ఎందుకంటే పెళ్లి, పెళ్లి ఫొటోలు జీవితంలో మిగిలిపోయే మధుర జ్ఞాపకాలు. అలాగే ఈ తంతు వల్ల భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఫొటోలు తీసేటప్పుడు ఫొటోగ్రాఫర్లకు 'ఈ యాంగిల్స్ వద్దు.. ఇలా బాగోలేదు..' అంటూ ఎదురుచెప్పకుండా వాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వండి.. మీరు కూడా ఫ్రీగా ఉండి.. సహజంగా పోజులివ్వండి.

ఈ రోజుల్లో ప్రత్యేకంగా వెడ్డింగ్ ఫొటోషూట్స్ చేసే ఫొటోగ్రాఫర్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిలో బాగా నైపుణ్యం ఉన్నవారిని ఎంచుకుంటే పెళ్లి ఫొటోలు మరింత అందంగా వచ్చే అవకాశం ఉంటుంది.. కాబట్టి మీ తాహతును బట్టి అలాంటి నిపుణులను ఎంచుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

అన్నిటికన్నా మించి - ఈ కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ సాధ్యమైనంత సింపుల్‌గా పెళ్లి తంతు ముగించడం మాత్రం అత్యంత ముఖ్యమని మరవకండి!



మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని