మాకు 70శాతానికి ఓట్లు పెరిగాయి: సజ్జల

ప్రధానాంశాలు

మాకు 70శాతానికి ఓట్లు పెరిగాయి: సజ్జల

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో వైకాపాకు 2019 ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు వస్తే ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో దాదాపు 70శాతానికి పెరిగాయి’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై తెదేపా అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేసినా ఎన్నికల్లో విఫలమైంది. రాష్ట్రంలో భాజపాకు ఒక్క శాతం ఓట్లు లేకపోయినా రాష్ట్రంలో ఆ పార్టీ వారు మతం పేరుతో దుష్ప్రచారాలు చేశారు. వారందరి మొహాలపై కొట్టినట్లు జనం తీర్పునిచ్చారు’ అని వ్యాఖ్యానించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపాకు 64.8శాతం ఓట్లు వస్తే తెదేపాకు 25.27శాతం, జనసేనకు 4.34, భాజపాకు 1.48శాతం వచ్చాయి. తెదేపాలో పెద్ద నాయకులమని చెప్పుకునే నేతలు.. వారి నియోజకవర్గాల్లో రెండు అంకెల స్థానాలను గెలిపించుకోగలిగినవారు ఒకరిద్దరే మిగిలారు. కుప్పంలో 66 ఎంపీటీసీ స్థానాలో కేవలం 3 మాత్రమే తెలుగుదేశానికి వచ్చాయి’ అని అన్నారు. అప్పులకు సంబంధించిన సొమ్మును ప్రభుత్వం మళ్లించడంపై సజ్జల మాట్లాడుతూ..‘తెదేపా హయాంలోనూ మళ్లించారు. వారు కమీషన్ల కోసం మళ్లించారు. ఇప్పుడు కరోనా సమయంలోనూ సీఎం జగన్‌ సుమారు రూ.లక్ష కోట్లు ప్రజల ఖాతాల్లో వేశారు’ అని వివరించారు. ఎంపీపీ ఎన్నికల్లో విభేదాలపై మాట్లాడుతూ..‘ఇంత పెద్దఎత్తున విజయం సాధించినపుడు, నాయకత్వం కోసం పోటీ సహజంగానే ఉంటుంది. అయితే ప్రతిపక్షం కోరుకున్నట్లు ఎక్కడా విభేదాలు భారీగా లేవు. చెదురుమదురుగా కొన్ని బయటపడ్డాయంతే ’ అని వ్యాఖ్యానించారు. 27న భారత్‌ బంద్‌పై సజ్జల స్పందిస్తూ..‘ఆ బంద్‌కు వైకాపా సంఘీభావం ప్రకటించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. ఏ కారణంతో వారు బంద్‌ చేస్తున్నారో ఆ అంశం ఇక్కడ అంత తీవ్రమైనది కాదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే పరిష్కరిస్తూ వచ్చింది కాబట్టే అవసరం లేదని అనుకుంటున్నాం’ అని అన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖలో చేర్చడంపై మాట్లాడుతూ.. ‘దేవాదాయ శాఖ పరిధి నుంచి ఈ సంస్థలను విడదీయాలని కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతానికి బీసీ శాఖ పరిధిలోకి తీసుకొచ్చినా, తర్వాత బ్రాహ్మణ, వైశ్య, కాపు వంటి కార్పొరేషన్లు అన్నింటినీ ఈబీసీగా చేయాలని ప్రభుత్వం చర్చిస్తోంది’ అని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని