close

ప్రధానాంశాలు

అండగా ఉంటాం.. అధైర్యం వద్దు

రాజధాని వాసులకు పలువురి సంఘీభావం
  మండలి రద్దు తీర్మానంపై అన్నదాతల ఆగ్రహం
  41వ రోజుకు చేరుకున్న దీక్షలు
ఈనాడు - అమరావతి

వికేంద్రీకరణ బిల్లును ఆమోదించకుండా సెలక్టు కమిటీకి పంపించారన్న దుగ్ధతోనే సీఎం జగన్‌.. ఏకంగా మండలి రద్దుకే ప్రతిపాదించారని రాజధాని రైతులు విమర్శిస్తున్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, రైతుకూలీలు చేస్తున్న దీక్షలు సోమవారం 41వ రోజుకు చేరుకున్నాయి. రైతుల ఉద్యమానికి పలు ప్రాంతాల నుంచి వస్తున్న వారు తమ సంఘీభావం తెలుపుతున్నారు. విరాళాలు, కూరగాయలు అందజేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

 మందడంలో..
అసెంబ్లీ, మంత్రివర్గ సమావేశం ఉండడంతో రహదారిపై ఆందోళనలకు పోలీసులు అనుమతించలేదు. విశాఖ నుంచి వచ్చిన పార్వతి రూ.25 వేలు విరాళంగా ఇచ్చారు. కర్ణాటక రాయచూరు నుంచి పలువురు రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ రాష్ట్రంలోనూ ‘అమరావతి’ ఆందోళనలు చేపడుతున్నామని వారు వివరించారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, తెనాలి జడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, అమెరికా నుంచి వచ్చిన చుక్కపల్లి భారతి, హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తదితరులు శిబిరానికి వచ్చారు. ఉద్యమంలో మరింత మందిని కలుపుకొని వెళ్లేందుకు సాయంత్రం ఐకాస నేతలు గ్రామంలోని అందరి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు.

తుళ్లూరులో....
తుళ్లూరు మహాధర్నా ప్రాంగణానికి రాజుపాలెం మండలం నెమలికల్లు మహిళలు వచ్చారు. హైకోర్టు న్యాయవాదులు, తెనాలి నుంచి మహిళలు వచ్చి మద్దతు ప్రకటించారు. దొండపాడు, నేలపాడు, అనంతవరం గ్రామాల నుంచి మహిళలు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. తుళ్లూరు రైతులు ముగ్గురు కలిసి అమరావతిని ఇక్కడే కొనసాగించాలని చండీయాగం చేయించారు.
* రాజధాని రైతులు మంగళవారం కృష్ణాలో జలదీక్ష చేయనున్నారు. వెలగపూడిలో దీక్షలో మహిళలు, రైతులు, రైతుకూలీలు పాల్గొన్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నిడమర్రు, నవులూరు గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగాయి. శిబిరాలకు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి వచ్చారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెలగపూడి దీక్షా శిబిరాలకు వంగవీటి రాధ హాజరై మద్దతు తెలిపారు. పెనుమాకలో నిరసన దీక్ష కొనసాగించారు. తాడికొండ మండలం అడ్డరోడ్డు వద్ద దీక్ష కొనసాగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి హాజరై సంఘీభావం ప్రకటించారు.

ఎన్‌ఏపీఎం నిజనిర్ధారణ కమిటీ పర్యటన
రాజధాని గ్రామాల్లో జాతీయ ప్రజాఉద్యమాల కూటమి సభ్యులు పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ‘నిజనిర్ధారణ కమిటీ’ పేరుతో అమరావతి ప్రజలు, దీక్షా శిబిరాల్లోని రైతుల వివరాలు సేకరించారు.
*  రైతుల ఉద్యమాన్ని ప్రపంచానికి చూపిస్తోందన్న ఆక్కసుతో మీడియా ప్రతినిధులపై నిర్భయ చట్టం కింద కేసులు పెట్టడం దుర్మార్గమని విశాఖ మహిళ పార్వతి పేర్కొన్నారు. ఉద్యమానికి పాటలే ప్రాణమని, మరో ఐదు పాటలను రాయించామని, అవి రికార్డింగ్‌ దశలో ఉన్నాయని పదవీ విరమణ చేసిన డీఎస్పీ విజయకుమార్‌ తెలిపారు.
రద్దుతో సాధించేదేమిటి?: వంగవీటి
ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించినప్పుడు శాసన మండలి దండగ అనే విషయం సీఎం జగన్‌కు తెలియదా? అని తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. ఎమ్మెల్యేలుగా పోటీకి అవకాశమివ్వలేని వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని చెప్పినప్పుడు తెలియదా? అని ప్రశ్నించారు. మండలి రద్దుతో జగన్‌ ఏం సాధించాలనుకుంటున్నారని నిలదీశారు. సోమవారం తుళ్లూరు, వెలగపూడిలో రైతుల నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ‘పెద్దల సభ అవసరం లేదని అంటున్నారు? మీకు 22 మంది ఎంపీలు ఉన్నారుగా. వారితో లేఖ రాయించి రాజ్యసభనూ రద్దు చేయించండి’ అని పేర్కొన్నారు.


పేద మహిళలకు వైకాపా ఏం సమాధానం చెబుతుంది?
ట్వీట్‌లో ప్రశ్నించిన చంద్రబాబు

ఈనాడు, అమరావతి: తెదేపా ప్రభుత్వం అన్ని వసతులతో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు కట్టిస్తే.. వాటిని పంచకుండా స్థలాలు ఇస్తామంటూ మళ్లీ తమ బతుకుల్ని మొదటికి ఎందుకు తెస్తున్నారని అడుగుతున్న ఈ పేద మహిళలకు వైకాపా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం ట్వీట్‌లో ప్రశ్నించారు. ఓ మహిళ మాట్లాడిన వీడియోను ట్యాగ్‌ చేశారు. ‘మాకు కృష్ణాయపాలెంలో ఇల్లు ఉంది. వాగు ఒడ్డున ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దానికి పట్టా లేదు. పట్టా లేక మరుగుదొడ్డి కట్టుకునే అవకాశం రాలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మాకు ఇల్లు మంజూరు చేశారు. చంద్రబాబు పాలనలో.. రూ.50వేలు కడితే సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, రూ.లక్ష కడితే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇస్తామన్నారు. మా దగ్గర పైసా లేదు. కూలికి వెళ్తే మా ఆయనకు రూ.200, నాకు రూ.100 వస్తుంది.
డబుల్‌ బెడ్‌రూమ్‌ కోసం
రూ.లక్ష వడ్డీకి తెచ్చి కట్టా. గత నవంబరుకు ఏడాది గడిచింది. కొత్త సంవత్సరంలో ఇళ్లు ఇస్తామని బాబు చెప్పారు. ఈ ప్రభుత్వం కాంక్రీటు పునాదులు సరిలేవని అంటోంది’ అని రాచకొండ నాగలక్ష్మి అనే ఆ మహిళ పేర్కొన్నారు.

వాళ్ల జ్ఞానం ఏపాటిదో తెలుస్తోంది
‘అసెంబ్లీలో ఇంతమంది మేధావులుండగా సలహాలు ఇవ్వడానికి మండలి ఎందుకని వాదిస్తున్న వారికి.. అసెంబ్లీలో అధికారపక్ష నేతల జ్ఞానం ఏపాటిదో ఆయన చెబుతున్నారు వినండి’ అని మరో వీడియోను ట్యాగ్‌ చేస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ‘మేనిఫెస్టోలో రాజధాని తరలింపు అనే పదో రత్నం గురించి ఎందుకు చెప్పలేదని అడుగుతున్న వారికి ప్రభుత్వం చెప్పే సమాధానం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని యూరప్‌లోని ప్రవాసాంధ్రులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రుల చేతిలో రాష్ట్రం మోసపోలేదు. ప్రస్తుతం జగన్‌ చేతిలో మోసపోయింది’ అని వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.