close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మా అమ్మాయి కోహ్లీకి వీరాభిమాని!

నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఐపీఎల్‌ పోరులో సంచలనాలు సృష్టిస్తున్నాడు హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు సారథి డేవిడ్‌ వార్నర్‌. ఈ లీగ్‌లో విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా 50 సార్లు 50కిపైగా పరుగులు చేసిన ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్‌ బాదుడుతో దూసుకుపోతున్న వార్నర్‌ గురించి మరిన్ని విషయాలు...

నేను ఆర్థికంగా ఏ స్థాయికి వెళ్లినా నా మూలాలను మాత్రం అస్సలు మర్చిపోను. నేను పుట్టి పెరిగింది సిడ్నీలోని నిరుపేద కుటుంబంలో. నాకు చిన్నప్పట్నుంచీ క్రికెట్‌ అంటే ఇష్టం. అది గమనించిన అమ్మానాన్నలు అతికష్టం మీద ఓ బ్యాటును కొనిచ్చారు. విరిగితే మళ్లీ ఇంకోటి కొనివ్వలేరని ఎవర్నీ తాకనిచ్చేవాడిని కాదు. చాలా సున్నితంగా బ్యాటింగ్‌ చేసేవాడిని. పైగా పాకెట్‌మనీ కోసం స్కూల్‌ అయ్యాక మా వీధి చివర్న ఓ సూపర్‌మార్కెట్‌లో తెల్లవారు జామున మూడింటి వరకూ పని చేసేవాడిని. ప్రతి శని, ఆదివారాల్లో ఇంటింటికీ తిరిగి న్యూస్‌ పేపర్లు వేసేవాడిని.

వెతుక్కుంటూ వచ్చారు...
నేను స్కూల్‌లో ఉన్నప్పుడు పుస్తకాల కంటే ఎక్కువగా బ్యాట్‌నే పట్టుకుని ఉండేవాడిని. ఎందుకో మా క్లాస్‌ టీచర్‌కి అది నచ్చేది కాదు. ‘పుస్తకాలు వదిలి గ్రౌండ్‌లో ఉన్నంత మాత్రాన క్రికెటర్‌ అవ్వలేరు’ అంటూ ఎప్పుడూ విమర్శించేవారు. అయితే నేను 132 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో ఎలాంటి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లూ ఆడకుండా నేరుగా జట్టులో చోటు దక్కించుకున్నా. ఈ తరవాత మా టీచర్‌ నన్ను వెతుక్కుంటూ మా ఇంటికొచ్చి ‘విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడంలో నేను ఫెయిల్‌ అయ్యా...’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు, నీ ప్రోగ్రెస్‌ కార్డులో అన్నీ సున్నాలే ఉండేవి, ఇప్పుడు నీ ఆదాయంలో కూడా బోలెడు సున్నాలు ఉన్నాయంటూ చమత్కరించారు.

కోహ్లీకి వీరాభిమాని...

నేనూ క్రికెటర్‌నే అయినా మా రెండో అమ్మాయి ఇవీ మే మాత్రం భారత జట్టు సారథి విరాట్‌కోహ్లీకి వీరాభిమాని. కోహ్లీ మ్యాచ్‌ అంటే రెప్పవాల్చకుండా చూస్తుంది. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ్‌ అంటే ‘నేను విరాట్‌ కోహ్లీని అవుతా’ అని చెబుతూ... అతని స్టైల్‌లో బ్యాటింగ్‌ చేసి చూపుతుంది.

చాలా మారా...
క్రికెట్‌లోకి వచ్చిన తొలినాళ్లలో నేను చాలా కోపిష్ఠిని. ప్రతి విషయంలో దూకుడుగా ఉండేవాడిని. కొన్ని కొన్ని సార్లు మైదానంలోనే ఆవేశాన్ని వెళ్లగక్కేవాడిని. ఆ కారణంగానే చాలా మ్యాచ్‌లకి ఎంపికవ్వలేదు. ఆ తరవాత కష్టపడి దాన్ని తగ్గించుకున్నా. ఆ విషయంలో నా భార్య ఎంతో సాయపడింది. ప్రస్తుతం శాంతమూర్తిలా మారిపోయానని చెప్పాలి.

వాళ్లే ప్రపంచం...
నాభార్య క్యాండిస్‌ ఫాల్జన్‌... తను ఫిట్‌నెస్‌ మోడల్‌. ‘ఐరన్‌ ఉమన్‌’ టైటిల్‌నీ గెలుచుకుంది. మాది ప్రేమ వివాహం. పెళ్లి తరవాత కుటుంబాన్ని చూసుకుంటూ... స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తోంది. మాకు ముగ్గురు ఆడపిల్లలు. ఆట తరవాత వాళ్లే నా ప్రపంచం. మా అమ్మకి ప్రతిరూపాలైన వాళ్లని బాగా చదివించాలనేది నా కోరిక.

ఖాళీగా ఉంటే...

గోల్ఫ్‌ ఆడతా, ఈత కొడతా... నాకు ఇష్టమైన రచనలు చేస్తా. జెన్నీఫర్‌ ఆనిస్టిన్‌ సినిమాలు ఎక్కువగా చూస్తా. అలానే మా పిల్లలతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తా. టిక్‌టాక్‌ అంటే గుర్తొచ్చింది... లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండి ‘బుట్టబొమ్మా’, ‘బాహుబలి’ స్పూఫ్స్‌ చేసినప్పుడు తెలుగువారు నన్ను మరింతగా ఓన్‌ చేసుకున్నారు. నా ఖాతాలో తెలుగువాళ్లే ఎక్కువ మంది ఫాలోవర్లుగా ఉన్నారు. అలాంటి వీడియోలు వేరే ఫ్లాట్‌ఫామ్‌లో చేయమని చాలామంది అభిమానులు అడుగుతున్నారు.

వర్కవుట్స్‌...
రాత్రిపూట ఎన్ని గంటలకి పడుకున్నా పొద్దునే ఐదు గంటలకి నిద్రలేచి వ్యాయామం చేస్తా. బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ ఎక్కువగా చేసి కండర పుష్టిని పెంచుకుంటా. ఆర్గానిక్‌ ఫుడ్‌నే తీసుకుంటా. రోజువారీ ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ ఉండేలా చూసుకుంటా. జంక్‌ఫుడ్‌ జోలికి అస్సలు వెళ్లను. మా పిల్లలకి కూడా అలవాటు చేయలేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు