గాలిలో వైరస్‌ వ్యాప్తి సాధ్యమే..!
close

Published : 06/01/2021 01:32 IST
గాలిలో వైరస్‌ వ్యాప్తి సాధ్యమే..!

సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ గాలిలో వ్యాపిస్తుందా? అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులోభాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) కూడా హైదరాబాద్‌, మోహాలీ నగరాల్లో అధ్యయనం చేపట్టింది. కొవిడ్‌ ఆసుపత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి సాధ్యమే అని‌ సీసీఎంబీ వెల్లడించింది. అయితే, కొవిడ్‌ రోగులుండే సమయం మేరకు గాలిలో వైరస్‌ ప్రభావం ఉంటుందని తెలిపింది.

కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తోన్న గదుల్లో రోగుల సంఖ్య, వారిలో లక్షణాలు, వారు అక్కడ గడిపే సమయాన్ని బట్టి వైరస్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ముఖ్యంగా ఐసీయూ గదుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా కొవిడ్‌ పరీక్షలు జరిపే ప్రాంతాల్లోనూ తీవ్ర లక్షణాలున్న వారివల్ల కొంతసేపు గాలిలో వైరస్‌ ఉండే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశోధనల్లో భాగంగా వివిధ ఆసుపత్రుల్లోని కొవిడ్‌ రోగులున్న గదుల్లో 64శాంపిళ్లను, నాన్‌కొవిడ్‌ పరిసరాల్లోని 17శాంపిళ్లను సేకరించి సీసీఎంబీ నిపుణులు ఈ అధ్యయనం చేపట్టారు.

ఆందోళన వద్దు..
ఆసుపత్రుల పరిసరాల్లో గాలిలో కరోనా వైరస్‌‌ వ్యాపించడం పట్ల సాధారణ రోగులు, వారికి తోడుగా వచ్చేవారు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని సీసీఎంబీ స్పష్టం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని పేర్కొంది. ఇదిలాఉంటే, మురుగునీటి పరీక్షల ద్వారా వైరస్‌ వ్యాప్తి తీరును నిర్ధారించేందుకు హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు ఇప్పటికే పరిశోధన చేపట్టాయి. పరిశోధన చేపట్టిన నాటికే నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి సాధారణ స్థితికి వచ్చి ఉంటారని అంచనా వేశాయి. అయితే, మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో(ఎస్‌టీపీలలో) శుద్ధి చేయని నీటిలక్షణాల వైరస్ ఆనవాళ్లు కనిపించగా..శుద్ధి అనంతరం వైరస్‌ కనిపించలేదని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇవీ చదవండి..
జనవరి 13లోపే వ్యాక్సిన్‌ పంపిణీ షురూ..!
‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వల్లే తీవ్రత తగ్గిందా..?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని