ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share Comments Telegram Share
తటపటాయిస్తే తంటే!

పిల్లలైనా సరే. పుట్టుకతో వచ్చే అంగ సమస్యల విషయంలో ఏదో సంకోచం. తల్లిదండ్రుల్లో అదే తటపటాయింపు. బయటకు తెలిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే సందేహం. తమ పిల్లలను చిన్న చూపు చూస్తారేమోననే భయం. వీటిని దాచుకుంటే నష్టపోయేది పిల్లలే. పుట్టుకతో వచ్చే లోపాలను వీలైనంత త్వరగా సరిచేయకపోతే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది.

పిల్లల్లో లింగ భేదానికి గర్భధారణ సమయంలోనే బీజం పడుతుంది. ఇది తల్లి అండంలోని ఎక్స్‌ క్రోమోజోములు, తండ్రి వీర్యకణంలోని ఎక్స్‌ లేదా వై క్రోమోజోముల కలయిక మీద ఆధారపడి ఉంటుంది. మగ, ఆడ.. ఇద్దరిలోనూ ఒకే కణజాలం (జెనిటల్‌ రిడ్జ్‌) నుంచి లైంగిక అవయవాలు ఏర్పడతాయి. ఈ కణజాలంలోని క్రోమోజోములు (ఎక్స్‌ఎక్స్‌/ఎక్స్‌వై), మగ హార్మోన్లను బట్టి ఇవి రూపొందుతాయి. సాధారణంగా పిండంలో బయటి లైంగిక అవయవాలు ఏర్పడటం 3వ వారంలో మొదలవుతుంది. ఇవి 7వ వారం వరకూ అనిశ్చిత స్థితిలోనే ఉంటాయి. అంటే అప్పటికి ఆడ, మగ భేదం ఏర్పడదన్నమాట. ఇది 8వ వారం నుంచి రూపుదిద్దుకోవటం ఆరంభిస్తుంది. మగ పిల్లల్లో వై క్రోమోజోమ్‌లోని ఒక భాగం బీజకోశాన్ని వృషణాలుగా మారేలా చేస్తుంది. ఇవి మగ హార్మోన్‌ అయిన టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్‌ చురుకైన డైహైడ్రోటెస్టోస్టిరాన్‌గా మారుతుంది. దీని ప్రభావంతోనే బీజకోశం వేగంగా వృద్ధి చెందుతూ.. అంగం, మూత్రమార్గం, వృషణాల తిత్తి ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఎక్కడ అస్తవ్యస్తమైనా లైంగిక అవయవాల అభివృద్ధి కుంటుపడుతుంది. దీంతో వివిధ సమస్యలు తలెత్తొచ్చు. జన్యు లోపాలు, కుటుంబ చరిత్ర, గర్భిణి వేసుకునే మందులు, రేడియేషన్‌, రసాయనాలు, పురుగు మందులు, కాలుష్యం  ప్రభావం వంటివెన్నో వీటికి దారితీయొచ్చు. ఇవన్నీ హార్మోన్లను అస్తవ్యస్తం చేసి పుట్టుకతోనే లైంగిక అవయవాల సమస్యలకు దారితీస్తాయి. వీటి గురించి అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం. ఎలాంటి సంకోచం లేకుండా పిల్లలకు తగిన చికిత్సలు చేయించటానికిది వీలు కల్పిస్తుంది.


1. మూత్రమార్గ సమస్యలు

సాధారణంగా అంగం ముందు భాగాన చివర్లో మూత్రమార్గం తెరచుకొని ఉంటుంది. కానీ కొందరికి అంగం కింది భాగాన తెరచుకోవచ్చు. దీన్నే హైపోస్పేడియాస్‌ అంటారు. ప్రతి 200 మందిలో ఒకరిలో ఇది కనిపిస్తుంటుంది. దీనికి కారణం మూత్ర మార్గం సరిగా ఏర్పడకపోవటం. చివరి వరకూ విస్తరించకుండా మధ్యలోనే ఆగిపోవటం. దీంతో అంగం ముందు భాగానికి దగ్గరగా, మధ్యలో, దూరంగా.. ఎక్కడైనా మూత్రమార్గం తెరచుకొని ఉండొచ్చు. హైపోస్పేడియాసిస్‌ గలవారిలో అంగం ఆకారమూ దెబ్బతింటుంది. కొందరికి పొట్టిగా ఉండొచ్చు. వంకరగా ఉండొచ్చు. ముఖ్యంగా మూత్రమార్గం మరీ వెనకగా గలవారిలో మరింత వంకర పోతుంది. అలాగే అంగం ముందు భాగం గుండ్రంగా కాకుండా చిక్కుడు గింజ ఆకారంలో ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. సాధారణంగా పిల్లలకు నాలుగేళ్ల వయసులో జననాంగాల తీరుపై అవగాహన ఏర్పడుతుంటుంది. మిగతావారికన్నా భిన్నంగా కనిపిస్తే పిల్లలు తమకేదో అయ్యిందనే భావనకు లోనవుతుంటారు. ఇది మానసిక సమస్యలకు దారితీయొచ్చు. ఇక పెద్దయ్యాక అంగం పొట్టిగా, వంకరగా ఉండటం వల్ల శృంగార జీవితమూ ప్రభావితం కావొచ్చు. రంధ్రం కిందికి ఉండటం వల్ల వీర్యం సరిగా స్ఖలించక సంతాన సమస్యలు ఎదురవ్వచ్చు. అందువల్ల హైపోస్పేడియాస్‌ను వీలైనంత చిన్న వయసులో సరిదిద్దటం అవసరం.

చికిత్స: అంగం ముందు భాగంలో, మధ్యలో తెరచుకున్న మార్గాలకు చికిత్స చేయటం తేలిక. అదే దూరంగా వృషణాల మధ్యలో గానీ మలద్వారం, వృషణాల మధ్యలో గానీ మార్గం తెరచుకొని ఉంటే చికిత్స కష్టమవుతుంది. అదృష్టవశాత్తు హైపోస్పేడియాస్‌ గలవారిలో 80% మందికి ముందు, మధ్య భాగంలోనే రంధ్రం ఉంటుంది. వీటిని శస్త్రచికిత్సతో సరిచేయటం కాస్త తేలికే. ఇందులో మూత్ర మార్గాన్ని అంగం చివరికి వరకూ పొడిగిస్తారు (యురెత్రోప్లాస్టీ). దీన్ని 6 నెలల నుంచి రెండేళ్ల వయసు వరకు ఎప్పుడైనా సరిచేయొచ్చు. అయితే చాలావరకు ఏడాది వయసులో చికిత్స చేస్తుంటారు. అంగం ముందు భాగానికి దగ్గర్లో రంధ్రం ఉంటే ఒక శస్త్రచికిత్సతోనే సరిదిద్దొచ్చు. ఒకవేళ రంధ్రం మధ్యలో, దూరంగా ఉన్నట్టయితే రెండు సార్లు శస్త్రచికిత్స అవసరమవుతుంది. ముందుగా అంగం వంకరను సరిచేసి, తర్వాత మూత్ర మార్గాన్నా చివరి వరకు తీసుకొస్తారు.

ఎలా చేస్తారు?: మూత్రమార్గం మధ్యలో ఆగిపోయినా దానికి సంబంధించిన కణజాలం (ప్లేట్‌) ఏర్పడి ఉంటుంది. ఇది వెడల్పుగా ఉంటే సరిచేయటం తేలిక. దీన్ని గొట్టంలాగా మలిచి సరిచేయొచ్చు (ట్యూబులరైజేషన్‌). ఒకవేళ ప్లేట్‌ పలుచగా ఉంటే.. దాన్ని మూత్రమార్గం కప్పుగా అలాగే వదిలేస్తారు. అంగం మీదుండే చర్మం లోపలి భాగాన్ని తీసుకొచ్చి, మూత్రమార్గంలా మలచి, అమరుస్తారు (ఆగ్మెంటేషన్‌). ప్లేట్‌ అసలే లేనివారికీ ఇలాగే చర్మం లోపలి భాగాన్ని గానీ పై భాగాన్ని గానీ కత్తిరించి, గొట్టంలా మలచి అమరుస్తారు (రిప్లేస్‌మెంట్‌). ఒకవేళ అంగం దగ్గరి కణజాలం పనికి రానట్టయితే కింది పెదవి లోపల నుంచి గానీ దవడల లోపల నుంచి గానీ పొరను (ఫ్రీగ్రాఫ్ట్‌) కత్తిరించి తెచ్చి, మూత్రమార్గంలో అమరుస్తారు. ఇది ఆరు నెలల్లో అక్కడ అతుక్కుపోతుంది. తర్వాత ఈ పొరను గొట్టంలా మలచి, మూత్రమార్గంగా ఏర్పాటు చేస్తారు (బ్రాకా టెక్నిక్‌). అక్కడి కణజాలాన్నే ఉపయోగించటం వల్ల మున్ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. పెద్దయ్యాక అందరిలాగానే మామూలుగా శృంగార జీవితం గడుపుతారు. సంతానం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది పుట్టుకతో వచ్చే లోపం కాబట్టి పెద్దయ్యాక సరిచేసుకోవాలని అనుకుంటే పిల్లల శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించటమే మంచిది.

కొందరికి అంగం పైభాగాన రంధ్రం (ఎపిస్పేడియాస్‌) ఉండొచ్చు. ఇందులో మూత్రమార్గాన్ని ఏర్పాటు చేయటంతో పాటు దాన్ని కిందికి తీసుకొచ్చి, అంగం మధ్యలో ఉండేలా అమర్చాల్సి ఉంటుంది.


2. చర్మం బిగువు

పుట్టినపుడు అంగం మీది చర్మం ముందు భాగానికి అతుక్కొని ఉంటుంది. ఇది పిల్లలు ఎదుగుతున్నకొద్దీ.. ఒకట్రెండు ఏళ్ల నుంచి నాలుగేళ్ల వరకు వదులవుతూ వస్తుంటుంది. కానీ కొందరికి చర్మం బిగుతుగా, అలాగే అతుక్కొని ఉండొచ్చు. అంటే చర్మం వెనక్కి రాదన్నమాట (ఫైమోసిస్‌). దీంతో కొందరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవచ్చు. కొందరికి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. చర్మం వెనక్కి రాకపోవటం వల్ల మృత కణాలు చర్మం కింద పేరుకొని బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. కొందరికి అంగం ముందు భాగంలో వాపు సైతం తలెత్తొచ్చు. తరచూ అంగాన్ని చేత్తో ముట్టుకోవటం, మూత్రం పోస్తున్నప్పుడు ముందు భాగం బెలూన్‌లా ఉబ్బటం, తరచూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు రావటం, మూత్రం ధారగా కాకుండా చుక్కలు చుక్కలుగా పడటం.. వంటి లక్షణాలు కనిపిస్తే సత్వరం చికిత్స అవసరం. నాలుగేళ్లు దాటితే ఇలాంటి లక్షణాలేవీ లేకపోయినా చికిత్స తప్పనిసరి.

చికిత్స: రెండేళ్ల వయసు వరకు స్టిరాయిడ్‌, యాంటీబయోటిక్‌ మందులతో కూడిన మలాములు ఉపయోగపడతాయి. వీటిని అంగం ముందు భాగానికి రాయాల్సి ఉంటుంది. ఇవి నెమ్మదిగా లోపలికి వెళ్లి, చర్మం వదులయ్యేలా చేస్తాయి. మూడేళ్లు దాటిన వారికివి అంతగా పనిచేయవు. అందువల్ల నాలుగేళ్లు దాటినా సమస్య అలాగే ఉంటే సున్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో అంగం ముందు చర్మాన్ని ప్రత్యేకమైన పద్ధతిలో గుండ్రంగా కత్తిరిస్తారు. దీంతో సమస్య తగ్గిపోతుంది.


3. చిన్న అంగం

అంగం చిన్నగా ఉండటం మరో సమస్య. కొందరికి అంగం మీద కొవ్వు ఎక్కువగా ఉండటం, చర్మం పరచుకొని ఉండటం వల్ల పైకి అంతగా కనిపించదు. దీన్ని సూడో మైక్రోపెనిస్‌ అంటారు. ఇలాంటి వారికి శస్త్రచికిత్సతో చర్మాన్ని తొలగించి, అంగాన్ని తిరిగి పైకి తేవొచ్చు. కొందరికి నిజంగానే అంగం చిన్నగా ఉండొచ్చు (మైక్రోపెనిస్‌). వీరిలో అంగం ముందు భాగం వృషణాల తిత్తికి చాలా దగ్గరగా పైకి కనిపిస్తుంటుంది. దీనికి చాలావరకు హైపోథలమస్‌-పిట్యుటరీ గ్రంథి-బీజకోశ చట్రం అస్తవ్యస్తం కావటమే కారణం. టెస్టోస్టిరాన్‌ తగినంత ఉత్పత్తి కాకపోయినా, టెస్టోస్టిరాన్‌ను డైహైడ్రోటెస్ట్టోస్టిరాన్‌గా మార్చే ఎంజైమ్‌ లోపించినా, బీజకోశం మీద టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ గ్రాహకాలు లేకపోయినా అంగం పెరగదు. దీంతో చిన్నగా కనిపిస్తుంది.

చికిత్స: అంగం చిన్నగా ఉన్నవారికి టెస్టోస్టీరాన్‌తో పొడవు పెరిగేలా చేయొచ్చు. నేరుగా టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు ఇవ్వచ్చు. లేదా పిల్లల శరీరమే ఈ హార్మోన్‌ను తయారు చేసుకునేలా ప్రేరేపించొచ్చు. దీంతో క్రమంగా అంగం పరిమాణం పెరుగుతూ వస్తుంది. అయితే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ గ్రాహకాలు లేకపోతే మాత్రం కష్టం. వీరికి పెద్దయ్యాక అంగం ఇంప్లాంట్‌తో కృత్రిమంగా స్తంభనలు వచ్చేలా చేయొచ్చు.


4. వృషణాల కింద

దీన్నే స్క్రోటల్‌ ట్రాన్స్‌పొజిషన్‌ అంటారు. సాధారణంగా వృషణాల తిత్తి పైభాగాన అంగం ఉంటుంది. కానీ ఇందులో వృషణాల తిత్తి మధ్యలో లేదా కింద అంగం ఉంటుంది. దీన్ని సుమారు 12-16 నెలల వయసులో శస్త్రచికిత్సతో సరిచేయాల్సి ఉంటుంది. అంగాన్ని మార్చటానికి వీలుండదు గానీ వృషణాల తిత్తిని కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో అంగం పైకి వచ్చినట్టు కనిపిస్తుంది.

* కొందరికి వృషణాల తిత్తి విడిపోయి, అంటే రెండు భాగాలుగా ఉంటుంది (బైఫిడ్‌ స్క్రోటమ్‌). దీంతో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. వీరికి రెండు భాగాలను కలిపి, ఒకే తిత్తిలా మార్చాల్సి ఉంటుంది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.