పుట్టిన వెంటనే పాతేశారు
close
Published : 18/03/2021 00:39 IST

పుట్టిన వెంటనే పాతేశారు

రాజస్థాన్‌లోని కల్‌బేలియా సంచారజాతి, వారి ప్రత్యేకమైన నాట్యం గురించి ఈ రోజు ప్రపంచానికి తెలియడానికి కారణం.. గులాబో.  ఆడపిల్ల పుట్టిందని బతికుండగానే గొయ్యితీసి కప్పెట్టేసినా... బయటపడిన గట్టిపిండం గులాబో. పద్మశ్రీ అవార్డుని అందుకున్న ఈ కళాకారిణి వెనుక కన్నీళ్లు పెట్టించే కథ ఉంది...

ల్‌బేలియా లేదా సపేరా అనేది రాజస్థాన్‌లోని సంచార జాతులు పాముల్ని ఆడిస్తూ చేసే ఒకరకమైన నాట్యం. వీరి స్వస్థలం అజ్మీర్‌లోని కోటా గ్రామం. ధన్వంతి తండ్రి  ఊరూరూ తిరుగుతూ పాములు ఆడించేవాడు. అతని ఇంట్లో ఏడో సంతానంగా పుట్టిందామె. అప్పటికే ఆ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా...వారందరినీ అమ్మవారి స్వరూపంగా భావించేవాడతను. కానీ ఆడపిల్లని భారంగా భావించిన ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం ఇది నచ్చేది కాదు. ఓ రోజు తల్లికి చెప్పకుండా తండ్రి లేని సమయం చూసి ధన్వంతిని ఊరి చివర శ్మశానంలో కప్పెట్టేశారు. ఏడుగంటల తర్వాత విషయం తెలిసి పాప కోసం పరుగెత్తుకెళ్లిందా తల్లి. అక్కడ పసిబిడ్డ ఏడుపు వినిపించే సరికి...ప్రాణం లేచొచ్చిందామెకు. చావు    నోట్లోంచి బయటపడిన పాపను ఆ రోజు నుంచి క్షణం కూడా వదల్లేదా తండ్రి. పాముల బుట్టని ఒకవైపు.. బిడ్డను ఉంచిన బుట్ట మరోవైపు వేసుకుని ఊరారా తిరిగేవాడతను.
ఏడాది వయసున్నప్పుడు మళ్లీ ఓసారి ధన్వంతి ప్రాణాలమీదకు వచ్చింది. డాక్టర్లయితే ఇక ఈ పాప కోలుకోవడం కష్టమేనని చెప్పి ఆమె దగ్గర ఒక గులాబీని ఉంచారు.  అదృష్టవశాత్తు తను తిరిగి కోలుకుంది. అప్పట్నుంచి పాపని తండ్రి… గులాబో అని పిలిచేవాడు. ఊహ తెలిసినప్పటి నుంచీ పాములతోనే గులాబో సావాసం చేసేది. అందుకేనేమో ఆమె చేసే కల్‌బేలియా నృత్యంలో జీవం తొణికిసలాడుతుంది. ‘మూడో ఏట నుంచే నాన్నతో వెళ్లి ఆయన ఆడించే పాములతో పాటూ నేను కూడా డ్యాన్స్‌ చేసేదాన్ని. మా ఊరి జాతరలో నృత్యం చేస్తున్న నన్ను పర్యాటకశాఖాధికారులు చూశాక నా జీవితం మలుపు తిరిగింది. రోడ్డు కూడళ్లలో డ్యాన్స్‌ చేసే నేను మొదటిసారి ఓ వేదికపై చేశా. ప్రేక్షకుల చప్పట్లతో నా చెవులు చిల్లులుపడ్డాయి. తర్వాత ఎన్నో టీవీ షోల్లో పాల్గొన్నా. మరోవైపు విదేశాల నుంచీ పిలుపు వచ్చింది. నాన్న కోరుకున్నది అదే. కానీ 17 ఏళ్ల వయసులో నేను అమెరికా వెళ్లి రావడం నాన్న చూడలేకపోయాడు. నాట్యం నా పేదరికాన్ని చెరిపేసింది. రోడ్డు పక్కన ఉన్న మా గుడిసె డాబా అయ్యింది. పాములోళ్ల పిల్లకు అందుతున్న ఈ గౌరవాన్ని చూసి మా వూరి జనం కూడా మారారు. ఏదో శాపం తగిలితేనే ఆడపిల్ల పుడుతుంది అనుకునే వాళ్లు కాస్తా తమ ఆడపిల్లలు కూడా నాలా పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని ఆలోచించడం మొదలుపెట్టారు’ అనే గులాబో ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ సహా ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో తన డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లను ప్రారంభించింది. నాలుగేళ్లక్రితం పద్మశ్రీ అవార్డునీ అందుకున్నారు. కరోనా సమయంలో ఎంతోమంది నిరుపేదలు, కళాకారుల ఆన్‌లైన్‌లో డాన్స్‌ క్లాసులు చెబుతూ.. ఆ వచ్చిన నగదును అందించింది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి