పరిశోధన

రక్తస్రావానికి కరెంటుతో చెక్‌!

రీరంమీద గాయమైతే వెంటనే ఏం చేస్తాం... కట్టు కట్టడం ద్వారా రక్తస్రావాన్ని అడ్డుకుంటాం. కానీ భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండదు. పైగా కట్టువల్ల శరీరంమీద గాయంనుంచి మాత్రమే రక్తస్రావాన్ని అరికట్టగలం. కానీ శరీరంలోపల ఏదైనా అవయవం నుంచి రక్తం కారితే అది ప్రాణాంతకమే. అందుకే ఫెయిన్‌స్టీన్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు బయో ఎలక్ట్రిక్‌ విధానాన్ని రూపొందించారు. ఓ చిన్న పరికరాన్ని శరీరంమీద ఉంచి దాని ద్వారా కరెంటుని శరీరంలోని వేగస్‌ అనే ప్రధాన నరానికి ప్రవహింపజేస్తారు. ఈ నాడి మెదడు, గుండె, వూపిరితిత్తులు... వంటి ప్రధాన అవయవాలన్నింటికీ అనుసంధానమై ఉంటుంది. దాంతో కరెంటు దీన్ని చేరిన వెంటనే ప్లీహాన్ని ప్రేరేపించి రక్తం గడ్డకట్టే ప్లేట్‌లెట్‌ కణాలను సంబంధిత భాగానికి పంపించేలా చేస్తుంది. తద్వారా గాయం నుంచి రక్త ప్రవాహం ఆగుతుంది. గతంలో దీన్ని పందుల్లో ప్రయోగించి చూడగా అది యాభై శాతం రక్తస్రావాన్ని అడ్డుకోగలిగింది. దాంతో మరింత లోతుగా పరిశోధన చేసి పూర్తిస్థాయిలో రక్తస్రావాన్ని అడ్డుకోగలిగారు. కాబట్టి ఈ పరిశోధనవల్ల భవిష్యత్తులో శస్త్రచికిత్సలు మరింత సులభతరం కానున్నాయనీ, అలాగే అంతర్గత రక్తస్రావం కారణంగా నమోదయ్యే మరణాల శాతం తగ్గుతుందనీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


 

మంటను తగ్గించేలా...

‘అబ్బా మంట’ (ఇన్‌ఫ్లమేషన్‌)అంటూ గభాల్న పొట్ట పట్టుకుంటాం. అలాగే గాయమైనప్పుడు కూడా మంట, నొప్పి వస్తుంటాయి. నిజానికి గాయం తగ్గడానికో లేదా హానికర బ్యాక్టీరియాను తొలగించడంలో భాగంగానో ఈ మంట లేదా నొప్పి కలుగుతుంటుంది. అయితే ఈ నొప్పి మరీ భరించలేనంత స్థాయిలో ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో గుండెజబ్బులూ క్యాన్సర్లూ కీళ్లనొప్పులూ వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్నీ మంటల్నీ తట్టుకోవడం మాత్రం చాలా కష్టం. అందుకే ఆ మంటను తగ్గించే ఆహారపదార్థాల తయారీమీద దృష్టి పెట్టారు పరిశోధకులు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ మంటను తగ్గించే ఆహారోత్పత్తులకే అత్యధిక డిమాండ్‌ అంటున్నారు సంబంధిత నిపుణులు. అందులో భాగంగా ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించే ఆహారపదార్థాలను శోధించగా పసుపు, అల్లం వంటివి ముందు వరసలో నిలిచాయట. అలాగే మంటకు కారణమయ్యే గ్లూటెన్‌ పదార్థాలు, తృణధాన్యాలూ, పాల ఉత్పత్తులకు బదులుగా జుకుచిని నూడుల్స్‌, కాలీఫ్లవర్‌ రైస్‌, గింజల నుంచి తీసిన పాలు, వెజిటబుల్‌ చీజ్‌... వంటివీ రానున్నాయి. ఇప్పటికే స్టార్‌బక్స్‌ ఓ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రింక్‌ను తయారుచేసి వీటి తయారీలో ఓ అడుగు ముందుకు వేసేసింది కూడా.


 

జెల్లీలూ ట్యాబ్లెట్లే!

కీళ్ల రోగులకు ఓ శుభవార్త అంటున్నారు యూసీ డేవిస్‌ కాలేజ్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌, ఆస్ట్రేలియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ సంస్థలకు చెందిన నిపుణులు. అదేమంటే, వ్యాయామంతోబాటు జెలాటిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కీళ్లూ ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరు యువకులకు జెలాటిన్‌, విటమిన్‌-సి సప్లిమెంట్లను ఇచ్చి చూశారట. తరవాత వాళ్ల రక్తాన్ని పరిశీలించి చూడగా అందులో ఎముకల్ని పట్టి ఉంచగలిగే బంధన కణజాలానికి అవసరమైన అమైనోఆమ్లాల శాతం పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి వ్యాయామానికి తోడు విటమిన్‌-సి, జెలాటిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడంవల్ల ఎముక కణజాలం దెబ్బతినకుండా ఉంటుందని తేలింది. అంటే మున్ముందు జెల్లీలూ ట్యాబ్లెట్లుగా రానున్నాయన్నమాట.


 

వెచ్చదనానికి నానో!

 

నది ఉష్ణమండలం కాబట్టి బతికిపోయాంగానీ చలిని తట్టుకోవడం చాలా కష్టం. అదే శీతలప్రదేశాల్లో నివసించేవాళ్లకయితే చలి కాలంలో వూలు దుస్తుల్ని ధరించడం లేదా గదిలో హీటర్లు పెట్టుకోవడం తప్పనిసరి. అయితే ఎంత వూలు దుస్తులయినా శరీరానికి 20 శాతం మాత్రమే వెచ్చదనాన్ని అందించగలవు. అందుకే స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు ఎలాంటి హీటర్లూ మందపాటి స్వెటర్లతో పనిలేకుండా సిల్వర్‌ నానో వైర్‌ దుస్తుల్ని రూపొందించారు. ఇవి ఎంతో తేలిగ్గా ఉండటంతోబాటు శరీరానికి 90 శాతం వెచ్చదనాన్ని అందిస్తాయట. పైగా ఎంతో సౌకర్యంగానూ ఉంటాయట. కాకపోతే కాస్త ఖరీదెక్కువ. వీటిని మరింత చౌకగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వెండికి బదులు కాపర్‌, నికెల్‌ లోహాలతో తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తోన్న శక్తి వనరుల్లో 42 శాతాన్ని ఇళ్లను వేడెక్కించడానికే వాడుతున్నారట. కాబట్టి రాబోయే కాలంలో ఈ నానో కోటెడ్‌ దుస్తుల కారణంగా ఇంధనం ఎంతో ఆదా అవుతుందన్నమాట.


 

టూకీగా...

అధిక బరువు వల్ల అప్పటికప్పుడు సమస్యలు రావడమే కాదు వాళ్ల డీఎన్‌ఏలోనూ మార్పులొస్తాయని జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఎన్‌విరాన్‌మెంటల్‌ హెల్త్‌ చెబుతోంది.
* ఐరన్‌ లోపం వినికిడి సమస్యలకూ కారణం కాగలదని పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
* ఎక్కువగా భుజం నొప్పికి గురయ్యేవారూ లేదా భుజం కండరాల గాయాల బారినపడే వారిలో గుండెజబ్బులువచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ ఉతా హెల్త్‌ సైన్సెస్‌ పరిశోధకులు తేల్చిచెప్పారు.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.