మరో మెగా డ్రైవ్‌
close

ప్రధానాంశాలు

మరో మెగా డ్రైవ్‌

అధికారులు సిద్ధంగా ఉండాలి
వ్యాక్సిన్లు అధికంగా ఉంటే.. అంతే స్థాయిలో ఇచ్చే సామర్థ్యముంది
ఆంక్షల సడలింపుతో అప్రమత్తంగా ఉండాలి
కొవిడ్‌పై సమీక్షలో సీఎం ఆదేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే మరో మెగా డ్రైవ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే.. అంతే స్థాయిలో ఇచ్చే సామర్థ్యం, మంచి యంత్రాంగం ఉందని, మరింత మెరుగ్గా చేయగలమని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌, వైద్యశాఖలో నాడు-నేడు కార్యక్రమంపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించి మాట్లాడారు. కొత్త బోధనాసుపత్రుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాలని, పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

కార్పొరేట్‌ ఆసుపత్రులతో పోటీపడాలి
‘ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి నిర్దిష్టమైన ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ) ఉండాలి. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. మనం ప్రభుత్వ ఆసుపత్రులతో కాదు.. కార్పొరేట్‌్ ఆసుపత్రులతో పోటీ పడాలి. ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదు. ఊహించని ప్రమాదాలు జరిగితే రోగులను సురక్షితంగా ఖాళీ చేయించే అత్యవసర ప్రణాళిక కూడా సమర్థవంతంగా ఉండాలి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అనుసరించే ప్రొటోకాల్‌పై అధ్యయనం చేయాలి. అన్ని అంశాలూ అధ్యయనం చేశాక సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలి’ అని స్పష్టం చేశారు. ‘రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసిన సిబ్బందికి అభినందనలు. గత రికార్డును అధిగమించారు.వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వాటిని ఇచ్చే సమర్థత ఉందని నిరూపించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది, మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు ఇలా గట్టి యంత్రాంగం మనకుంది’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.

రోజుకు 20 నుంచి 25 లక్షల టీకాల సామర్థ్యం
రాష్ట్రంలో రోజుకు 20 నుంచి 25 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. యాక్టివ్‌ కేసులు 63,068, పాజిటివిటీ రేటు 5.65 శాతానికి తగ్గిందని, 95.93 శాతానికి రికవరీ రేటు పెరిగిందని చెప్పారు.రాష్ట్రంలో 1,37,42,417 డోసుల వ్యాక్సినేషన్‌ జరిగిందని, 82.77 లక్షల మందికి తొలిడోసు, 27.32 లక్షల మందికి రెండో డోసు అందిందని వివరించారు. ఐదేళ్ల లోపు వయసున్న తల్లులు 10,29,266 మందికి, విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే 11,158 మందికి తొలి డోసు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ ఆసుపత్రుల్లో పడకలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, పడకల వివరాలను సీఎంకు అందించారు. ఆ వివరాలివీ..

* అందుబాటులో ఉన్న ఐసీయూ పడకలు- 2,655

* ఆక్సిజన్‌ పడకలు 13,824 ఉన్నాయి

* కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో భర్తీ అయిన బెడ్లు 7,056

* బ్లాక్‌ ఫంగస్‌ యాక్టివ్‌ కేసులు- 2,772, వీరిలో 922 మందికి చికిత్సలు జరిగాయి. 1,232 మంది డిశ్చార్జి కాగా..212 మంది మృతి చెందారు.

సరిపడా వ్యాక్సిన్‌ ఇస్తే.. ఏం చేయగలమో నిరూపించాం: ట్విటర్లో సీఎం జగన్‌
సరిపడా వ్యాక్సిన్‌ అందిస్తే ఏం చేయగలమో దేశానికి నిరూపించామని సీఎం జగన్‌ అన్నారు.‘కొవిడ్‌పై పోరాటంలో భాగంగా రాష్ట్రంలో ఒకే రోజు 13,72,481 టీకాలు వేశాం. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, వైద్యులు, మండల అధికారులు, జేసీ, కలెక్టర్ల సమష్టి కృషికి ఈ ఘనత దక్కుతుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క కొవిడ్‌ వారియర్‌కి అభినందనలు... ధన్యవాదాలు’ అని సోమవారం ట్వీట్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని