ఆగిన చదువుకు ఆమె సాయం!
close
Published : 12/03/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగిన చదువుకు ఆమె సాయం!

హైదరాబాద్‌లో ఉండే స్వరూప దంపతులు రాళ్లుకొట్టే పని చేసుకొని  బతుకుతున్నారు... చదివించే స్థోమత లేక పదో తరగతి తర్వాత కొడుకుని తమతో కూలిపనికి తీసుకెళ్లాలనుకున్నారు... బాగా చదివే ఆ కుర్రాడు కూలీపనికి వెళ్లడం అతని క్లాస్‌ టీచర్‌కి నచ్చలేదు. అందుకే ఆ పేద దంపతులని సెవెన్‌ రేస్‌ ఫౌండేషన్‌ని నిర్వహించే సారా దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చిందామె. ఇప్పుడా కుర్రాడు  శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ బైపీసీ చదువుతున్నాడు.....

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన సారా ఐటీ ఉద్యోగిని. ఉద్యోగంతో పాటూ... ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తున్నారామె. మొదట్లో చిన్నగా ప్రారంభించి... తర్వాత నగరమంతటా తన సేవల్ని విస్తరించింది.  ప్రధానంగా హైదరాబాద్‌లోని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఉండే వారి అవసరాలపై దృష్టి పెట్టింది. లాక్‌డౌన్‌ సమయంలో అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు ఇల్లిల్లూ తిరిగిన సారాను ఎక్కువగా కలిచివేసిన విషయం పేదపిల్లల చదువు. కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతోమంది తల్లిదండ్రులకి పిల్లల చదువులు భారమయ్యాయి. దాంతో చాలామంది పిల్లలు చదువుకి మధ్యలోనే దూరమవడం స్వయంగా చూసింది సారా. అలాంటి పిల్లల బాధ్యతని తాను తీసుకుని వాళ్లని మంచి కాలేజీల్లో చదివించాలనుకుంది. అలా సుమారు పాతికమంది పిల్లలకు ఆర్థిక సాయం అందించి... వాళ్లని నారాయణ, శ్రీచైతన్య, గీతం, వెస్లీ వంటి కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్పించి వాళ్ల ఫీజులని తనే కడుతోంది. అందులో చాలామంది ఇళ్లలో పనిచేసుకుని పొట్టపోసుకునే వాళ్ల పిల్లలే. సారా చేసిన ఆర్థిక సాయం వల్ల ఈ రోజు వారంతా ఇంజినీరింగ్‌, ఫార్మా వంటి ఉన్నత కోర్సులు చదువుతున్నారు. ‘చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలని గొప్ప చదువులు చదివించాలని... మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే చూడాలనే కోరిక బలంగానే ఉంది. కానీ కూలీనాలీ చేసుకునేవారికి ఇదేం చిన్న భారం కాదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, డ్రాపవుట్లు, తండాల్లో ఉండే చిన్నారులు, ఒంటరి తల్లుల దగ్గర పెరుగుతున్న పిల్లలకు అండగా ఉండాలని అనుకున్నా. కేవలం కార్పొరేట్‌ కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి ఊరుకోవడం కాకుండా... వాళ్లలో ఆసక్తి ఉండి  పోటీ పరీక్షలకు వెళ్లాలనుకునేవారికి సైతం ఫీజులు చెల్లించాలనుకుంటున్నా. దాతలు, సామాజిక మాధ్యమాలు, ప్రముఖుల సహకారంతో ఈ యజ్ఞం నిర్విరామంగా సాగుతోంది’ అనే సారా తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రెండు తండాలను దత్తత తీసుకొని అక్కడి పిల్లల చదువు, మహిళల ఉపాధి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.

-పత్తిపాక ప్రవీణ్‌కుమార్‌, ఈటీవీ


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని