close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మొక్కలతో దీపావళి!

వెలుగుల దీపావళి వచ్చేసింది. ఈ పండగ మీ చిన్నారులకు చక్కని పాఠాలు చెప్పేదిగా ఉండాలి. అలా కావాలంటే ఇవి ప్రయత్నించండి మరి. 

పిల్లలకు దీపావళి ప్రత్యేకతలు తెలియజేసే కథలు చెప్పండి. నరకాసుర సంహారం, రాముడు అయోధ్యకు సీతతో రావడం...వంటి వాటిని చెప్పి ఈ పాత్రలతో మీకు దగ్గర్లోని చిన్నారులతో ఓ నాటకం వేయించేందుకు ప్రయత్నించండి. ఇది వారికి పండగ విశిష్టత తెలియజేయడమే కాదు... వారి ప్రతిభనూ వెలికితీస్తుంది.

ఇంటిని శుభ్రం చేయడంలో, అలంకరించడంలో వారిని భాగం చేయండి. తోరణాలు కట్టడం, రంగోలీ, ప్రమిదలకు రంగులు వేయడం, దీపాల వరసలు పేర్చడం వంటి వాటిలో వారిని భాగస్వామ్యం చేయండి. ఇది వారిలో సృజనాత్మకతను, బాధ్యతను పెంచుతుంది. వారి సామర్థ్యం ఏంటో మీకూ అర్థం అవుతుంది. వారు బాగా చేస్తే ప్రశంసించడం మాత్రం మరిచిపోకండి.

పండగ రోజు దగ్గర్లో ఉన్న ఆనాథాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలను సందర్శించడానికి ప్రయత్నించండి. పిల్లలకు పాత దుస్తులు, ఆట వస్తువులు, వారి పుస్తకాలను దానం చేయడం నేర్పించండి. ఇటువంటివి వారికి సమాజంలోని అసమానతల గురించి తెలియజేస్తాయి.

సన్నిహితులు, స్నేహితుల కోసం గ్రీటింగ్‌ కార్డ్స్‌ వంటివి చేయమని ఓ టాస్క్‌ అప్పజెప్పి వాటికి కావాల్సిన వస్తువులు సమకూర్చండి. అవి ఇంటికి వచ్చే బంధువులనూ సంతృప్తి పరుస్తాయి. ప్రత్యేక వంటకాలు చేసే సమయంలో చిన్న చిన్న రెసిపీలు చేయడం నేర్పించండి. ఇది వారి ఊహాశక్తిని పెంపొందిస్తుంది.

పండగ రోజు ఇంటికి ఎంతో మంది అతిథులు వస్తుంటారు. వారిని పలకరించడం, మర్యాదలు చేయడం వంటివి వారినే చూడమనండి. ఇది వారిలో సామాజిక నైపుణ్యాలను పెంచుతుంది.

క్రాకర్స్‌ కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి వారికి వివరించండి. కాకరపువ్వొత్తులు వంటి చిన్న చిన్న వాటిని కాల్చడానికి పరిమితం చేయండి. వీటికి బదులు వారితో మొక్కలు నాటించేందుకు ప్రయత్నించండి.


మరిన్ని