Anakapalli: ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది.

Updated : 04 May 2024 20:42 IST

మాడుగుల: అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడికి పాల్పడ్డారు. కూటమి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన చొక్కా చిరిగిపోయింది. తారువలో కూటమి అభ్యర్థికి మద్దతుగా భాజపా నేత గంగాధర్‌ ఇంటి వద్ద ప్రచారం చేస్తున్న సమయంలో.. వైకాపా నాయకులు, కార్యకర్తలు వచ్చి దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌ కెమెరాతో పాటు కారు, రెండు బైక్‌లను ధ్వంసం చేశారు. నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న బూడి ముత్యాల నాయుడు గంగాధర్‌పై చెప్పుతో దాడి చేశారు. బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దెబ్బలుతిన్న కార్యకర్తలనే స్టేషన్‌కు తీసుకెళ్లారని కూటమి నేతలు తెలిపారు. 

సమాచారం తెలుసుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ దేవరాపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ముత్యాల నాయుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొద్దిసేపు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. గంగాధర్‌ ఇంటికి వెళ్లేందుకు సీఎం రమేశ్‌ బయల్దేరగా.. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సరే.. ఆయన పట్టుబట్టి తాడువ గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు కూడా తారువ గ్రామంలో ఉండటంతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. బాధిత కార్యకర్తలను పరామర్శించే వరకు గ్రామం నుంచి వెళ్లేది లేదని సీఎం రమేశ్‌ అక్కడే వేచి ఉన్నారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని దేవరాపల్లి స్టేషన్‌కు తరలిస్తుండగా ఒక్కసారిగా వైకాపా శ్రేణులు పోలీసు వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో సీఎం రమేశ్‌ చొక్కచిరిగిపోగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. రమేశ్‌ వాహనంతో పాటు  కాన్వాయ్‌లోని మరో మూడు కార్లపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడటంతో భాజపా శ్రేణులు భగ్గుమంటున్నారు.

పోలీసుల తీరు దారుణం: సీఎం రమేశ్‌

దాడి ఘటన తర్వాత దేవరాపల్లి పోలీస్‌ స్టేషన్‌లో సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు.‘‘వైకాపా దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళితే పోలీసులు అడ్డుకున్నారు. నాపై దాడికి పురిగొల్పిన బూడి ముత్యాల నాయుడిని మాత్రం ఏమీ చేయలేదు. దాడి చేసిన వారంతా ఇసుక దోపిడీ, మైనింగ్‌ దందాకి పాల్పడిన వారే. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నేలేదు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తా. ఆ గ్రామంలోనే అత్యధిక మెజారిటీ సాధిస్తా. ఏపీ పోలీసుల తీరు దారుణం’’ అని సీఎం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని