Fuel Credit Cards: ఈ కార్డులతో ఇంధన ఖర్చును ఆదా చేసుకోవచ్చు! - Few-factors-you-must-keep-in-mind--before-applying-for-a-fuel-credit-card
close

Updated : 04/08/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Fuel Credit Cards: ఈ కార్డులతో ఇంధన ఖర్చును ఆదా చేసుకోవచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌జ‌ల జీవ‌న విధానంలో కొవిడ్‌-19 పెను మార్పులు తీసుకొచ్చింది. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా వ‌ర‌కు సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు ఇంటి నుంచే ప‌నిచేసే స‌దుపాయాన్ని క‌ల్పించాయి. విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బడుతున్నాయి. కార్యాల‌యాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. అయితే పూర్తిగా విప‌త్తు తొలిగిపోలేదు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం అవ‌స‌రం. మాస్కులు ధ‌రించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో చాలా మంది త‌మ సొంత వాహ‌నంలో ప్ర‌యాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఇంధ‌న వినియోగం పెరిగింది. మ‌రోవైపు ఇంధ‌న ధ‌ర‌లు కూడా రోజురోజుకీ పెరుగుతుండ‌డంతో ఈ ఖ‌ర్చు మ‌రింత భారంగా మారింది. మ‌రి ఈ ఖ‌ర్చుల నుంచి ఇంధ‌న క్రెడిట్ కార్డులు కొంతైన ఉప‌శ‌మ‌నం అందించ‌గ‌లుగుతాయా?

నిర్దిష్ట వినియోగ‌దారుల అవ‌స‌రాలు, ఖ‌ర్చు, అల‌వాట్ల‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ ర‌కాల క్రెడిట్ కార్డుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి క్రెడిట్ కార్డు జారీ సంస్థ‌లు. ఇంధ‌నంపై భారీగా ఖ‌ర్చు చేసే వారే ల‌క్ష్యంగా రూపొందించిన‌వే ఈ ఫ్యూయ‌ల్ బేస్డ్‌ క్రెడిట్‌ కార్డులు.

ఫ్యూయల్ బేస్డ్‌ కార్డులు, సాధార‌ణ క్రెడిట్ కార్డుల త‌ర‌హాలోనే ప‌నిచేస్తాయి. ఇంధ‌నం కొనుగోలు చేసిన‌ప్పుడు స‌ర్‌ఛార్జ్‌ను మిన‌హాయించ‌డంతో పాటు, రివార్డు పాయింట్లు, అధిక క్యాష్‌బ్యాక్‌లు కూడా పొంద‌వ‌చ్చు. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఎంచుకుంటే, భాగ‌స్వామ్య ఇంధ‌న సంస్థ‌.. ఎంచుకున్న అవుట్‌లెట్ల వ‌ద్ద మాత్ర‌మే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు పొందే వీలుంది.

ఫ్యూయ‌ల్ బేస్డ్‌ క్రెడిట్ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందు గుర్తించుకోవాల్సిన అంశాలు..

స‌ర్‌ఛార్జీ మిన‌హాయింపు..

చాలావ‌ర‌కు ఫ్యూయ‌ల్ బేస్డ్‌ క్రెడిట్ కార్డులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన‌ప్పుడు 3 శాతం వ‌ర‌కు స‌ర్‌ఛార్జ్ వ‌ర్తించవ‌చ్చు. మీ కార్డుపై కూడా ఈ స‌దుపాయం ఉంటే కొంత లేదా పూర్తి స‌ర్‌ఛార్జ్ మిన‌హాయింపు పొంద‌చ్చు. ఇది కార్డును బ‌ట్టి మారుతుంటుంది.

కో-బ్రాండెడ్ ఇంధ‌న‌ క్రెడిట్ కార్డులు..

* పెట్రోల్‌, డీజిల్ ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉండేవారికి, ఎప్పుడూ ఒకే బ్రాండ్‌ అవుట్‌లెట్‌ల‌లో పెట్రోల్ కొనుగోలు చేసేవారికి ఈ కో-బ్రాండెడ్ కార్డులు ఉప‌యోగ‌ప‌డతాయి. ఇంధ‌న ఖ‌ర్చుల‌ను కొంత మేర ఆదా చేసుకునేందుకు వీలుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీకు ఇండియన్ ఆయిల్ కో-బ్రాండెడ్ కార్డ్ ఉంటే, త‌ర‌చుగా ఇండియ‌న్ ఆయిల్ అవుట్‌లెట్‌లోనే పెట్రోల్‌, డీజిల్ వినియోగించుకోవాలి.

* కో-బ్రాండెడ్ కార్డుల విష‌యంలో భాగ‌స్వామి కాని రీఫిల్ స్టేష‌న్‌లో చేసే కొనుగోళ్ల‌పై లాయ‌ల్టీ రివార్డు పాయింట్లు వ‌చ్చే అవ‌కాశం లేనందున వినియోగ‌దారులు ఎక్కువ‌గా ఆయిల్ కొనుగోలు చేసే పంపును నిర్ధారించుకోవాలి. అలాగే ఖర్చు చేసిన మొత్తంపై రివార్డు పాయింట్లు పొంద‌గ‌ల లేదా రీడీఎమ్ చేసుకోగ‌ల‌ భాగ‌స్వామ్య ఆయిల్ పంపుల జాబితాను రూపొందించుకుని త‌గిన కార్డును తీసుకోవాలి.

జాయినింగ్ ఫీజు, వార్షిక రుసుములు..

* ఈ క్రెడిట్ కార్డుల‌పై జాయినింగ్ ఫీజు, వార్షిక రుసుములు వ‌ర్తిస్తాయి. ఈ రుసుముల కంటే స్వాగ‌త ప్ర‌యోజ‌నాలు, పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌నాలు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డు పాయింట్లు, ఓచ‌ర్లు సహా ఇత‌ర ప్ర‌యోజ‌నాలు ఎక్కువ‌గా ఉంటేనే క్రెడిట్ కార్డు వల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.

* వినియోగ‌దారుడు నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేస్తే వార్షిక రుసుమును మాఫీ చేస్తున్నాయి కొన్ని కార్డు జారీ సంస్థ‌లు. వార్షిక రుసుములు మాఫీ చేసేందుకు, కార్డు ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు.. జారీ సంస్థ నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌ల‌రో లేదో కూడా చూడాలి.

ఫైనాన్స్ ఛార్జీలు..

కార్డు బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించాలి. గ‌డువు తేది లోపు క్రెడిట్ కార్డు బిల్లుల‌ను పూర్తిగా చెల్లించ‌డంలో విఫలం అయితే ఫైనాన్షియ‌ల్ ఛార్జీల‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు కార్డు, అది జారీ చేసిన సంస్థ‌పై ఆధార‌ప‌డి 23 శాతం నుంచి 49 శాతం వ‌ర‌కు ఉంటాయి.

రివార్డు పాయింట్లు, వెల‌క‌మ్ బోన‌స్‌..

* సేక‌రించిన రివార్డు పాయింట్ల‌ను సాధార‌ణంగా భాగ‌స్వామ్య అవుట్‌లెట్స్ వ‌ద్ద వినియోగించాల్సి ఉంటుంది.  కానీ ఎంపిక చేసిన ఆన్‌లైన్ భాగ‌స్వామ్యులు లేదా గిఫ్ట్ ఓచ‌ర్ల రూపంలో రీడీఎమ్ చేసుకునేందుకు కొన్ని కార్డు జారీ సంస్థ‌లు అనుమ‌తిస్తున్నాయి.

* రివార్డు పాయింట్ల విష‌యంలో గుర్తించుకోవాల్సిన ముఖ్య విష‌యం ఎక్స్‌ప‌యిరీ డేట్‌. చాలా వ‌ర‌కు ఫ్యూయ‌ల్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల‌కు 2 నుంచి 3 సంవ‌త్స‌రాల గ‌డువు ఉంటుంది. కొన్ని జారీ సంస్థ‌లు గడువు తేదీ లేకుండానే కార్డుల‌ను జారీ చేస్తున్నాయి. రివార్డు పాయింట్ల‌కు సంబంధించి.. సేక‌రించ‌డం, రీడీఎమ్ చేసుకోవ‌డం, గ‌డువు తేది మొద‌లైన అంశాల‌పై వ‌ర్తించే నియ‌మ నిబంధ‌న‌లు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

* కొన్ని సంస్థ‌లు.. కొత్త‌గా కార్డు తీసుకునే వారికి జాయినింగ్ బోన‌స్ లేదా వెల్‌క‌మ్ బోన‌స్‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి కాబ‌ట్టి కొత్త‌గా కార్డు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు వీటిని ప‌రిశీలించాలి.

చివ‌రగా..

మీ అవ‌స‌రాలు, బ‌డ్జెట్‌, వ‌ర్తించే రైడ‌ర్లు(రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌), ఛార్జీలు, కార్డు నియ‌మ నిబంధ‌న‌లను తెలుసుకుని త‌గిన కార్డును ఎంచుకుంటే.. ఇంధ‌న ఖ‌ర్చుల‌ను కొంత వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని