layoffs: కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు

layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.

Published : 05 May 2024 00:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌తో మొదలైన లేఆఫ్‌ల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ, టెక్‌, స్టార్టప్‌ కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాదిలోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది. టెస్లా, గూగుల్‌, యాపిల్‌ అనేక పెద్ద కంపెనీలూ ఉద్యోగులను తొలగించిన జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 80 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. ఒక్క ఏప్రిల్‌లోనే ఏకంగా 20వేల మందిని సాగనంపాయి.

ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో చాలామంది స్మార్ట్‌ కారు, స్మార్ట్‌వాచ్‌ డిస్‌ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నవాళ్లే. భారీ ఖర్చు సహా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను యాపిల్‌ పక్కన పెట్టింది. ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ (Amazon) తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలమంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్‌ (Intel) సంస్థ సేల్స్, మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి దాదాపు 62 మందిని ఇంటికి పంపింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్‌ (Byjus) ఏప్రిల్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించింది.

నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్‌ కాల్స్‌పై జిరోదా సీఈవో పోస్ట్‌

ఎలాన్‌మస్క్‌కు (Elon musk) చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని విధుల నుంచి తొలగించింది. ఓలా క్యాబ్స్ (OLA Cabs) 10 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. టెక్‌, ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ టీమ్‌కు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. హెల్త్‌ టెక్‌ స్టార్టప్‌ హెల్తిఫైమీ (Healthifyme) 150 మంది ఉద్యోగులను తొలగించింది. వర్ల్‌పూల్‌ 1,000 మందిని, టెలినార్‌ 100 చొప్పున ఉద్యోగాలు తొలగించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని