close

ఆంధ్రప్రదేశ్

కొత్త సీఎం ఎవరు?

అన్వేషణలో భాజపా, సంకీర్ణ పక్షాలు
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలంటున్న కాంగ్రెస్‌
  కమలదళంలో దిగంబర్‌ కామత్‌ చేరికపై జోరుగా వదంతులు

పనాజీ: ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మృతి నేపథ్యంలో గోవా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొత్త సీఎం అన్వేషణలో భాజపా, సంకీర్ణ పక్షాలు ఉండగా...నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ తమనే ఆహ్వానించాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటోంది. మొత్తం 40 మంది సభ్యులుండాల్సిన గోవా శాసనసభలో ప్రస్తుతం 36 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్సిస్‌ డిసౌజా, ఆదివారం సీఎం పారికర్‌ మృతి చెందారు. వీరిద్దరూ భాజపా సభ్యులే. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..సుభాష్‌ శిరోద్కర్‌, దయానంద్‌ సప్తే గత ఏడాది తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. తాజా పరిస్థితుల్లో 14 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. భాజపా సంఖ్యా బలం 12 ఎమ్మెల్యేలకు పరిమితమయ్యింది.

ఫార్వార్డ్‌, ఎంజీపీల వైఖరి మారేనా?
ముగ్గురు చొప్పున ఎమ్మెల్యేలున్న గోవా ఫార్వార్డ్‌ పార్టీ, ఎంజీపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడు, ఎన్‌సీపీ ఏకైక ఎమ్మెల్యే భాజపా ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. అంటే సభలో భాజపా తాజా బలం 20 మంది సభ్యులు. వీరుగాక మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం పారికర్‌ మృతి నేపథ్యంలో ఇప్పటి వరకూ భాజపా సంకీర్ణ పక్షాలుగా ఉన్న గోవా ఫార్వార్డ్‌ పార్టీ, ఎంజీపీల నేతలు ఆదివారం సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గోవాకు రానున్నారు. భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి సోమవారం కొత్త సీఎం ఎంపికపై చర్చించనున్నాయి.

ప్రభుత్వం స్థిరంగానే ఉంటుంది: భాజపా
ఆదివారం ఉదయం నుంచి సీఎం పారికర్‌ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో భాజపా ఒక ప్రకటన చేసింది. గోవా రాజకీయాలు మార్పు దశలో ఉన్నాయని అంగీకరిస్తూనే రాష్ట్రంలో తమ ప్రభుత్వం సుస్థిరంగానే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్పుపై వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

భాజపాలోకి దిగంబర్‌ కామత్‌?
గోవా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ భాజపాలో చేరనున్నారని, ఆయనకు రాష్ట్రంలో కీలక పదవి అప్పగించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆదివారం ఆయన దిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ రకమైన  ప్రచారం జరిగింది. అయితే, గోవా భాజపా అధ్యక్షుడు వినయ్‌ తెందూల్కర్‌, దిగంబర్‌ కామత్‌ అవన్నీ వదంతులేనని తోసి పుచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు