మూలకణాలతో మేలు చేస్తాం!
close
Published : 06/05/2021 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూలకణాలతో మేలు చేస్తాం!

మానవాళికి మేలు చేసే పరిశోధనలు చేసి... ఒక శాస్త్రవేత్తగా మాత్రమే మిగిలిపోవాలనుకోలేదామె! ఆ పరిశోధనల ఫలితాలని ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు... ఎన్నో సవాళ్లని ఎదుర్కొని మూలకణ ఆధారిత ఔషధాల తయారీ మొదలు పెట్టారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ ద్రావిడ సుభద్ర. ఆమె ముందుచూపే నేడు కొవిడ్‌పై పోరాటంలో ఓ వెలుగురేఖగా మారింది..
నా శాస్త్రీయ పరిజ్ఞానం నాతోనే ఆగిపోకుండా.. సరికొత్త ఆవిష్కరణలుగా మారి ప్రజలకు చేరువకావాలనేది నా లక్ష్యం. అందుకే అమెరికాలో శాస్త్రవేత్తగా కెరీర్‌ని మొదలుపెట్టిన నేను తిరిగి మన దేశానికే వచ్చి సేవలు అందించగలుగుతున్నా. నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో అయినా చదువు మాత్రం వేర్వేరుచోట్ల సాగింది. మా నాన్న ద్రావిడ కృష్ణమోహన్‌ న్యాయవాది. తిరుపతి, చెన్నై, హైదరాబాద్‌లలో చదువుకున్నాను. అమ్మ వాణి. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో డిగ్రీ చేశాక కెనడాలో పీహెచ్‌డీ చేశాను. ఆ తర్వాత అమెరికాలోని నార్త్‌కరోలినా విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశాను. సెల్‌ టెక్నాలజీకి సంబంధించి నా ఆవిష్కరణలకు అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి 27 పేటెంట్లు దక్కాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా, స్వదేశానికి తిరిగి వచ్చి బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేసి ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులు తీసుకురావాలని మనసులో బలంగా ఉండేది. అందుకే 15 ఏళ్ల కిందట భారత్‌కు తిరిగి వచ్చేశా. కణజాల ఇంజినీరింగ్‌లో పరిశోధనలు ప్రారంభించా. ప్రపంచ వ్యాప్తంగా కణాధారిత చికిత్స విధానాలు చాలా తక్కువ. అందుకే 2015లో ట్రాన్స్‌సెల్‌ బయోలాజిక్స్‌ను సొంతంగా ప్రారంభించాను.
జీవ, కణజాల రంగంలో సంస్థను పెట్టాలనుకోవడం సులువే అనిపించినా పెట్టుబడులు తీసుకురావడం చాలా కష్టమైంది. అందుకే నేను సంపాదించిందంతా ఇందులో పెట్టుబడిగా పెట్టాను. ఆదాయం కోసం కాకుండా పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చి బయోబ్యాంకును ఏర్పాటు చేశాను. దీనిపై వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని కూడా తిరిగి పరిశోధనల కోసమే వెచ్చించేదాన్ని. అలా ఎన్నో సవాళ్లని, ఒడుదొడుకులని తట్టుకుని ఔషధాల తయారీపై దృష్టి పెట్టాను. తర్వాత మా సంస్థ ఉద్దేశాలు, నిర్వహణ చూసి  కొందరు పెట్టుబడిదారులు వచ్చారు. వారి మద్దతుతో సంస్థని మూడు భాగాలుగా విభజించాను. ఇందులో మొదటి రెండూ మూలకణాల బ్యాంకులు. మూడో విభాగం.. క్యాన్సర్‌ నియంత్రణలో వాడే కణాధారిత ఉత్పత్తులని తయారుచేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, ముంబయి, పుణె, పంజాబ్‌ ప్రాంతాల్లోని ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్నాం. ఈ ఉత్పత్తుల్లో ఒకదాన్ని తగిన మార్పులు చేసి కొవిడ్‌ రోగుల కోసం వాడుతున్నాం. ఊపిరితిత్తులు దెబ్బతిని వెంటిలేటర్‌పై ఉన్న వారిని బతికించేందుకు ఇవి మెరుగ్గా ఉపయోగపడుతున్నాయి. బొడ్డుతాడు నుంచి తీసి ప్రాసెస్‌ చేసిన ఈ మూలకణాలను నేరుగా రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టి చికిత్స చేస్తాం. అవి వైరస్‌ తీవ్రతను తగ్గించి ఊపిరితిత్తులను పుంజుకునేలా చేస్తాయి. ఈ విధానంలో దుష్ప్రభావాలు ఉండవని నిరూపితమైంది. ఇతర అవయవాలపైనా ఎలాంటి ప్రభావమూ ఉండదు. ప్రస్తుతం కొవిడ్‌-19 మహమ్మారితో ప్రజలు పడుతున్న బాధలు తీర్చడానికి సరైన సమయంలో ఈ చికిత్స విధానం తీసుకురావడం నాకు సంతృప్తినిస్తోంది.

భవిష్యత్‌ లక్ష్యాలు...
మా ట్రాన్స్‌సెల్‌ ఆంకోలాజిక్స్‌ తరఫున క్యాన్సర్స్‌ కోసం మరిన్ని కొత్త ఔషధాలు, చికిత్స విధానాలు అభివృద్ధి చేస్తున్నాం. వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కొత్త సాంకేతికను తీసుకువస్తున్నాం. వ్యాక్సిన్ల భద్రత పరంగా ఇది కీలకంగా మారుతుంది. దీన్ని త్వరలోనే విడుదల చేస్తాం. దీని ద్వారా కొవిడ్‌-19 వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పరీక్షించే వీలుంటుంది.
* సంస్థ నిర్వహణలో పెట్టుబడి మొదలుకుని, ఎన్నో రకాల సమస్యలు ఎదురయ్యాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా నా లక్ష్యం, గమ్యం ఏంటనేది నాకు స్పష్టంగా తెలుసు. అందుకే సమస్యలొచ్చాయని నిరాశపడి ఆగిపోకుండా చిక్కుముళ్లను విప్పుకుంటూ ముందుకు సాగుతుంటాను.
* మహిళలకు ఓర్పు, లోతైన ఆలోచన శక్తి ఉంటాయి. అందువల్ల తగిన అర్హత, అనుభవం సాధించి ఈ రంగంలోకి వస్తే మంచి అవకాశాలు ఉంటాయి.మహిళల ప్రాతినిధ్యం లేని, స్త్రీల దృష్టికోణం లేని రాజకీయ పోరాటం ఏదైనా సరే, అసలు పోరాటమే కాదు

- అరుంధతీ రాయ్‌, రచయిత్రి


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని