మెల్లగా కరగనీ.. రెండు మనసుల దూరం! - these signs show your relationship needs a detox in telugu
close
Updated : 31/08/2021 18:38 IST

మెల్లగా కరగనీ.. రెండు మనసుల దూరం!

దాంపత్య బంధం శాశ్వతమైనది. ఎంత అన్యోన్యంగా ఉన్నా అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు, తగాదాలు వస్తుంటాయి. అలాగని అవి మితిమీరినా నిర్లక్ష్యం తగదంటున్నారు నిపుణులు. అలాంటప్పుడే అనుబంధాన్ని ఓసారి డీటాక్స్‌ చేయమంటున్నారు. అయితే ఈ ఒక్క విషయంలోనే అని కాదు.. మరికొన్ని అంశాల్లోనూ భార్యాభర్తలు తమ మధ్య ఉన్న ప్రతికూలతల్ని తొలగించుకోవడం అవసరమంటున్నారు. మరి, ఇంతకీ ఏంటీ రిలేషన్‌షిప్‌ డీటాక్స్‌? అది ఎప్పుడు అవసరం? తెలుసుకుందాం రండి..

డీటాక్స్‌ అంటే మన శరీరంలోని మలినాల్ని తొలగించుకోవడం. మరి, రిలేషన్‌షిప్‌ డీటాక్స్‌ అంటే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతికూలతల్ని తొలగించుకొని ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేయడమన్న మాట! అయితే ఆలుమగలిద్దరూ ఇది ఎప్పుడు అవసరమో తెలుసుకొని తమ బంధాన్ని డీటాక్స్‌ చేసుకోగలిగితే.. దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసుకోవచ్చని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

ఔనన్నా కాదన్నా గొడవేనా?!

ఆలుమగల మధ్య గొడవలు అప్పుడప్పుడూ జరగడం సహజమే అయినా.. కొంతమంది మాత్రం చీటికీ మాటికీ మాటా మాటా అనుకుంటుంటారు. ఇలా జరుగుతోందంటే ఇద్దరూ ఒకరి విషయంలో మరొకరు ఏదో అసంతృప్తితో ఉన్నారని అర్థం చేసుకోమంటున్నారు నిపుణులు. అదేంటో కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోమంటున్నారు. నిజంగానే అది అనవసర విషయమైతే మీ మధ్య నుంచి తొలగించడం మంచిది. మరి, అలాకాకుండా ఒకరితో ఒకరు సరైన సమయం గడపలేకపోవడం వల్లే ఇలా జరుగుతోందనుకుంటే మాత్రం.. ఇద్దరికీ నచ్చిన పని/ఆటను ఎంచుకొని.. కాసేపు సేదదీరండి. ఇలా ఈ విలువైన సమయం భార్యాభర్తలిద్దరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.. వారి అనుబంధాన్నీ దృఢం చేస్తుంది.

సహాయపడితే పోలా?!

భర్త ఇంటి పనుల్లో సహాయపడట్లేదన్న వెలితి భార్యలో, పిల్లల ధ్యాసలో పడిపోయి తన భార్య తననేమీ పట్టించుకోవట్లేదన్న అసంతృప్తి భర్తలో ఉండడం సహజమే! కొన్ని సందర్భాల్లో ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. మరి, అలా జరగకూడదంటే ఎదుటివారి అసంతృప్తికి కారణమేంటో తెలుసుకొని.. వారిని సంతృప్తి పరిచే/వారికి సహాయం చేసే మార్గాలను అన్వేషించమంటున్నారు. అయితే అదంత పెద్ద కష్టమేమీ కాదు.. రోజువారీ ఇంటి పనుల్లో భర్త భార్యకు కాస్త చేదోడువాదోడుగా ఉండడం, భార్య కూడా పిల్లలతో సమానంగా భర్తకూ సమయం కేటాయించడం.. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది.

ఆ ఫీలింగే రాకూడదు!

