మంచి సినిమా తీస్తే.. చూస్తామనే నమ్మకం ఇచ్చారు

- నాగార్జున

‘‘సీతారామం’ చూసి చాలా ఈర్ష్య పడ్డా. నాకు రావాల్సిన పాత్ర దుల్కర్‌కు వెళ్లింది (నవ్వుతూ). ‘గీతాంజలి’, ‘సంతోషం’, ‘మన్మథుడు’ రోజులు గుర్తుకు వచ్చాయి’’ అన్నారు కథానాయకుడు నాగార్జున. ఆయన గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘సీతారామం’ విజయోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి తెరకెక్కించారు. అశ్వినీదత్‌ నిర్మాత. రష్మిక, సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో గురువారం సక్సెస్‌ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘వైజయంతి బ్యానర్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్న స్వప్న, ప్రియాంకకు కృతజ్ఞతలు. అశ్వినీదత్‌కు వారిద్దరూ పెద్ద అండ. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’ ఇప్పుడు ‘సీతారామం’.. వరుసగా అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. దర్శకుడు హను కళాత్మకంగా, అద్భుతంగా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంది. ద్వితీయార్థం అత్యద్భుతం. ఇలాంటి సినిమా తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులైంది. మృణాల్‌ పాత్రతో ప్రేమలో పడిపోయా. తను తెరపై అంత అందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గతవారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాల్ని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు’’ అన్నారు.  ‘‘నా కెరీర్‌లో రామ్‌ పాత్ర చాలా స్పెషల్‌. ఇంత గొప్ప పాత్ర రాసిన హనుకు థ్యాంక్స్‌. సీత పాత్రతో ప్రేక్షకులు ప్రేమలో పడ్డారు. మాకింత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హీరో దుల్కర్‌ సల్మాన్‌. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘5వ తేదీ నుంచి నేనొక ఊహా ప్రపంచంలో బతుకుతున్నట్లుగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. నాలుగు సినిమాలు తీశాను. తొలిసారి ఇంతటి ఆదరణ చూస్తున్నా. ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్‌ ఇది. ఈ కథ దృశ్య రూపంలోకి మారడం వెనక చాలా మంది కృషి ఉంది. వారందరికీ పేరు పేరునా థ్యాంక్స్‌’’ అన్నారు.

‘‘నాగార్జున మా హీరో. మా బ్యానర్‌లో అత్యధికంగా ఐదు సినిమాలు చేశారు. ‘సీతారామం’ తీస్తున్నప్పుడు నాగార్జునే గుర్తొచ్చారు’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్‌. ‘‘సీత లాంటి ఐకానిక్‌ పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అంది నాయిక మృణాల్‌ ఠాకూర్‌. ఈ కార్యక్రమంలో స్వప్న దత్‌, ప్రియాంక దత్‌, ఎన్వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని