
బిజినెస్
దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో బజాజ్ ఆటో రూ.1,430 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.1,716 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం తక్కువ. విక్రయాలు తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.8,910 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.9,022 కోట్లకు చేరింది. అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 13,06,810 నుంచి 10 శాతం తగ్గి 11,81,361కు పరిమితమయ్యాయి. దేశీయ మోటార్‌సైకిల్ విపణి 2020-21 మూడో త్రైమాసికంతో పోలిస్తే, ఈసారి 23 శాతం క్షీణత నమోదు చేయగా, బజాజ్ ఆటో విక్రయాలు 20 శాతం తగ్గి, 4,69,000 వాహనాలకు పరిమితమయ్యాయని కంపెనీ తెలిపింది. దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాలు 5 శాతం పెరిగితే, బజాజ్ ఆటో 52 శాతం వృద్ధిని సాధించింది. ఈ విభాగంలో 71 శాతం వాటా కలిగి ఉన్నట్లు పేర్కొంది. నెలవారీ సరాసరి ఎగుమతులు 2,19,000కు మించి ఉంటున్నాయని తెలిపింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో మొత్తం 25 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేశామని, ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్థాయి అని కంపెనీ వివరించింది. 2021 డిసెంబరు 31 నాటికి కంపెనీ వద్ద రూ.17,883 కోట్ల నగదు నిల్వలున్నాయి.