‘ప్రత్యేకాధికారి’ పంచాయితీలు

ప్రధానాంశాలు

‘ప్రత్యేకాధికారి’ పంచాయితీలు

 భూవివాదాల్లో తలదూర్చుతున్న ఓ మంత్రి ఓఎస్డీ
సత్రం భూమికి ఎన్‌వోసీ కోసం ఒకరి దరఖాస్తు
అనుమతి రాకుండానే ఆ అధికారి స్నేహితుడికి విక్రయించేలా ఒప్పందం
  విజయవాడలో విలువైన స్థలంపైనా ఆయన బంధువు కన్ను
ఈనాడు - అమరావతి

ఓ అమాత్యుని వద్ద పనిచేసే ప్రత్యేకాధికారి పనితీరు వివాదాస్పదమవుతోంది. ఆ అమాత్యుని శాఖకు చెందిన స్థలాలతోపాటు, ఇతర స్థలాలపైనా ప్రత్యేకాధికారి తరఫువారు కన్నేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, రెండు స్థల వివాదాలు పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీల వరకు వెళ్లడంతో ఇవి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి పంచాయతీలోని ఈది అప్పలస్వామి సత్రానికి మూడు సర్వే నంబర్లలో అయిదెకరాల స్థలం ఉంది. ఇందులో కొంత విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి వారసత్వం కింద వచ్చిందిగా మీభూమి పోర్టల్‌లో గతంలో నమోదైంది. అయితే 2016లో దేవాదాయశాఖ అధికారులు.. ఆలయాలు, సత్రాలు, మఠాల ఆస్తుల వివరాలు నమోదు చేసినపుడు ఈ అయిదెకరాలు ఈది అప్పలస్వామి సత్రానికి చెందిన ఆస్తిగా నమోదు చేశారు. ఇది దేవాదాయశాఖకు చెందుతుందంటూ 22(ఎ)1 నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే 2.5 ఎకరాలు తమకు వారసత్వంగా వచ్చిందని, దీనికి నిరభ్యంతరపత్రం (ఎన్‌వోసీ) ఇవ్వాలంటూ సంబంధిత వ్యక్తి దేవాదాయశాఖకు అర్జీ పెట్టుకున్నారు. ఈ దస్త్రం అధికారుల పరిశీలనలో ఉంది. ఇంతలో ప్రత్యేక అధికారి ఈ అంశంలో తలదూర్చినట్లు తెలుస్తోంది. ఎన్‌వోసీ వచ్చేలా చూస్తామని, అయితే ఆ స్థలాన్ని తన సన్నిహితుడికి విక్రయించేలా కొన్నాళ్ల కిందట ఒప్పందం కూడా చేసుకోవడం గమనార్హం. కోట్ల రూపాయల విలువైన ఆ భూమికి కేవలం రూ.కోటి విలువ కట్టి, రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. మరోవైపు దేవాదాయశాఖ ద్వారా ఎన్‌వోసీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. రెండున్నర ఎకరాలకు ఎన్‌వోసీ కోసం ప్రతిపాదన రావడం వాస్తవమేనని, అయితే ఇంకా ఎన్‌వోసీ జారీ కాలేదని దేవాదాయశాఖ అధికారి ఒకరు తెలిపారు.

మరో డీల్‌లో అధికారి కుటుంబీకుడు

విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో 738 చదరపు గజాల స్థలం అంశం కూడా వివాదంగా మారింది. ఇది కూడా జక్కంపూడిలోని రెండున్నర ఎకరాలకు ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నవారిదే. రూ.కోట్ల విలువైన ఈ స్థలాన్ని వారి నుంచి తక్కువ మొత్తానికే ప్రత్యేక అధికారి కుటుంబీకుడు కొనేందుకు కొద్ది రోజుల కిందట ఒప్పందం చేసుకున్నారు. అయితే గడువుకు ముందే రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది సివిల్‌ వివాదం అయినప్పటికీ విజయవాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో దీనిపై మూడు రోజుల కిందట పంచాయితీ జరిగింది. ప్రత్యేక అధికారి సూచనతోనే పోలీసులు ఇందులో తలదూర్చినట్లు తెలుస్తోంది. ఠాణాలో పంచాయితీ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని