Scam: మనీ స్వైపింగ్ స్కామ్‌.. బ్యాంక్‌ మెసేజ్‌లతో కొత్త మోసం!

Scam Alert : డిజిటల్‌ యుగంలో సైబర్‌ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్‌ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.

Published : 05 May 2024 00:05 IST

Scam Alert | ఇంటర్నెట్‌డెస్క్‌: మీ పేరిట లాటరీ తగిలింది.. బ్యాంకు వివరాలు, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌ పంపండి అంటూ మెసేజ్‌లు, ఇ-మెయిల్‌లో నకిలీ లింకులు, ఫేక్‌ వెబ్‌సైట్లను రూపొందించి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం.. ఇలా సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పంథాలకు తెరతీస్తుంటారు సైబర్‌ నేరగాళ్లు. అమాయకులను ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున సొమ్ము కాజేస్తుంటారు. వీటిని అరికట్టేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజూ ఎవరో ఒకరు వీరి వలలో చిక్కుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనీ స్వైపింగ్ (Money Swiping Scam) పేరిట కొత్తతరహా మోసాలకు తెరతీశారు. 

బెంగళూరుకు చెందిన అదితీచోప్రా అనే మహిళ తాజాగా మనీస్వైపింగ్ స్కామ్‌ వలలో చిక్కింది. అయితే ఆమె చాకచక్యంగా వారి బారినుంచి తప్పించుకొని ‘ఎక్స్‌’ వేదికగా తన అనుభవాన్ని పంచుకుంది. ‘‘ఆఫీసులో ఉన్న సమయంలో ఓ నంబర్‌ నుంచి ఆమెకు కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేయగానే ‘అదితీ, నేను మీ నాన్నకు డబ్బు పంపాలి. ఆయన అందుబాటులో లేనందున మీకు పంపమన్నారు. ఇది నీ నంబర్‌యేనా?’ అని గట్టిగా అడిగారు. సమాధానం చెబుతుండగానే బ్యాంక్‌ ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. మొదట రూ.10 వేలు, తర్వాత రూ.30 వేలు. ఇలా బ్యాంకు వాళ్లు పంపే ఫార్మాట్‌లో ఆ ఎస్సెమ్మెస్‌ ఉంది. దాన్ని చూస్తుండగానే ఫోన్‌ చేసిన వ్యక్తి ‘నేను రూ.3 వేలు మాత్రమే ఇవ్వాలి. పొరపాటున రూ.30 వేలు పంపాను. దయచేసి మిగిలిన డబ్బు తిరిగి పంపండి’ అని అడిగాడు’’

డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!

‘‘ డాక్టర్‌ దగ్గర ఉన్నానని నా సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా స్కామ్‌ అని. కొంత సమయం తర్వాత నిశితంగా ఆ మెసేజ్‌ను పరిశీలించాక బ్యాంక్‌ నుంచి కాకుండా ఫోన్‌ నంబర్‌ నుంచి ఆ ఎస్సెమ్మెస్‌ వచ్చిందని గ్రహించాను. వెంటనే బ్యాలెన్స్‌ చెక్‌ చేసి అదే నంబర్‌కు తిరిగి ఫోన్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటే కాల్‌ కలవట్లేదు. అప్పటికే ఆ మోసగాడు నా నంబర్‌ను బ్లాక్‌ చేశాడు’’ అంటూ సుదీర్ఘ ట్వీట్‌ చేశారు. సంబంధిత స్క్రీన్‌ షాట్లు కూడా పంచుకొని.. ఇలాంటి స్కామ్‌లపై జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లకు సూచించారు. డెబిట్‌/క్రెడిట్‌ మెసేజ్‌లు వస్తే ముందుగా బ్యాంకులకు సంబంధించిన ప్రత్యేక యాప్‌ల ద్వారా చెక్‌ చేయటమే ఉత్తమం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని