close
కల్కి ఆశ్రమంపై వివాదాల ముసురు

అటవీ, సీలింగ్‌ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు
వివరాలు సేకరిస్తున్న రెవెన్యూ అధికారులు

ఈనాడు, తిరుపతి: కల్కి ఆశ్రమ ఆస్తులపై వివాదాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఆదాయ పన్ను శాఖ సోదాల నేపథ్యంలో పలువురు ప్రభుత్వం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలోనూ ఫిర్యాదులు అందజేస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ప్రధాన ఆశ్రమంతోపాటు ఉబ్బలమడుగు సమీపంలో నిర్మించిన క్యాంపస్‌ల్లో చాలా ప్రాంతం సీలింగ్‌, అటవీ భూముల్లోనే ఉన్నాయన్న ఫిర్యాదులున్నాయి. విజయకుమార్‌ అలియాస్‌ కల్కి భగవాన్‌కు ఇన్నాళ్లు ఆధ్యాత్మిక గురువుగా పలుకుబడి ఉన్నందున తామేమీ చేయలేకపోయామని, ఇకనైనా తమ భూములు ఇప్పించాలని వారు విన్నవిస్తున్నారు. ల్యాండ్‌సీలింగ్‌ చట్టం అమల్లోకి వచ్చాక 1975లో బత్తలవల్లం గ్రామంలో విజయ్‌కుమార్‌ అలియాస్‌ కల్కి 2.78 ఎకరాల భూమి కొన్నారు. ప్రభుత్వం స్థానికులకు డీకేటీ కింద పట్టాలిచ్చిన భూమిని సైతం ఆశ్రమ నిర్మాణానికి ఆక్రమించారన్న ఫిర్యాదులున్నాయి. చెదుళ్లపాకంలోని 2.78 ఎకరాల సీలింగ్‌ భూమిని తీసుకున్నారని, తమ భూములు తిరిగి ఇవ్వాలని కోరితే వేరే చోట కేటాయిస్తామంటూ ఆశ్రమ ప్రతినిధులు దాటవేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సీలింగ్‌ చట్టం ప్రకారం పొందిన భూముల క్రయవిక్రయాలు చెల్లవు.
* ఆశ్రమం వెనక భాగంలో 64 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని స్థానిక 72 కుటుంబాలు సాగు చేసుకునేవి. ఈ భూములపై ప్రభుత్వం ఎలాగూ పట్టాలు ఇవ్వబోదంటూ కొన్నాళ్ల కిందట ఆశ్రమ ప్రతినిధులు ఒత్తిడి తెచ్చారని, నామమాత్రంగా డబ్బులిచ్చి స్వాధీనం చేసుకున్నారని రైతులు వాపోతున్నారు.
* ఆశ్రమం సమీపంలోని 1.04 ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉన్నదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీనిపైనా కోర్టు కేసు ఉంది. ఉబ్బలమడుగు సమీపంలో వన్‌నెస్‌ (ఏకం) క్యాంపస్‌ల పరిధిలోనూ భూవివాదాలున్నాయి.

పోరాడుతూనే ఉన్నాం
- రాజయ్య, బత్తలవల్లం

గతంలో ప్రభుత్వం మాకు సీలింగ్‌ భూములు ఇచ్చింది. మా నాన్న వద్ద తెల్ల కాగితాలపై సంతకం చేసుకుని ఆశ్రమం వారు తీసుకున్నారు. మా భూముల కోసం పోరాడుతూనే ఉన్నాం. వాళ్లను అడిగితే న్యాయస్థానంలో ఉందని చెబుతున్నారు.  ఇన్నాళ్లూ ఆశ్రమం స్థలంలో సేద్యం చేసుకోమని చూపించారు. ఇప్పుడు అదీ లేదు.

సాగు భూమిని తీసుకున్నారు
- నందకిశోర్‌, బత్తలవల్లం

కల్కి ఆశ్రమం వెనక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని మా తాతల కాలం నుంచి సాగు చేసుకున్నాం. కొన్నాళ్ల కిందట మా నుంచి ఆశ్రమ ప్రతినిధులు దౌర్జన్యంగా వారి పేరిట రాయించుకున్నారు. మొత్తం 72 కుటుంబాలు ఆ భూమిని నమ్ముకుని బతికేవాళ్లం. వాటిపై ప్రభుత్వం మాకు పట్టాలివ్వాలి.

వివరాలు సేకరిస్తున్నాం

కల్కి ఆశ్రమం ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నాం. తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఆశ్రమ నిర్వాహకులకు సూచించాం. బత్తలవల్లం గ్రామపటం తీసుకుని ఏ సర్వేనంబరులో ఎలాంటి భూములున్నాయి? వాటికి అసలు యజమానులు ఎవరు? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అనే అంశాలపై విచారిస్తున్నాం. పూర్తి వివరాలతో నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాం.

 - కనకనరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి.

అక్రమాలు అవాస్తవం
ఆలయ ప్రతినిధి సునీల్‌దాసాజీ

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: కల్కి ఆశ్రమంలోని ఏకం ఆలయంలో ఐటీ సోదాల్లో అక్రమాలు వెలుగు చూశాయంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని ఏకం ఆలయ ప్రతినిధి సునీల్‌దాసాజీ తెలిపారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం పంచాయతీ గోవర్ధనపురంలోని వన్నెస్‌ హ్యుమానిటీ కేర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆధ్యాత్మిక సంస్థలన్నీ భక్తుల విరాళాలతో నడిచేవేనని, తామేమీ ప్రత్యేకం కాదని వివరించారు. కేవలం పన్ను చెల్లించనందునే ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించిందని తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి వారి తనిఖీలకు తాము పూర్తిగా సహకరించామన్నారు. పట్టుబడ్డ నగదు సైతం భక్తుల విరాళాలేనని స్పష్టం చేశారు. ట్రస్టు ఆస్తులు చట్టబద్ధమైనవేనని, ఎలాంటి అక్రమాలకు తావు లేదని పేర్కొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.