కరోనాకు కన్నతల్లికి పోరాటం
close
Published : 02/04/2020 00:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు కన్నతల్లికి పోరాటం

‘నాన్నా..! అమ్మ ఎప్పుడొస్తుంది?’ రెండేళ్ల జియా బో ఏడుపు. ‘అమ్మమ్మా...! అమ్మ కావాలి.’ జియా బో మంకుపట్టు. గుమ్మం ముందు చప్పుడైతే పరిగెడుతున్నాడు. ఫోన్‌ రింగైతే అమ్మేనని కళ్లు పెద్దవి చూసి చూస్తున్నాడు. కాదనీ తెలిసి... గుండెలు పగిలేలా మొత్తుకుంటున్నాడు. అమ్మ లేదని.. రాదని చెప్పలేక...బిడ్డను ఓదార్చలేక వారిద్దరూ పడుతున్న కష్టం పగవారికి కూడా రాకూడదు. ఇంతకీ జియా బో అమ్మకి ఏమైంది? వూహాన్‌ నగరంలో కరోనాతో జరిగిన పోరాటంలో వైద్యురాలైన ఆ తల్లి ఓడిపోయింది.
మనసున్న వైద్యులను దేవుళ్లగా భావిస్తారు రోగులు. రోగులకు మంచి సేవలందిస్తూ డాక్టర్‌ గ్జియా సీసీ మనసున్న డాక్టరమ్మగా పేరు తెచ్చుకుంది. గాస్ట్రోఎంటరాలజిస్టుగా చదువు పూర్తి చేసి, 2015లో వూహాన్‌లోని యూనియన్‌ జియాంగ్‌బీ హాస్పిటల్‌లో వైద్యురాలిగా విధుల్లో చేరింది. తన సేవలతో కొద్దికాలంలోనే రోగులకు అత్యంత ఇష్టమైన ‘లిటిల్‌ సీసీ’గా పేరు పొందింది. డాక్టర్‌ వూషెలీని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆ దంపతులకు 2018లో పండంటి బిడ్డ జియాబో పుట్టాడు.
అనుకోకుండా ఒక రోజు
గతేడాది చివర్లో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య పెరిగిపోయింది. డాక్టర్‌ గ్జియా వారం నుంచి నిరంతరాయంగా విధులు నిర్వహిస్తోంది. జనవరి 14వ తేదీ రాత్రి ఇంటికి వెళ్లాలనుకుంది. బిడ్డను చూసి, కాస్త విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం తిరిగి విధుల్లోకి వద్దామనుకుంది. ఇంతలో 76ఏళ్ల వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో అదే విభాగంలో చేరాడు. కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం కలగడంతో ఆ వ్యక్తికి వైద్యసేవలు అందించే బాధ్యతను గ్జియాకు అప్పగించారు. వెంటిలేటర్‌పై ఉంచినా ఫలితం లేకపోయింది. అతడు చనిపోయాడు. ఆ వ్యక్తి బతకలేదనే ఆవేదనతో ఉన్న గ్జియాకు అలసటగా అనిపించింది. రెండు గంటలపాటు అలా కునుకు తీసింది. లేచేసరికి జ్వరంతో ఒళ్లు కాలిపోతోంది. ఆమెకూ కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు.

వైరస్‌తో పోరాటం
అప్పటికే తన ఊపిరితిత్తులపై కరోన వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఆసుపత్రిలో ఖాళీ లేకపోవడంతో 18 మైళ్ల దూరంలో ఉన్న మరో ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీలో ఉంచిన గ్జియాకు ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడింది. ‘‘నేను రాకపోయినా, కొడుకు జియాబోను నువ్వే చూసుకోవాలి, వాడికి ఏ కష్టం రాకుండా కాపాడాలి’ అని తల్లితో ఫోన్‌లోనే ఒట్టు వేయించుకుంది. తన పరిస్థితి బిడ్డకు తెలియనివ్వొద్దని భర్త దగ్గర మాట తీసుకుంది. ఆసుపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో తాను రాలేకపోతున్నట్లు కొడుక్కి ఫోన్‌లో చెప్పింది. ‘అమ్మా నువ్వు ఇంటికి రా...’ అని కొడుకు ఏడుస్తుంటే తన గుండె కన్నీరై కరిగిపోయింది.
కొడుకును చూడొచ్చని..!
11రోజుల పాటు కరోనాతో పోరాటం చేసిన ఆమె కొంచెం కోలుకుంది. ఇక కొడుకును చూడొచ్చు అనుకుంది. వెంటిలేటర్‌ను సైతం తొలగించడంతో ఆమె భర్త వూ షిలీ ఆనందానికి హద్దుల్లేవు. 7వతేదీన మళ్లీ గ్జియా పరిస్థితి విషమించింది. అతడు చేరుకునేలోపే గ్జియా గుండె ఆగిపోయినంత పనైంది. కన్నబిడ్డను చూడాలని తపిస్తున్న గుండె అది.. అంత త్వరగా ఎందుకు ఆగిపోతుంది? ప్రత్యేక నిపుణులు చికిత్సలు అందించడంతో గుండె, ఊపిరితిత్తులు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. ఇంతలో కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. 16రోజుల పాటు కోమాలోనే ఉండిపోయింది. మాతృత్వానికి, కరోనాకు జరిగిన ఈ పోరాటంలో గ్జియా ఓడిపోయింది. బిడ్డను చూడకుండానే ఆమె కన్నుమూసింది. అమ్మ కోసం గుమ్మం ముందు కూర్చొని ఎదురుచూస్తున్న బిడ్డకు ఏం చెప్పాలో తెలియక వూ షిలీ అచేతనంగా ఉండిపోయాడు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని