
బిజినెస్
ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఎంతోమందికి ఇష్టమైన పథకం. వీటిపైనే ఆధారపడి ఆదాయం పొందుతున్న వారెంతోమంది. నష్టభయం లేకపోవడం, వడ్డీకి హామీ ఉండటం, కావాల్సినప్పుడు వెనక్కి తీసుకునే సౌలభ్యం.. ఇవే ఎఫ్డీలకు అంత ఆదరణ లభించేందుకు కారణం. గత కొంతకాలంగా వీటిపై వడ్డీ మరీ నామమాత్రంగా ఉంటోంది. మరి, ఉన్నంతలో మంచి రాబడిని ఆర్జించాలంటే.. ఏం చేయాలి? ఇందులో ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేట్ డిపాజిట్లలో ఏది ఎంచుకోవాలి? తెలుసుకుందాం..
మూడేళ్ల వ్యవధికి ఎఫ్డీ చేస్తే చాలా బ్యాంకుల్లో 5.25శాతం వరకే వడ్డీ లభిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోల్చి చూస్తే.. ఇది ప్రతికూల రాబడే అనుకోవచ్చు. పైగా పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఇది మరింత తక్కువే ఉంటుంది. దీంతో చాలామంది ఎఫ్‌డీల్లో జమ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే, కొన్ని వ్యూహాలను పాటిస్తే.. ఈ పథకాల్లోనూ కాస్త అధిక రాబడిని ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. అధిక వడ్డీ వచ్చే వ్యవధులను ఎంచుకోవడం, కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించడంలాంటివి చేయొచ్చు. దీంతోపాటు ఫ్లోటింగ్ రేట్ టర్మ్ డిపాజిట్ స్కీంను ఎంచుకోవడం ద్వారా సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే మంచి రాబడికి అవకాశం ఉంటుంది.
స్థిర వడ్డీ వచ్చేలా..
పేరులోనే ఉన్నట్లు.. సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఎంచుకుంటే.. వ్యవధి మొత్తం ఒకే తరహా వడ్డీ రేటు అందుతుంది. ఉదాహరణకు మూడేళ్ల వ్యవధికి 5.5శాతం వడ్డీకి ఫిక్స్డ్ చేశారనుకుందాం. అప్పుడు వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ఇదే వడ్డీ వ్యవధి పూర్తయ్యే వరకూ అందుతుంది. ఒకవేళ వ్యవధికి ముందుగానే ఎఫ్డీని రద్దు చేసుకుంటే.. వడ్డీలో కొంత అపరాధ రుసుముగా వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇది దాదాపు 1 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి, ఈ డిపాజిట్లను ఎంచుకునేటప్పుడు మీ అవసరాలనూ పరిగణనలోనికి తీసుకోవాలి. మధ్యలో డిపాజిట్‌ను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అవసరాన్ని బట్టి, వేర్వేరు వ్యవధులకు డిపాజిట్ చేయడం మరో వ్యూహం. దీనివల్ల పెరుగుతున్న వడ్డీ రేట్లను బట్టి తిరిగి పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుంది. వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో తక్కువ వ్యవధికి ఎంచుకోవచ్చు.
ప్రామాణిక సూచీతో...
ప్రామాణిక సూచీకి అనుసంధానించిన వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేట్ టర్మ్ డిపాజిట్ (ఎఫ్ఆర్టీడీ) చేసినప్పుడు వడ్డీ రేట్లు పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. ప్రామాణిక సూచీ రేటు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దీని ఆధారంగా ఎఫ్ఆర్టీడీ వడ్డీ రేటులోనూ కదలిక ఉంటుంది. ట్రెజరీ బిల్ రేటు, రెపో రేటు తదితరాలతో ఈ ఎఫ్ఆర్టీడీ అనుసంధానమై ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు రెపో రేటు మీద 1 శాతం అధిక వడ్డీ ఇస్తానని చెప్పిందనుకుందాం. ఇప్పుడున్న రెపో 4 శాతం అనుకుంటే.. ఎఫ్ఆర్టీడీ వడ్డీ రేటు 5 శాతం అవుతుంది. ఒకవేళ రెపో రేటు 3 శాతానికి చేరితే.. వడ్డీ 4 శాతం అవుతుందన్నమాట. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనా ఉన్నప్పుడు ఎఫ్ఆర్టీడీని ఎంచుకోవడమే మేలు. వడ్డీ రేటు పెరిగినప్పుడు పాత డిపాజిట్‌ను రద్దు చేసుకొని, కొత్తగా ఎఫ్డీ చేయాల్సిన అవసరం ఉండదు. వడ్డీ రేట్లు క్షీణించే పరిస్థితుల్లో ఇది అంత అనుకూలం కాదు.
ఏది మేలు..
సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే.. ఎఫ్ఆర్టీడీలపై వచ్చే వడ్డీ తక్కువే. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు నిర్ణీత వ్యవధికి చేసిన డిపాజిట్లపై తక్కువ వడ్డీ లభిస్తుంది. ఇలాంటప్పుడు ఎఫ్ఆర్టీడీలను పరిశీలించాలి. రెండింటిలోనూ ఉన్న మంచి చెడులను విశ్లేషించి, ఏది మనకు అత్యంత అనుకూలమో చూసుకోవాలి. అప్పుడే డిపాజిట్లపై అధిక వడ్డీని ఆర్జించవచ్చు.
- అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్.కామ్
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?