మీ క్రెడిట్‌కార్డు రివార్డు పాయింట్ల విలువ తెలుసా? - Credit reward points redemption aand its value
close

Updated : 20/03/2021 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ క్రెడిట్‌కార్డు రివార్డు పాయింట్ల విలువ తెలుసా?

క్రెడిట్‌ కార్డులు వాడితే వచ్చే రివార్డు పాయింట్లు నిజంగా ఓ అదనపు ప్రయోజనం అనే చెప్పాలి. వస్తువులు, సేవల్ని కొనడానికి ఇవి ఉపయోగపడతాయి. అవసరమైతే నగదుగా కూడా మార్చుకోవచ్చు. మనం చేసే లావాదేవీల ఆధారంగా రివార్డు పాయింట్లు వస్తుంటాయి. అసలు ఇవి ఎలా వస్తాయి? ఎలా ఉపయోగించుకోవాలి? వీటిని అదనపు ప్రయోజనం చేకూరేలా ఎలా వాడుకోవాలి? వంటి విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి.

పాయింట్లు ఎలా వస్తాయి?

క్రెడిట్‌ కార్డుతో లావాదేవీ జరిపిన ప్రతిసారీ రివార్డు పాయింట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. మనం చేసే లావాదేవీ విలువపై అది ఆధారపడి ఉంటుంది. కొన్ని కార్డుల్లో ప్రతి రూ.100 ఖర్చుకు ఒక రివార్డు పాయింట్‌ వస్తుంది. మరికొన్నింటిలో రూ.150, రూ.200.. ఇలా కంపెనీని బట్టి పాయింట్లు వచ్చే విధానం మారుతుంది. అలాగే కార్డు రకం, దేనిపై ఖర్చు చేస్తున్నాం, ఎలా ఖర్చు చేస్తున్నాం వంటి అంశాలపైనా ఇది ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా, ఎలాంటి వార్షిక రుసుము లేకుండా లేదా ప్రాసెసింగ్‌ రుసుము లేకుండా ఇచ్చే కార్డుల కంటే ప్రీమియం కార్డుల్లో రివార్డు పాయింట్ల వల్ల కలిగే ప్రయోజనం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బోనస్‌ రివార్డు పాయింట్లు..

కొన్ని కంపెనీలు బోనస్‌ రివార్డు పాయింట్లు అందిస్తుంటాయి. ఒక నిర్ణీత వ్యవధిలో నిర్దేశిత మొత్తాన్ని ఖర్చు చేస్తే అదనపు పాయింట్లు ఆఫర్‌ చేస్తుంటాయి. ఉదాహరణకు ఒక ఏడాదిలో రూ.ఐదు లక్షల లావాదేవీలు జరిపితే 10వేల పాయింట్లు లభిస్తాయని కొన్ని కంపెనీలు చెబుతుంటాయి. ఒక వేళ అదే ఖర్చు రూ.8 లక్షలు దాటితే మరో ఐదు వేల పాయింట్లు అదనంగా ఇస్తామని ప్రకటిస్తుంటాయి. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పాయింట్ల కోసం ఖర్చు చేయొద్దు. మీ అవసరాలను బట్టి ఒకేసారి ఏ పండగ సీజన్‌లోనో షాపింగ్‌ చేస్తే బోనస్‌ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది.

అన్ని కార్డులు రివార్డు పాయింట్లు ఇవ్వకపోవచ్చు..

అన్ని క్రెడిట్‌ కార్డుల్లో రివార్డు పాయింట్లు రాకపోవచ్చు. అందుకే కార్డు తీసుకునేటప్పుడే అన్ని వివరాలు తెలుసుకోవాలి. కొన్ని కార్డుల్లో పాయింట్లకు బదులుగా క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. కొన్నింట్లో డిస్కౌంట్లు అందుతాయి. అయితే, దాదాపు అన్ని క్రెడిట్‌ కార్డులపైనా ఏదో రకమైన ప్రయోజనం పొందే సదుపాయం ఉంటుంది.