పెళ్లైన కొత్తలో ఉన్నంత అన్యోన్యత, దగ్గరితనం రోజులు గడిచే కొద్దీ ఉండదంటుంటారు చాలామంది దంపతులు. ఈ క్రమంలో ‘అబ్బ.. ఈ రిలేషన్‌షిప్‌ బోరింగ్‌గా ఉంది!’ అనుకునే వారూ లేకపోలేదు. మరి, దీన్నిలాగే వదిలేస్తే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే ఆ ఫీలింగ్‌ రాకుండా వైవాహిక బంధాన్ని నిత్యనూతనం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో పడకగదితో సంబంధం లేకుండా కాస్త ప్రైవేట్‌ స్పేస్‌ని ఏర్పాటుచేసుకోవాలి. దాన్ని మీ అభిరుచులు, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజూ ఓ అరగంట పాటు అక్కడ కూర్చొని ఇద్దరూ ఊసులాడుకోవాలి.. ఇదొక్కటనే కాదు.. నచ్చిన ఆటలాడుకోవడం, రొమాంటిక్‌గా పాటలు పాడుకోవడం.. ఇలా మీకు నచ్చినట్లుగా ఉండచ్చు. ఎప్పుడూ ఇంట్లోనే ఉన్నా కొన్నాళ్లకు బోర్‌ ఫీలింగ్‌ రావచ్చు. కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా టూర్స్‌, బయట డిన్నర్‌, డేట్‌కి వెళ్లడం.. ఇలా ఆలోచిస్తే దంపతుల అన్యోన్యతను కొత్త పుంతలు తొక్కించే ఐడియాలకు కొదవే లేదని చెప్పచ్చు.

‘సుదీర్ఘ’ ప్రయాణం చేయాలంటే..!

భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు.. ఎవరికి వారుగా కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో- దాపరికం, నీకెందుకు చెప్పాలన్న నిర్లక్ష్యం ఉన్నట్లయితే ఒక దశలో ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఇద్దరి మనసుల్లో ఆ ఆలోచన రాకముందే జాగ్రత్తపడమంటున్నారు. ముఖ్యంగా డబ్బు విషయంలో దంపతుల మధ్య అస్సలు దాపరికాలుండద్దు.. ఎవరెక్కడ పొదుపు చేస్తున్నారు? ఇంకా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలనుకుంటున్నారు.. అనే విషయాలను ఒకరికొకరు పంచుకోవాలి. అలాగే ఆర్థిక అంశాల్లో ఇద్దరూ కలిసి ఓ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలోనూ తప్పు లేదంటున్నారు. ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తు కోసం కలిసి పొదుపు చేయచ్చు.. లేదంటే ఇద్దరూ కలిసి సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకోవచ్చు.. నిజానికి ఇలాంటి సుదీర్ఘ లక్ష్యాలే మిమ్మల్ని కడదాకా కలిపి ఉంచుతాయంటున్నారు నిపుణులు.

ఎవరికి వారుగా.. కలిసికట్టుగా..!

భార్యాభర్తలిద్దరూ తమ అనుబంధాన్ని డీటాక్స్‌ చేసుకోవడంలో భాగంగా కలిసి చేయాల్సిన పనులే కాదు.. విడివిడిగా చేయాల్సినవీ కొన్నున్నాయి. అందులో అన్నింటికంటే ముఖ్యమైనది స్వీయ ప్రేమ. ఇలా ఎవరిని వారు ప్రేమించుకోవడం వల్ల కలిగే సంతోషం ఎదుటివారిలోనూ మంచిని, పాజిటివిటీనే చూడగలుగుతుంది. ఫలితంగా ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్ఛాలు దొర్లకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇందుకోసం మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవడం, మీకు నచ్చినట్లుగా తయారవడం, స్నేహితులతో సరదాగా గడపడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లడం.. వంటివి చేయచ్చు. ఈ క్రమంలో మీకు సొంతమైన అనుభవాలు, అనుభూతుల్ని మీ భాగస్వామితోనూ పంచుకోవచ్చు.. ఇలా కూడా ఇద్దరూ కలిసి సమయం గడపడానికి కాస్త వీలు చిక్కుతుంది.

మరి, మీ దాంపత్య బంధంలోని ప్రతికూలతల్ని దూరం చేసుకోవడానికి, ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని కరిగించుకోవడానికి మీరు ఎలాంటి డీటాక్స్‌ టిప్స్‌ ఫాలో అవుతున్నారు? మాతో పంచుకోండి.. మరెంతోమంది దంపతులకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పించండి!



మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని