
వసుంధర
ఆరు నెల్లకో శస్త్రచికిత్స.. తర్వాత నెలరోజులు మంచం మీదే! ఆ అమ్మాయి బాల్యం దాదాపుగా ఇదే. తన బాధను, ఆవేదనను గొప్పగా చదవడం ద్వారా తీర్చుకోవాలనుకుంది. ‘అంగవైక్యలం, ఆర్థిక పరిస్థితీ అంతంతమాత్రం.. ఇంత శ్రమ అవసరమా!’ అనే సలహాలు. కానీ ఆమె అవేమీ పట్టించుకోలేదు. ప్రతి పరీక్షలోనూ ర్యాంకులు సాధిస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. తాజాగా నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన సించన లక్ష్మి కథే ఇది. ఆ చదువుల సరస్వతి వసుంధరతో తన గురించి పంచుకుందిలా...
ఎలాగైనా నేను బతికితే చాలన్నది అమ్మానాన్నల కోరిక. ఏమాత్రం పటుత్వం లేని వెన్నెముకతో పుట్టాను మరి! మాది కర్ణాటకలోని మంగళూరు జిల్లా పుత్తూరు. రైతు కుటుంబం. పుట్టుకతోనే బలహీనంగా ఉన్నా... కొన్నేళ్లయ్యేసరికి కనీసం నిలబడలేని స్థితికొచ్చా. వైద్యులను సంప్రదిస్తే స్కోలియోసిస్, ప్రతి ఆరు నెలలకు శస్త్ర చికిత్స చేయాలన్నారు. ఇలా 5 నుంచి 9వ తరగతి వరకు సాగింది. మొత్తం ఆరు శస్త్రచికిత్సలు జరిగాయి. ఆసుపత్రి నుంచి వచ్చాక నెలరోజులు మంచానికే పరిమితం. తర్వాత కోలుకున్నా... వీపు మీద బ్రేస్‌లు, రాడ్లతో లేవడం, కూర్చోవడమూ కష్టమయ్యేది. తోటి పిల్లల బాల్యమంతా ఆటపాటలతో సాగితే.. నాదేమో ఆసుపత్రులు, శస్త్రచికిత్సల చుట్టూ తిరిగింది. చాలా బాధేసేది. చదువు మీద దృష్టిపెడదామన్నా.. నెలల కొద్దీ ఇంటికే పరిమితమవ్వడం వల్ల వెనకబడేదాన్ని. ఒకరకమైన బాధ, అసహనం. కానీ నాకున్న మార్గం చదువే. ఎన్ని ఇబ్బందులున్నా దానిపైనే దృష్టి పెట్టాలనుకున్నా. మిస్సయిన పాఠాల విషయంలో నాన్న, అక్క, స్నేహితుల సాయం తీసుకునే దాన్ని.
9వ తరగతి తర్వాత నా ఎదుగుదల నిలిచిపోవడంతో శస్త్రచికిత్సలు అవసరం లేదన్నారు డాక్టర్లు. ఆటంకాలు తప్పాయని సంతోషించా. చదువుపై మరింత శ్రద్ధ పెట్టా. పదో తరగతిలో రాష్ట్రంలో 5వ ర్యాంకు వచ్చింది. అమ్మానాన్నా ఉప్పొంగిపోయారు. నాకూ పట్టలేనంత సంతోషం. ఆ ఉత్సాహంతో ఇంటర్ కూడా పూర్తి చేయాలనుకున్నా. కానీ 15 కి.మీ. ప్రయాణించాలి. రోజూ బైకు, బస్సుల్లో ప్రయాణం మంచిది కాదన్నారు వైద్యులు. మా ఆర్థిక స్థోమత తక్కువ. అయినా చదువుపై నా ఇష్టాన్ని చూసి అప్పు చేసి కారు కొన్నారు నాన్న. సామాన్య రైతుకు అదెంత కష్టమో నాకు తెలుసు. అమ్మానాన్నల నమ్మకానికి బదులుగా గొప్పదే సాధించి చూపాలనుకున్నా. రోజూ నాన్నే కళాశాలకు తీసుకెళ్లి, తీసుకొచ్చే వారు.
తరగతిలో గంటపాటు కూర్చోవటమూ కష్టమయ్యేది. కళాశాల యాజమాన్యం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకోమనేవారు. విరామం తర్వాత మళ్లీ తరగతులకు హాజరయ్యేదాన్ని. ఆన్లైన్ అవకాశమిస్తామన్నా... అందరితోపాటే చదువుకోవాలన్నది నా కోరిక. ఎన్ని ఇబ్బందులున్నా ఏరోజూ తరగతులకు గైర్హాజరు కాలేదు. కానీ కరోనా కారణంగా రెండో ఏడాది ఇంటిపట్టునే ఉండి చదివా. నాది సైన్స్ గ్రూప్. మేథ్స్, సైన్స్ రెండూ చదివే వీలుంటుంది. దీంతో జేఈఈ, నీట్‌తోపాటు కర్ణాటక ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీఈటీ)నీ రాశా. సీఈటీలో 530, జేఈఈలో 106, బీఎన్‌వైఎస్, వెటర్నరీలో 974 ర్యాంకులు వచ్చాయి. నీట్లో అఖిల భారత స్థాయిలో వికలాంగుల విభాగంలో రెండో (జనరల్‌లో 2856)ర్యాంకు వచ్చింది. మంచి ర్యాంకు కాబట్టి, వైద్యవిద్య చదవాలనుకోలేదు. ఇంటర్లో చేరే ముందే సీటు సాధిస్తానని నాన్నకు మాటిచ్చా. నా ఆరోగ్య స్థితి కారణంగా ఒత్తిడి ఉండే చదువులొద్దని అమ్మానాన్నా చెబుతుంటారు. అందుకే ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. నా జీవితంలో ఎక్కువ భాగం వైద్యులు, నర్సులతోనే గడిపా. దీంతో ఆ వృత్తిపై గౌరవం, ఇష్టం పెరిగాయి. వాళ్లలాగే డాక్టర్‌గా పేదలకు చేతనైనంత సాయం చేయాలన్నది నా లక్ష్యం. ఈ విషయాన్నే చెప్పి మరీ ఒప్పించా. అంగవైకల్యం ఉన్నవాళ్లు ఏమీ సాధించలేమని బాధ పడుతుంటారు. ముందు మనల్ని మనం నమ్మితే.. ఏదైనా సాధించొచ్చు. అందుకు నేనే ఉదాహరణ.
-కె.ముకుంద, బెంగళూరు