పాయింట్ల రిడెమ్షన్‌ విలువ..

ఇక మనకు లభించిన రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేసుకునేటప్పుడు వాటి విలువను దృష్టిలో పెట్టుకోవాలి. పాయింట్ల విలువ కంపెనీ, మనం చేసే లావాదేవీని బట్టి మారుతుంటుంది. ఒక వస్తువు కొనేటప్పుడు ఒక పాయింట్‌ విలువ 20 పైసలుగా ఉంటే.. వేరే వస్తువు తీసుకుంటే అదే పాయింట్‌ 30 పైసలు విలువ చేయొచ్చు. ఉదాహరణకు వాషింగ్‌ మెషీన్‌ కొంటే ప్రతి 2000 పాయింట్లను రూ.500లుగా పరిగణించొచ్చు. అదే ఏసీ కొంటే ప్రతి 2500 పాయింట్లను రూ.500లుగా నిర్ణయించవచ్చు. అలాగే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. మనం తీసుకునే వస్తువు, దాని కంపెనీ, మనం వాడుతున్న కార్డు, వాడుతున్న సమయాన్ని బట్టి పాయింట్ల విలువ మారుతూ ఉంటుంది.

పాయింట్లు ఎక్స్‌పైర్‌ అవుతాయా?

క్రెడిట్‌ కార్డు లావాదేవీల ద్వారా లభించే రివార్డు పాయింట్లకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. అది దాటిన తర్వాత వాటిని మనం వాడుకోలేం. అందుకే క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌పై ఓ కన్నేసి ఉంచాలి. సాధారణంగా చాలా కంపెనీలు ఎక్స్‌పైరీ డేట్‌ను రెండు, మూడు ఏళ్లుగా నిర్ణయిస్తాయి. అతి కొద్ది కంపెనీల్లో నిర్ణీత కాలపరిమితి అనేది ఉండదు. అంటే శాశ్వతంగా ఉండిపోతాయి. కావాల్సినప్పుడు వాడుకోవచ్చు.

రీడెమ్షన్‌ సమయంలో తొందరొద్దు...

వీలైనంత తొందరగా పాయింట్లను రీడీమ్‌ చేసుకోవాలనే ఆలోచనలో ఉండొద్దు. ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని క్షుణ్నంగా పరిశీలించండి. పాయింట్లకు ఎక్కడ అధిక విలువ లభిస్తుందో గమనించండి. అలాగే ఎక్కడ, ఎప్పుడు వాడితే అధిక ప్రయోజనం కలుగుతుందో చూడండి. ఉదాహరణకు ఎయిర్‌పోర్టు లాంజీ ఖర్చులు సాధారణంగా అధికంగా ఉంటాయి. అదే క్రెడిట్‌ కార్డు ఉండి దాంట్లో పాయింట్లు ఉంటే కొంత సొమ్ము ఆదా అవుతుంది. అలాగే కొన్ని కంపెనీలు పండగ సీజన్‌లలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో మన వద్ద ఉన్న పాయింట్లకు ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనే అవకాశం ఉండొచ్చు. అలాగే ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో లావాదేవీ కోసం రీడీమ్‌ చేసుకుంటే సాధారణంగా పాయింట్ విలువ ఎక్కువ ఉంటుంది. మరికొన్ని కంపెనీలు క్రెడిట్‌ కార్డు బకాయిల్ని చెల్లించేందుకు కూడా పాయింట్లను వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంటాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకొని మీకు ఎక్కడ అదనపు ప్రయోజనం కలుగుతుందో చూసుకొని రీడీమ్‌ చేసుకోండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి...

క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభన‌ష్టాలు

క్రెడిట్ కార్డ్ రుణం తీసుకోవాలి అ‌నుకుంటున్నారా ?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని