close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెమ్‌డెసివిర్‌ ఎగుమతులపై నిషేధం

దేశంలో కొవిడ్‌ అదుపులోకి వచ్చేవరకు అమలు

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌-19 చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌తోపాటు, దాని తయారీకి ఉపయోగించే క్రియాశీలక ఔషధ మూలకాల (యాక్టివ్‌ ఫార్మాస్యుటికల్‌ ఇన్‌గ్రెడియెంట్స్‌) ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో దేశీయంగా దీనికి విపరీతమైన డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో కొవిడ్‌ అదుపులోకి వచ్చేంతవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం నాటికి క్రియాశీలక కేసులు 11.08 లక్షలకు చేరడంతో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉందని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలుండటంతో సంబంధిత ఎగుమతులను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థతో చేసుకొన్న వాలంటరీ లైసెన్సింగ్‌ ఒప్పందం ఆధారంగా దేశంలో 7 సంస్థలు ప్రతినెలా 38.80 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. ఇవి దేశీయ అవసరాలకే సరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఇంజెక్షన్‌తోపాటు, దాని తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల ఎగుమతులనూ నిషేధించింది. ఆసుపత్రులు, రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ వివరాలు అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది.
1. దేశీయంగా ఈ ఇంజెక్షన్‌ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలన్నీ అవసరమైన వారికి దాని వివరాలు అందుబాటులో ఉండేలా తమ వెబ్‌సైట్‌లలో స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల వివరాలను పొందుపరచాలి.
2. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు వెంటనే తమ పరిధిలో రెమ్‌డెసివిర్‌ నిల్వలను తనిఖీ చేయాలి. అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌ లాంటి తప్పుడు విధానాలను అనురిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల వైద్యశాఖ కార్యదర్శులు ఈ ఔషధ నిల్వల గురించి ఎప్పటికప్పుడు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లతో సమీక్షించాలి.
3. దేశీయంగా రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రసాయనాల మంత్రిత్వశాఖ దేశీయ ఉత్పత్తిదారులతో సంప్రదిస్తుంది.

రాష్ట్రాలకు సూచనలు..
కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్‌ క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొటోకాల్‌ పాటించాలని కేంద్రం సూచించింది. ఎన్నో ఆధారాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులతో సంప్రదించిన తర్వాత కరోనా చికిత్స విషయంలో డాక్టర్లకు మార్గదర్శనం చేసేందుకు నిపుణుల కమిటీ ఈ డాక్యుమెంటును తయారు చేసిందని పేర్కొంది. ఈ ప్రొటోకాల్‌ ప్రకారం రెమ్‌డెసివిర్‌ పరిశోధనాత్మక చికిత్స జాబితాలో ఉందని, అందువల్ల ఈ మార్గదర్శకాల్లోని ప్రతికూల సూచనలను పరిగణనలోకి తీసుకొని, ఆ విషయాలను రోగులకు ముందస్తుగా అందించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ విషయాలను రాష్ట్రాలు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తెలియజేసి, వాటిని అనుసరించేలా చూడాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అందుబాటులోకి మరో అయిదు టీకాలు!

దిల్లీ: దేశంలో కరోనా టీకాలకు కొరత లేకుండా చూడడం కోసం మరో 5 వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు దేశంలో తయారవుతుండగా వాటికి అదనంగా ఇవి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యాలో రూపొందిన స్పుత్నిక్‌-వి టీకా.. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరొటరీస్‌ సంస్థ సహకారంతో అతి త్వరలోనే ఉత్పత్తి కానుంది. బయొలాజికల్‌-ఇ సహకారంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌, సీరం ఇండియా సహకారంతో నోవావ్యాక్స్‌ టీకా, జైడుస్‌ క్యాడిలా వ్యాక్సిన్లు రానున్న కొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇవికాకుండా ముక్కు ద్వారా వేసే టీకాకు భారత్‌ బయోటెక్‌ రూపకల్పన చేస్తోంది. ఇది అక్టోబరునాటికి అందుబాటులోకి వస్తుందని వివరించాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు