ఉపాధి విప్లవం.. ఆంధ్రా సుగర్స్‌

సంస్థ 75 వసంతాల వేడుకల్లో సీఎండీ నరేంద్రనాథ్‌ చౌదరి వెల్లడి

తణుకు, న్యూస్‌టుడే: స్వాతంత్య్రానికి ముందే పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు, ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో ఆంధ్రా సుగర్స్‌ కర్మాగారం స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారని సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెండ్యాల నరేంద్రనాథ్‌ చౌదరి తెలిపారు. వ్యవసాయ-పారిశ్రామిక విప్లవం తెచ్చారని కొనియాడారు. కర్మాగారం స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక సంస్థ ఆవరణలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య అందించిన సాంకేతిక సహకారంతో వెంకటరాయపురం కేంద్రంగా ఆరు ప్రాంతాల్లో వివిధ అనుబంధ పరిశ్రమలను స్థాపించారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించారు. చెరకు క్రషింగ్‌ సామర్థ్యాన్ని 600 టన్నుల నుంచి 16 వేల టన్నులకు పెంచి, భీమడోలు, తాడువాయి ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు స్థాపించారు. కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌, బల్క్‌ డ్రగ్‌ రాకెట్‌ ఇంధన ఉత్పత్తిలోనూ ఖ్యాతి గాంచారు. విద్యా సంస్థలు, మెడికల్‌ కళాశాలలు, ఆసుపత్రులు నిర్మించారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదట పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు, డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరిద్దరి పేరుపై స్మారక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రాసుగర్స్‌ అనుబంధ సంస్థల్లో 40 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు ముళ్లపూడి నరేంద్రనాథ్‌, పెండ్యాల అచ్యుతరామయ్య, ముళ్లపూడి తిమ్మరాజా తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని