ఉడుత చెప్పిన కథ

రాజసూయ యాగానంతరం ధర్మరాజు విరివిగా దానధర్మాలు చేశాడు. తనంత ఔదార్యం మరెవరికీ ఉండదని గర్వించసాగాడు.. అది పసిగట్టిన శ్రీకృష్ణుడు సగం శరీరం బంగారురంగులో ఉన్న ఉడుతను తెప్పించాడు. అది బంగారురంగు లేని శరీరభాగాన్ని నేలమీద పొర్లించసాగింది. ధర్మజుడు ఆశ్చర్యపోగా ఆ ఉడుత ‘ధర్మరాజా! నేనో నిరుపేద బ్రాహ్మణుడింట్లో చెట్టుపై నివసించేదాన్ని. ఆ ఇంట్లో ఉండే నలుగురూ అగ్రహారంలో యాచించి జీవించేవారు. ఒకరోజు భిక్ష దొరకక పొలాల్లో రాలిపడిన ధాన్యాన్ని ఏరి తెచ్చి వండగా నాలుగు ముద్దలయ్యింది. మనసులోనే భగవంతుడికర్పించి, తినడానికి ఉపక్రమించారు. అప్పుడే ఓ సన్యాసి ‘భిక్షాందేహి’ అనడంతో ఆహారాన్ని త్యాగంచేశారు. అతను ఆశీర్వదించడంతో వారు శ్రీమంతులయ్యారు. పూరిల్లు స్వర్ణమయమైంది. ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేయడాన మహర్దశ పట్టింది. అదంతా చూసి సంతోషం కలిగి అక్కడ పడిన రెండు మెతుకులు తిని ఆ పవిత్ర ప్రదేశంలో పొర్లాడాను. దాంతో సగం శరీరం స్వర్ణమయమైంది.. అలాంటి దానధర్మాలు జరిగిన ప్రదేశం మళ్లీ ఎక్కడైనా కనబడితే తక్కినభాగాన్ని నేలమీద పొర్లించి స్వర్ణమయం చేసుకోవాలని, దానధర్మాలు జరిగిన ప్రదేశాలను సందర్శిస్తూ ఇక్కడికొచ్చి ప్రయత్నించాను. కానీ ఫలితం శూన్యం’ అంది ఉడుత. అది విన్న ధర్మరాజు ‘తన దానాలు కష్టార్జితం కాదు, ప్రజల సొమ్ము. ఇందులో త్యాగం లేదు. పైగా లోకాదరణ ఆశించి చేసినవి’ అని పశ్చాత్తాపం చెందాడు. కృష్ణుడి మాయను గ్రహించి క్షమాపణ చెప్పాడు.

- పరాశరం సచ్చిదానందమూర్తి


మరిన్ని