close

తాజా వార్తలు

ఆమె కోసం.. అగ్ర వినోదం!

‘మహిళా సాధికారత’పై పెద్ద హీరోల చిత్రాలు
‘నేర్‌కొండ పార్వై’తో అజిత్‌ శుభారంభం
అదే బాటలో నడుస్తున్న విజయ్, శశికుమార్‌

 అజిత్‌

ఒకప్పుడు ‘మగళీర్‌ మట్టుం’ వంటి పలు చిత్రాలు మహిళా సాధికారత కోసం వెండితెరపైకి వచ్చాయి. మరికొన్ని సినిమాలు స్త్రీవాదాన్ని చాటాయి. అలాగే పురుషాధిక్యాన్ని ప్రశ్నించాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా సినిమాలు కూడా తెరపైకి వచ్చి విజయాన్ని సాధిస్తున్నాయి. వీటన్నింటిలోనూ హీరోయిన్లే నటించారు. అలా.. మహిళాలోకం ప్రత్యేకతను చాటారు. కానీ ఇప్పుడు మహిళల కోసం అగ్ర హీరోలు కదం తొక్కుతున్నారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు, వారి గురించి జరుగుతున్న తప్పుడు అభిప్రాయాలను ఎండగడుతున్నారు. తాజాగా వచ్చిన ‘నేర్‌కొండ పార్వై’ చిత్రమే అందుకు నిదర్శనం. అజిత్‌ వంటి గొప్ప స్టార్‌డం ఉన్న హీరో ఇందులో నటించడంతో ఇప్పుడు ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. మహిళా క్రీడాకారుల ప్రత్యేకతను చాటే ‘బిగిల్‌’ చిత్రంలో విజయ్‌ నటిస్తున్నారు. అలాగే శశికుమార్‌ కూడా ఇలాంటి కథతో అడుగులేస్తున్నారు. ఆ విశేషాలపై ‘న్యూస్‌టుడే’ కథనమిది.. - కోడంబాక్కం, న్యూస్‌టుడే

నేర్‌కొండ పార్వై.. ఇటీవల విడుదలైన ఈ సినిమా మహిళలకు తమ సంక్షేమ ఆయుధంగా మారింది. ఓ స్త్రీ.. వేశ్య అయినప్పటికీ ఆమె ఇష్టం లేకుండా చేయివేయడం క్షమించరాని నేరమే అని చాటిచెప్పే రెండున్నర గంటల నిడివి ఉన్న చిత్రమిది. కమర్షియల్‌ అంశాలు అంతగా లేకపోయినప్పటికీ అజిత్‌ వంటి హీరోగా ఇందులో నటించడం గొప్ప విషయంగా మారింది. ‘నో మీన్స్‌ నో..’ అని చెప్పే డైలాగుకు థియేటర్‌లో ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. నేటితరం అమ్మాయిలకు ఇదో మంచి పాఠంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘తల’ అజిత్‌ ఓ సోదరుడిలా ఈ చిత్రం ద్వారా పలు ముఖ్యమైన ‘కండీషన్స్‌’లను చెబుతున్నారు. సభ్యత లేని ఓ అమ్మాయి పక్షాన నిలిచే ఈ కథలో అజిత్‌ నటించాలా?.. అలాంటి సినిమాను గొప్పగా భావించాలా?... అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అలాంటి విశ్లేషకులపై ఇప్పటికే గాయని చిన్మయి, వరలక్ష్మి తదితరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఓ మహిళ భద్రతకు, ఆమె ఇష్టాఇష్టాలకు ప్రాముఖ్యతను ఇచ్చే ఇలాంటి సినిమాలో అజిత్‌ నటించడమే గొప్ప విషయమని వాళ్లు అభినందిస్తున్నారు.

‘బిగిల్‌’

సింహంలాంటి స్త్రీ..

విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘బిగిల్‌’ కోసం కూడా ఆయన అభిమానులతోపాటు మహిళాలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కూడా మహిళల ప్రాముఖ్యతను చాటేది కావడమే. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. మహిళా ఫుట్‌బాల్‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సింగపెన్నే..’ (సింహంలాంటి స్త్రీ) అనే పాట బాగా విజయం సాధించింది. ‘ఓ ఆడ సింహమా.. యావత్‌ మగజాతి నిన్ను కీర్తిస్తుంది’, ‘నిన్ను అబల అంటూ హేళన చేసిన ఈ ప్రజ.. నిన్ను గౌరవిస్తుంది’.. ఇలా పాలలోని సాహిత్యం ఆకట్టుకుంటోంది. ఏకంగా స్త్రీ ఖ్యాతిని చాటుతూ ఓ అద్భుతమైన పాట రావడం కూడా గొప్ప విషయమేనని అభినందిస్తున్నారు విశ్లేషకులు. అందువల్ల మహిళా లోకం ఎంతో ఆసక్తిగా చిత్రం కోసం ఎదురుచూస్తోంది. వెండితెరపై అజిత్, విజయ్‌లే ఇలాంటి చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం.

‘కెన్నడి క్లబ్‌’

కబడ్డీ క్రీడాకారిణులపై..

మహిళా కబడ్డీతో ‘కెన్నడి క్లబ్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సుశీంద్రన్‌. ఇందులో శశికుమార్‌ కోచ్‌ పాత్రలో నటించారు. సీనియర్‌ దర్శకుడు భారతిరాజా కూడా ముఖ్యపాత్ర పోషించారు. నిజమైన కబడ్డీ క్రీడాకారులు పలువురు ఈ చిత్రంలో నటించడం విశేషం. తమిళ సంస్కృతితో పాటు, కబడ్డీ ప్రాధాన్యం, మహిళల గొప్పతనాన్ని చాటే చిత్రమని ఇప్పటికే సుశీంద్రన్‌ స్పష్టం చేశారు. సినిమాను చూసి భారతిరాజా కూడా సంతోషపడ్డారు. చిత్రంలో నటించిన కబడ్డీ క్రీడాకారిణులను పిలిపించి విందు కూడా ఇచ్చారు. ఈ సినిమాతో మహిళా క్రీడాకారిణులపై గౌరవం పెరుగుతుందని కూడా ఆయన చెప్పారు. మరోవైపు గత ఏడాది గ్రామంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మహిళా క్రికెటర్‌ కథాంశమున్న ‘కనా’ చిత్రాన్ని నటుడు శివకార్తికేయన్‌ నిర్మించిన విషయం తెలిసిందే. ఇలా ఆయన కూడా మహిళలపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్‌ అవుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు